‘చిన్న’ లెక్కే పెద్ద చిక్కు! 

Huge problem in small issue of krishna river - Sakshi

కృష్ణా బేసిన్‌లో చిన్న నీటి వనరుల వినియోగంపై ప్రతిష్టంభనే

89 టీఎంసీల వినియోగం లెక్కలోకి తీసుకోవాలంటున్న ఏపీ

బోర్డు భేటీలో ఇదే ప్రధాన అంశం  

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య చిన్న నీటి వనరుల కింద నీటి వినియోగం పెద్ద చిక్కులు తెచ్చి పెడుతోంది. చిన్న నీటివనరుల విభాగం కింద నీటి వినియోగం లెక్కలు తేల్చాకనే జలాలను కేటాయించాలని కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తుండగా.. తెలంగాణ సర్కార్‌ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చుతోంది. గత మూడేళ్లుగా చేస్తున్న తరహాలోనే నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నా, దానికి ఏపీ అడ్డుపడుతుండటం ప్రస్తుతం బోర్డుకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది.  

23 టీఎంసీలకు మించి లేదంటున్న తెలంగాణ
బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం కృష్ణాలో ఉమ్మడి ఏపీకి మొత్తంగా 811 టీఎంసీల నీటి వాటా ఉండేది. మైనర్‌ ఇరిగేషన్‌ కింద 111.26 టీఎంసీలు కేటాయించగా, ఇందులో తెలంగాణకు గరిష్టంగా 89.15 టీఎంసీలు, ఏపీకి 22.11 టీఎంసీలు కేటాయించారు. అయితే మైనర్‌ ఇరిగేషన్‌ కింద గత మూడేళ్లుగా పెద్దగా నీటిని వాడుకుంటున్న దాఖలాల్లేవు. ఎప్పుడో 1973లో రాష్ట్రంలోని చిన్న నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని బచావత్‌ ట్రిబ్యునల్‌ 89.11 టీఎంసీలను కేటాయించగా, తర్వాతకాలంలో చెరువులు సహా ఇతర చిన్ననీటి వనరులన్నీ పూడిపోయి, కబ్జాలకు గురై ఆ స్థాయిలో వినియోగించుకోలేని స్థితికి చేరుకున్నాయి. ఏపీ మాత్రం చెరువులు, కుంటల కింద తెలంగాణ 83 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగిస్తోందని అంటోంది. చిన్న నీటివనరుల విభాగంలో రెండు రాష్ట్రాలు వినియోగిస్తున్న జలాల లెక్కలను తేల్చి.. వాటిని పరిగణనలోకి తీసుకుని నీటిని పంపిణీ చేయాలని కోరుతోంది. ఇలా చేస్తే శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల్లో ఉన్న లభ్యత జలాల్లో వాటా పెరుగుతుందని ఏపీ భావనగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిపాదనలను తోసిపుచ్చుతోన్న తెలంగాణ సర్కార్‌.. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 512:299 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని వాదిస్తోంది. చిన్న నీటి వనరుల విభాగం కింద నీటి వినియోగం లెక్కలు తేల్చే వివాదం తిరిగి తెరపైకి రావడంతో ఈనెల 4న జరిగే బోర్డు భేటీలో ఎలాంటి నిర్ణయం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.  

ఈ మూడింటిని ఎజెండాలో చేర్చండి.. 
కాగా కృష్ణా బోర్డు ఇదివరకే ప్రకటించిన 10 అంశాల ఎజెండాలో కొత్తగా టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, కృష్ణా బోర్డు వర్కింగ్‌ మాన్యువల్, గోదావరి మళ్లింపు జలాల అంశాన్ని కూడా చేర్చాలని బుధవారం తెలంగాణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది. ఈ అంశాలు అత్యంత ప్రాధాన్యతగలవని పేర్కొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top