గుడికి జీఎస్టీ గుబులు | Sakshi
Sakshi News home page

గుడికి జీఎస్టీ గుబులు

Published Thu, Mar 1 2018 2:10 AM

GST Problems to Temples - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫలం, పుష్పం, పత్రం, తోయం.. ఖరీదైన కానుకలు సమర్పించకున్నా ఓ పండు, అది లేకుంటే ఓ పువ్వు, అదీ దొరక్కుంటే ఓ ఆకు సమర్పించినా దేవుడు ప్రసన్నమవుతాడని పురాణాల మాట. కానీ ఇప్పుడు ‘జేబు’ను సమర్పించుకుంటే గానీ స్వామి సేవ చేసుకోలేని దుస్థితి దాపురించింది. జనం జేబును గుల్ల చేస్తూ వచ్చిపడ్డ వస్తు సేవల పన్ను (జీఎస్టీ).. దేవుడి గుడినీ ఆగమాగం చేస్తోంది.

అన్నింటికీ అతీతుడైన భగవంతుడినీ వదిలేదిలేదని జీఎస్టీతో కేంద్రం తేల్చి చెప్పింది. ఆ పాపం తనకెందుకని దేవుడు కళ్లు మూసుకోగా పన్ను భారం కాస్తా నేరుగా భక్తుడి జేబును తాకుతోంది. ఇక స్వామి సన్నిధికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు జేబు తడిమి చూసుకోవాల్సిందే.  

కైంకర్యాలూ ‘సేవ’లే..!  
సేవ ఏదైనా పన్నుపోటు తప్పదన్నది జీఎస్టీ వ్యాఖ్యానం. దేవాలయాల్లో స్వామికి చేసుకునే కైంకర్యాలూ ‘సేవ’లే కాబట్టి అవి కూడా పన్ను పరిధిలోకి రావాల్సిందేనని అధికారులు తేల్చేశారు. దీంతో అష్టోత్తరం చేయించినా, హారతి సమర్పించినా ఆర్జిత సేవల రూపంలో జీఎస్టీ కన్ను పడుతోంది. కల్యాణోత్సవాలు, వ్రతాలు, సువర్ణ పుష్పార్చనలు.. ఒకటేమిటి దేవాలయాల్లోని ఆర్జిత సేవలన్నింటిపై 18 శాతం మేర పన్ను చెల్లించాల్సి వస్తోంది.

ప్రసాద సరుకులు కొన్నప్పుడు మళ్లీ 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. అంటే ఆ మేర ధరలు పెరిగిపోయాయి. ఇక రూ.1,000, అంతకంటే ఎక్కువ రుసుము ఉన్న కాటేజీలపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో ఈ మొత్తాన్ని ఆ దేవాలయం ఆదాయంలోంచి చెల్లించాల్సి వస్తోంది.

మేం కట్టలేం బాబోయ్‌..
ఆలయ ఆదాయంలో 12 శాతం దేవాదాయ శాఖకు, 3 శాతం అర్చక సంక్షేమ నిధికి, మరో 3 శాతం సర్వ శ్రేయోనిధికి చెల్లించడమే భారం గా భావిస్తున్న దేవాలయాలు.. 18 శాతం జీఎస్టీ చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఈ భారాన్ని భక్తులపైనే వేస్తామని ప్రభుత్వానికి నివేదించి, అనుమతి పొంది ధరలు పెంచేస్తున్నాయి. జీఎస్టీ భారంతో ఇప్పటికే యాదాద్రి, భద్రాచలంలో ప్రసాదాల ధరలు రూ.5 చొప్పున పెంచారు.

మిగతా దేవాలయాల్లోనూ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల ధరలూ పెంచాలని దేవాదాయ శాఖను దేవాలయాలు కోరాయి. యాదాద్రి అధికారులు ఇప్పటికే ప్రతిపాదన పంపారు. అక్కడ అనుమతి రాగానే మిగిలిన ఆలయాల నుంచీ ప్రతిపాదనలు రానున్నాయి.

జీఎస్టీ వల్లే భారం
జీఎస్టీ పరిధిలోకి దేవాలయాలను తీసుకురావడమే దారుణం. అనాలోచితంగా ఆర్జిత సేవలు, కాటేజీలు, ప్రసాద సామగ్రిపై జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో ఆలయాల ఖర్చు పెరిగి నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో ఆర్జిత సేవలు, ప్రసాదాల ధరలు పెంచుకునేందుకు ఒత్తిడి వస్తోంది. జీఎస్టీ నుంచి ఆలయాలను మినహాయించాలి. ఈ విషయమై ఇప్పటికే చాలాసార్లు కేంద్రానికి విన్నవించాం, మళ్లీ ఒత్తిడి తెస్తాం.
- ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి

ఆర్జిత సేవలు.. ‘సర్వీస్‌’ఎలా?
‘ఆర్జిత సేవలు పన్ను పరిధిలోకి వచ్చే సర్వీస్‌ ఎలా అవుతుందో అర్థం కావటం లేదు. జీఎస్టీతో సగటున ఆలయంపై ప్రతినెలా రూ.60 లక్షలకుపైగా అదనపు భారం పడింది. ప్రసాదాల సరుకులపైనా జీఎస్టీ అంతే అవుతోంది. ఇంత భారాన్ని మోయటం దేవాలయానికి సాధ్యం కావటం లేదు. మూడేళ్ల వరకు ప్రసాద ధరలు పెంచే అవకాశం లేనందున వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా ఆలయ హుండీకి కన్నంపడినట్లేగా’.     
- గీత, యాదాద్రి కార్యనిర్వహణాధికారి

Advertisement
Advertisement