1996 ‘జయ’సింహళీయుల కప్ | Sakshi
Sakshi News home page

1996 ‘జయ’సింహళీయుల కప్

Published Tue, Jan 27 2015 12:07 AM

1996 ‘జయ’సింహళీయుల కప్

భారత ఉపఖండంలో రెండోసారి జరిగిన ఈ ప్రపంచకప్‌లో తొలిసారిగా ఆనవాయితీ మారింది. ఆతిథ్య దేశం విజేతగా అవతరించింది. అప్పటివరకు ఆతిథ్యమిచ్చిన దేశాల జట్లు టైటిల్ గెలవలేదు. కానీ జయసూర్య, అరవింద డిసిల్వా ప్రతాపంతో శ్రీలంక కప్‌ను చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో 12 జట్లు రెండు గ్రూపులుగా పోటీపడ్డాయి. కొత్తగా క్వార్టర్‌ఫైనల్ దశ మొదలైంది. జయసూర్య మెరుపులు, మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ నిలకడ ఈ టోర్నీకే హైలైట్. టెండూల్కర్ (523) ఐదొందల పైచిలుకు పరుగులతో ప్రపంచకప్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఈడెన్ గార్డెన్స్‌లో ప్రేక్షకుల అల్లరితో ఆతిథ్య దేశం అభాసుపాలైంది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో చెత్త ప్రదర్శనతో చేష్టలుడిగిన భారత బ్యాట్స్‌మెన్‌పై ప్రేక్షకుల అసహనం కాస్త అదుపు తప్పింది. భారత్ పరాజయం ఖాయమైన ఈ మ్యాచ్ ను నిలిపేసి లంకను విజేతగా ప్రకటించారు. ఇక పసికూన కెన్యా... వెస్టిండీస్‌ను మట్టికరిపించింది ఈ టోర్నీలోనే! హైదరాబాద్, వైజాగ్‌ల్లో లీగ్ మ్యాచ్‌లు జరిగాయి.
 
ఆతిథ్యం: భారత్, పాక్, శ్రీలంక; వేదికలు: 26;
 పాల్గొన్న జట్లు (12): భారత్, పాక్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా, యూఏఈ, నెదర్లాండ్స్.

Advertisement

తప్పక చదవండి

Advertisement