శెట్టి బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్‌ | Sakshi
Sakshi News home page

శెట్టి బలిజలకు ప్రత్యేక కార్పొరేషన్‌

Published Thu, Nov 22 2018 4:51 AM

YS Jagan Says Special Corporation for Shetty Balija  - Sakshi

ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలోని శెట్టి బలిజ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారికి తోడుగా ఉంటామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ వర్గానికి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 303వ రోజు బుధవారం ఆయన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగించారు. అల్లువాడ వద్ద శెట్టి బలిజ సామాజిక వర్గం వారు పెద్ద సంఖ్యలో జననేతను కలిసి సంఘీభావం తెలిపారు. మరోవైపు వారి సమస్యలనూ వివరించారు. తమ కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, తగినంత మేర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. తమ కులంలో చాలా మంది పేదలున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని విన్నవించారు. వారి సమస్యలను ఓపికగా విన్న జననేత.. ‘దేవుడి దయవల్ల, మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయబోయే విప్లవాత్మక మార్పుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటిది.

పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా వారి మెస్, హాస్టల్‌ ఖర్చుల కోసం ఏటా చదువుకునే పిల్లలకు రూ.20,000.. పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15,000 ఇస్తాం. ఇలా చేయడం వల్ల ప్రతి బీసీ కుటుంబానికీ లబ్ధి కలుగుతుంది. పిల్లలు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితి ఉండదని, వారి కాళ్లపై వారు నిలబడగలరని నమ్ముతున్నా. నేను ఇదివరకే ప్రకటించిన విధంగా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ను తెస్తాం. అందులో కచ్చితంగా శెట్టిబలిజలకు కూడా ఓ కార్పొరేషన్‌ ఉంటుంది. దాని గురించి ఎవరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరమే లేదు. మీకు ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిరిగా నేను  అంతిస్తా.. ఇంతిస్తా.. అని చెప్పి మోసం చేయడం నాకు నచ్చని పని. నాకు అలా చేయడం చేతకాదు. మనం చేయబోయే మరో విప్లవాత్మకమైన మార్పు ఏమిటంటే.. కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఇవాళ కార్పొరేషన్‌ అనేది ఒక పరిహాసంగా మారిపోయింది.

ఒక ఊరిలో వెయ్యి మంది ఉంటే ఐదు మందికి కూడా ఆ కార్పొరేషన్‌ నుంచి లబ్ధి చేకూరడం లేదు. లబ్ధి జరగాలంటే లంచాలివ్వక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయబోతున్నాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం నెలకొల్పుతాం. ఆ గ్రామానికే చెందిన పది మంది పిల్లలను ఎంపిక చేసి అందులో నియమిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ 72 గంటల్లో ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం. నవరత్నాల ద్వారా పేదలందరినీ ఆదుకుంటాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 ఏళ్లు నిండిన అక్కలందరికీ నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా రూ.75000 ఉచితంగా ఇచ్చి తోడుగా ఉంటాం’ అని భరోసా ఇచ్చారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు మంత్రి పదవి ఇస్తానని, శెట్టి బలిజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని స్పష్టం చేశారు. జగన్‌ను కలిసిన వారిలో శెట్టిబలిజ మహానడు రాష్ట్ర అధ్యక్షుడు కుడిపూడి సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చిట్టెబ్బాయి, యువ నేతలు చెల్లుబోయిన శ్రీనివాసరావు, గుత్తుల శ్రీను, గుబ్బల తులసికుమార్, గెద్దాడ వెంకటేశ్వరరావు, పితాని ప్రసాద్, విజయనగరం శెట్టి బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు గండిబోయిన ఆది, ప్రధాన కార్యదర్శి జి.సూరిబాబు, కుడిపూడి బాబుతో తదితరులు ఉన్నారు. 
 
పోటెత్తిన మన్యం 
మన్యంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు అపూర్వమైన రీతిలో స్పందన లభించింది. అడుగడుగునా గిరిజనులు ఆయనకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. కురుపాం శివారులో యాత్ర ప్రారంభించింది మొదలు.. దాసరిపేట, తాళ్లడుమ్మ, చిన్న మేరంగి, అల్లువాడ, పెద్ద తుంబిలి క్రాస్, చిన్న తుంబిలి క్రాస్, జోగులడుమ్మ, శిఖబడి వరకు పెద్ద సంఖ్యలో జనం ఆయన అడుగులో అడుగు వేశారు. ఎమ్మెల్యే సొంత ఊరైన చినమేరంగిలో గ్రామమంతా తరలి వచ్చింది. అగ్రిగోల్డ్‌ బాధితులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారు జననేత ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. అందరి సమస్యలు విన్న జననేత వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.   

‘షాదీ ముబారక్‌’ ప్రకటనలకే పరిమితం 
అన్నా.. మాది చినమేరంగి. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన షాదీ ముబారక్‌ పథకం ప్రకటనలకే పరిమితమైంది. ఈ పథకం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా మంజూరు కావడం లేదు. మా ఇంట్లో ఆడపిల్లకు 2018 జనవరి 27న వివాహం చేశాము. ఆ వెంటనే షాదీ ముబారక్‌ పథకం కోసం అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేశాము. ఈ పథకం కింద రూ.75 వేలు వస్తుందని ఎదురు చూస్తున్నాం. అప్పుచేసి పెళ్లి చేశాం. ఈ పథకం డబ్బులు వస్తే అప్పు తీరుద్దామనుకున్నాం. కానీ ఇంత వరకు మంజూరు చేయలేదు.  
– షేక్‌ దిల్‌షాద్, షేక్‌ రేష్మా, షేక్‌ నూర్జహాన్‌  

ఆరోగ్యశ్రీ వర్తించక పుస్తెలమ్ముకోవాల్సి వచ్చింది 
అన్నా.. మాది జియ్యమ్మవలస మండలం లింగాలవలస. నాకు ఏడాదిన్నర కిందట పక్షవాతం వచ్చింది. కాలు, చేయి పని చేయడం లేదు. ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. నెల రోజుల పాటు విశాఖపట్నం కళా ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాను. మొత్తం రూ.6 లక్షల వరకు ఖర్చయింది. ప్రస్తుతం మందుల ఖర్చు నెలకు రూ.5 వేలు అవుతోంది. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో నా భార్య మెడలో పుస్తెలతాడు, నా సొంత ఇల్లు కూడా అమ్ముకొని చికిత్స చేయించుకున్నాను. ప్రస్తుతం ఎటూ వెళ్లలేని పరిస్థితి నాది. నా బిడ్డలు కూడా చిన్న వారే. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి పేదవాడికీ ఎంత ఖర్చు అయినా ఉచితంగానే వైద్యం చేయించేవారు. ఆయన దూరమవ్వడం మా దురదృష్టకరం. టీడీపీ పాలనలో ఏ సంక్షేమ పథకం కూడా మా దరి చేరలేదు. చాలా ఇబ్బందుల పడాల్సి వస్తోంది.     
– గొర్లె శ్రీనివాసరావు

అగ్రిగోల్డ్‌ బాధితులను మీరే ఆదుకోవాలి 
అగ్రిగోల్డ్‌ సంస్థ ద్వారా మోసపోయిన బాధితులను మీరే ఆదుకుని వారికి చెల్లింపులు జరిగేలా చూడాలన్నా.. మా గ్రామం నుంచి సుమారు 150 మంది అగ్రిగోల్డ్‌లో ఖాతాదారులుగా ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న రూపాయి.. రూపాయి కూడబెట్టి ఆ సంస్థలో దాచుకున్నాం. అవసరానికి ఉపయోగపడుతుందనుకుంటే ఆ సంస్థ చేతులెత్తేసి మమ్మల్ని నట్టేట ముంచేసింది. రూ.50 వేలకు గాను ఒక్క రూపాయి కూడా ఇంతవరకు అందలేదు. మీరు ముఖ్యమంత్రి కాగానే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి.    
 – గొల్లపిల్లి గౌరమ్మ, దాసరిపేట, జియ్యమ్మవలస మండలం

Advertisement

తప్పక చదవండి

Advertisement