బాబు ప్రతి అడుగులోనూ మోసమే

YS Jagan Mohan Reddy Fires On Chandrababu At Muslims Meet - Sakshi

ఆ పెద్దమనిషి దృష్టిలో ముస్లింలు ఓటు బ్యాంకే 

ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం

ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు 

వంచించాడు.. వివక్ష చూపాడు..

డిక్లరేషన్‌ ఏమైంది?.. కేబినెట్‌లో ఒక్క ముస్లింకూ చోటివ్వలేదు 

మనందరి ప్రభుత్వం రాగానే అన్ని విధాలా ఆదుకుంటాం 

వైఎస్సార్‌ దుల్హాన్‌ కింద లక్ష రూపాయలు ఇస్తాం 

వైఎస్సార్‌ చేయూత కింద ప్రతి అక్కకూ ఉచితంగా రూ.75 వేలు

నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్కరంటే ఒక్కరూ ముస్లిం మంత్రి లేని కేబినెట్‌ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు కేబినెట్‌ ఒక్కటే.ముస్లింలు లేని కేబినెట్‌ ఎప్పుడూ లేదు. చివరకు బీజేపీ పాలిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని యోగీ ఆదిత్యనాధ్‌ కేబినెట్‌లో కూడా ఓ ముస్లిం మంత్రిగా ఉన్నారు. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లింలే కాకుండా ఎస్టీలు కూడా మంత్రులుగా లేరు.
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసమేనని, ముస్లిం మైనారిటీలను మనుషులుగా చూడకుండా ఓటు బ్యాంకుగా చూశారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రణాళిక మొదలు నంద్యాల ఉపఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీ మోసమేనన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని చినగదిలిలో జరిగిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఉర్దూలో తన ప్రసంగాన్ని ప్రారంభించి అందరికీ నమస్కారం చేసిన అనంతరం తెలుగులో మాట్లాడారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ సమ్మేళనంలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

బాబు పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? 
‘‘మరో నాలుగు నెలల్లోనో.. ఆరు నెలల్లోనో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో విశాఖ నగరంలో ఇవాళ ఇక్కడ ముస్లింల మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో మనమంతా సంతోషంగా ఉన్నామా? మనకు మంచి జరిగిందా? లేదా? అన్నది ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నా. అభివృద్ధి.. అభివృద్ధి అని చంద్రబాబు పదేపదే చెబుతుంటాడు.. చంద్రబాబు డిక్షనరీలో నిర్వచనం ఏంటో తెలియదు కానీ నాకు, మీకు తెలిసిన అభివృద్ధి ఏమిటంటే.. నిన్నటి కంటే ఇవాళ బాగుంటే దాన్ని అభివృద్ధి అంటాం. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలన చూశాక ఒక్కసారి నాన్నగారి పరిపాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నా.   

టీడీపీ మేనిఫెస్టో ఎక్కడుంది? 
ఎన్నికలకు వెళ్లే ముందు రాజకీయ పార్టీలు మేనిఫెస్టో ప్రకటిస్తాయి. చంద్రబాబు ఫ్రెష్‌గా ఫొటో దిగి (మేనిఫెస్టోను చూపుతూ) టీడీపీ మేనిఫెస్టోలో ప్రచురించారు. రాత పూర్వకంగా ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లింది. ఇవాళ టీడీపీ 2014 మేనిఫెస్టో ఎక్కడా కనిపించదు. ఆ పార్టీ వెబ్‌సైట్‌లో కూడా. ఎందుకంటే ఎన్నికలకు ముందు దీన్ని చాల గొప్పగా చూపారు. ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించారు. ప్రతి కులానికి అది చేస్తాను.. ఇది చేస్తానని చెప్పారు. ఇవాళ ఏదీ చేయలేదు కనుక ఇది కనిపిస్తే చంద్రబాబును ప్రజలు కొడతారని తీసేశారు. ఇదే ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు నాయుడు ముస్లింలకు రెండు పేజీలు కేటాయించారు. అందులోని ప్రధానాంశాలు క్లుప్తంగా మీకు చెబుతాను. వాటిని చంద్రబాబు చేశారా? లేదా? అన్నది మీ మనస్సాక్షిని అడగండి. ప్రతి ముస్లిం పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదువులు అన్నాడు. జరిగిందా? (లేదు లేదని జవాబు). నిరుపేద ముస్లిం సోదరుల కోసం ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఇచ్చారా? (లేదు లేదని జవాబు) ఇస్లాం బ్యాంకు లేదు. వడ్డీ లేని రుణాలు లేవు. రెండూ జరగలేదు. జస్టిస్‌ రంగనాథమిశ్రాన్‌కమిషన్‌న్‌ సిఫార్సులకు అనుగుణంగా వ్యవహరిస్తానని, ముస్లిం విద్యార్థులకు సీట్లు కూడా కేటాయిస్తామన్నారు. ఏదీ అమలు కాలేదు. నిరుద్యోగ ముస్లిం యువతకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణం ఇస్తామన్నారు. మోసం. వృత్తి విద్య, సాంకేతిక విద్య కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తానన్నాడు. ఇలా అన్నీ మోసాలే కనిపిస్తాయి. 

ఈయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడా?
మొన్న గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో మైనారిటీ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ పరిస్థితిని చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదు. ఎన్నికల సమయంలో టీవీల్లో యాడ్స్‌ చూస్తే.. ఆపదల్లో ఆయనొస్తారు.. కాపాడతారని ఊదరగొట్టారు. ఆ తర్వాత ఆయన వచ్చాడు గానీ నిత్యం మైనర్‌ బాలికలపై మొదలు మహిళల వరకు అఘాయిత్యాలే. గుంటూరులోని చంద్రబాబు క్యాంపు ఆఫీస్‌ పక్కనే ఇటువంటి పరిస్థితి జరిగినా పట్టించుకునే నాథుడు లేడు. అత్యాచారం లాంటి ఘటనలు జరక్కుండా చూడాల్సింది పోయి, నిందితునికి వైఎస్సార్‌సీపీతో ముడిపెట్టే కార్యక్రమం చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ పోరాటం చేయడంతో ఆ వ్యక్తి టీడీపీలో క్రియాశీల కార్యకర్త అని అసలు విషయం బయటపడింది. ఊర్లో జరిగిన గొడవకు భయపడి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. చివరికి తామే ఆత్మహత్య చేసుకునేలా చేశామని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు ఈ పెద్దమనిషి.

చివరకు దాన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా? గుంటూరులో ఓ ముస్లిం అమ్మాయిపై కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తే.. వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన చేస్తే వారిపైన, ఇతరులపైనా కేసులు పెట్టించారు. ఇప్పుడు కథ క్లైమాక్స్‌కు చేసింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని తెలిసి ఇప్పుడు నారా హమారా.. టీడీపీ హమారా అని పెద్ద మీటింగ్‌ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలను గుంటూరుకు పిలిపించారు. అక్కడకు వెళ్లిన ముస్లింలలో కొంతమంది అయ్యా.. నీవు ఎన్నికలప్పుడు ఈ మాటలు చెప్పావ్, ఈ హామీలు ఇచ్చావు, వాటిని ఎందుకు అమలు చేయడం లేదని శాంతియుతంగా ప్లకార్డులు పట్టుకుని చూపించారు. వాళ్ల డిమాండ్లు కూడా చాలా చాలా చిన్నవి.

అవేమిటంటే మదర్సా విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు, యూనిఫాంలు ఎక్కడ? ఉర్దూ మీడియం పాఠశాలలు ఎక్కడ? టీడీపీలో ముస్లిం నాయకత్వానికి ఎందుకు ప్రాధాన్యత లేదు? అని ఆ యువకులు ప్రశ్నించారు. నిజానికి ఇవన్నీ వాస్తవాలే కదా?  ఇందుకు గాను ఆ పిల్లలను 30 గంటల పాటు మూడు పోలీసు స్టేషన్లు మారుస్తూ విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తారా? వాళ్లు దేశాన్ని విడగొట్టమని కోరుతున్నట్టుగా దేశం ద్రోహం కేసు పెడతారా? ఆ పిల్లల్లో ఒకరు ఆర్మీకి ఎంపికయ్యాడు. రేపు ఈ పిల్లాడి భవిష్యత్‌  ఏం కావాలి? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హుడేనా? 

ఎటు గాలి వీస్తే అటు... 
వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు 23 మందిని సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి రాజకీయం చేస్తారు. వారిలో ఏకంగా నలుగురిని మంత్రులను కూడా చేశారు. కానీ నేను నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకునేటప్పడు.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నా పార్టీలోకి రమ్మని చెప్పాను. (పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు) ఆ ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణి రెడ్డి అప్పటికి తన ఆరేళ్ల పదవి కాలంలో కేవలం మూడు నెలలు మాత్రమే అనుభవించారు. ఇంకా ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం ఉంది. కానీ ఆ సభలోనే తన రాజీనామా పత్రాన్ని నా చేతికి ఇచ్చారు. స్పీకర్‌కు ఒక కాపీ పంపించమని చెప్పా. రాజకీయాలంటే ఇవి. కాని ఇక్కడ మాత్రం ఏం జరుగుతుందో తెలుసా? అవసరం ఉన్నప్పుడు, నరేంద్ర మోదీ గాలి వీస్తున్నప్పడు బీజేపీ మంచిది. అప్పడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. ఆశ్చర్యమేమిటంటే 1999లో ఇదే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

2002లో ఇదే బీజేపీని తిట్టాడు. 2004లో అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 2004 ఎన్నికల్లో ఓడిపోయాక.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చరిత్రాత్మక తప్పిదమంటాడు. 2012లో అయితే ఏకంగా హైదరాబాద్‌లో ముస్లిం సోదరుల మీటింగ్‌ పెట్టి ముస్లిం డిక్లరేషన్‌ అని పేరు పెట్టి బీజేపీతో పొత్తు చరిత్రాత్మక తప్పిదమన్నాడు. రెండేళ్లు తిరగకముందే 2014లో ఇదే వ్యక్తి మోదీ గారి గాలి విపరీతంగా వీస్తుందని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. నాలుగన్నర సంవత్సరాల పాటు చిలకా గోరింకలా సంసారం చేశారు. ఒకరికొకరు పొగుడుకున్నారు. 2017 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రానికి చేయని మేలు మన రాష్ట్రానికి చేసిందని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో గొప్పగా చెప్పకున్నాడు.  ఇప్పుడు బీజేపీతో విడాకులు తీసుకున్న తర్వాత.. బాబుపై ఉన్న వ్యతిరేకతనంతా ఎవరిపైనో ఒకరిపైకి నెట్టేయాలని చూసి మళ్లీ మోదీపైనే వేస్తాడు. వాళ్లు సహకరించలేదు కనుక తను చేయలేకపోయానని డ్రామా మొదలు పెట్టాడు.   

మన ప్రభుత్వంలో ఇలా చేస్తాం 
రేపు మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాల పథకాలతో అందరినీ ఆదుకుంటామని ప్రకటించాం. ఈ పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పార్టీ వెబ్‌సైట్‌ డబ్లు్యడబ్లు్యడబ్లు్య. వైఎస్సార్‌కాంగ్రెస్‌.కామ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని గతంలో చెప్పా. ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా పారదర్శకంగా అమలు చేస్తాం. మొదటి సంవత్సరం గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత లబ్ధిదారును పారదర్శకంగా ఎంపిక చేస్తాం. రెండో సంవత్సరం నుంచి మీ చేతికి డబ్బు ఇస్తాం. నాలుగేళ్లలో మీ చేతికి రూ.75 వేలు ఉచితంగా ఇచ్చి మీ చేయి పట్టుకుని నడిపిస్తాం. ముస్లింలకు మరో కానుక.. వైఎస్సార్‌ దుల్హాన్‌ అని పేరు పెట్టి.. రూ.లక్ష ఇస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.   

చంద్రబాబు చేసిందేమిటి? 
ఈ పెద్దమనిషి హయాంలో ఎక్కడా కూడా న్యాయం జరుగదు. ప్రతి అడుగులోనూ అన్యాయం, మోసమే కనిపిస్తుంది. చంద్రబాబు చేసే మోసం ఏ స్థాయిలో ఉంటుందనే దానికి చిన్న ఉదాహరణ చెబుతా..   మొన్న నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన చంద్రబాబు చేసిన జిమ్మిక్కు ఇది. కడపలోని ఫాతిమా మెడికల్‌ కళాశాలలో ఎ– క్యాటగిరిలో కేవలం పది వేల రూపాయల ఫీజు ఉండే సీట్లు సంపాయించిన కొంతమంది మైనారిటీ పిల్లలలను నంద్యాలకు తీసుకువచ్చారు. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ వారి సీట్లను అప్రూవ్‌ చేసింది. ఏడాది పాటు మెడికల్‌ కాలేజీలో చదివారు. తర్వాత ఆ కాలేజీకి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు రద్దు చేసింది. దీంతో ఆ పిల్లలు రోడ్డున పడ్డారు. పరిస్థితి ఎంత దారుణం అంటే.. వారందరికీ మెరిట్లో సీట్లు వచ్చాయి. అలాంటి పిల్లలకు కాలేజీలో సీట్లు అలాట్‌మెంట్‌ ఇచ్చారు. దాంట్లో ఎవ్వరి తప్పు లేదు. పిల్లలు అడిగారు.. ప్రభుత్వం ఇచ్చింది.

ఆ తర్వాత సీట్లు రద్దయితే దానికి ప్రభుత్వం తప్పు కాకుండా ఎలా పోతుంది?  కానీ  చంద్రబాబుకు మానవత్వం లేదు. ఏం చేశాడో తెలుసా? ఆ పిల్లలు పూర్తిగా ఇబ్బందులు పడుతుంటే.. వారిని నంద్యాల ఉప ఎన్నికలకు తీసుకొచ్చి స్టేజీ మీద నిలబెట్టి ఏమి చెప్పారో తెలుసా? నేను సీట్లు ఇచ్చి ఈ పిల్లల్ని కాపాడాను అని చెప్పాడు. నంద్యాల ఉప ఎన్నికలు అయిపోయాయి. ఆ తర్వాత ఆ పిల్లలకు సీట్లు రాలేదు. దీంతో ఆ పిల్లలు విజయవాడకు వెళ్లి.. మాకు సీట్లు ఇచ్చానన్నావ్, ఫీజులు కడతానన్నావు కానీ మాకు సీట్లు రాలేదు, ఇప్పుడు మేము ఏమి చేయాలంటూ.. ఆ పిల్లలు ఏకంగా వాటర్‌ ట్యాంకు ఎక్కారు. పోలీసుల ద్వారా ఆ పిల్లలను పిలిపించుకుని చంద్రబాబు క్లాస్‌ పీకారు. మళ్లీ ఎంట్రన్స్‌ రాయండి, ఫీజులు తర్వాత నేనే కడుతానని చెప్పారు ఈ పెద్దమనిషి. మూడేళ్లు అయిపోయింది. మళ్లీ  నీట్‌ పరీక్షలు రాస్తే మెరిట్‌ రాలేదు. కానీ క్వాలిఫై అయ్యారు. బి– క్యాటగిరిలో ఫాతిమా కళాశాల వారు సీట్లు ఇచ్చారు. ఎ– క్యాటగిరీలో సీటు రూ.పది వేలయితే బి– క్యాటగిరీ సీటు ఫీజు రూ.12 లక్షలు. ఫీజులు కడతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. ఆ పిల్లలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇటువంటి దారుణమైన మోసం ఓ ముఖ్యమంత్రే చేస్తే ఆయన్ను ఏమనాలి? 

అడక్కపోయినా వైఎస్‌ ఎన్నో చేశారు 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం గురించి ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎన్నడూ జరగని విధంగా ఎవరు అడగకపోయినా కూడా ప్రతి ముస్లిం కుటుంబానికి మంచి జరగాలని ఆరాటపడి ఎన్నికల ప్రణాళికలో చెప్పకపోయినా, ఎవరూ అడక్కపోయినా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ రోజుల్లో ముస్లింలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేశారు. చదువుల విప్లవాన్ని తెచ్చారు. నాన్నగారి హయాంలో మైనారిటీల కోసం 12 రెసిడెన్షియల్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్స్‌ ఏర్పాటు చేశారు. పేదలకు జబ్బు చేసినప్పుడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫోన్‌ చేయగానే 20 నిమిషాల్లో వచ్చేలా 108 అంబులెన్స్‌లను ఏర్పాటు చేయించారు. పేదలకు ఉచితంగా వైద్యం చేయించారు. ఆ రోజుల్లో మైనారిటీ కార్పొరేషన్‌ నుంచి రెండు లక్షల మంది ముస్లిం సోదరులకు రూ.175 కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘతన రాజశేఖరరెడ్డి గారిది. పేదవారికి ఆ రోజుల్లో ఇల్లు అన్నది ఒక స్వప్నం. పేదవాడికి ఇల్లు అనేది భద్రత (సెక్యూరిటీ). అలాంటి పరిస్థితి వైఎస్‌ఆర్‌ కల్పించారు. దేశంతో పోటీ పడి తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్‌లో 48 లక్షల ఇళ్లు కట్టించారు.  

ఓవైపు కేసులు పెడుతూ..మరోవైపు మొసలి కన్నీరు కారుస్తారా? 
ముస్లిం, మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ఎన్నికల హామీలు నేరవేర్చాలని ప్లకార్డులు చూపించిన వారిపై ఓవైపు కేసులు పెడుతూ.. మరోవైపు నారా హమారా అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ముస్లింల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ కేసులను విత్‌డ్రా చేసుకోవాలి. వైఎస్‌ జగన్‌ ముస్లింలకు ఎంతో భరోసా ఇస్తున్నారు.      
– ఖాదర్‌ బాషా, వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

దమ్ముంటే వెంటనే మీ ఎంపీలతో రాజీనామా చేయించు బాబూ..
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకున్నారు. చంద్రబాబూ.. మీకు ఆ దమ్మూ, ధైర్యముంటే వెంటనే మీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించు. ఎన్నికలకు పోదాం. ప్రత్యేక హోదా విషయంలో ఎవరి చిత్తశుద్ధి ఎంతో తెలుస్తుంది. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన మహానేత వైఎస్సార్‌.
– హబీబ్‌ అబ్దుల్‌ రెహ్మాన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి 

సెకండ్‌ క్లాస్‌ సిటిజన్స్‌గా చూస్తున్నారు
ముస్లింలను చంద్రబాబు ప్రభుత్వం సెకండ్‌ క్లాస్‌ సిటిజన్స్‌గా చూస్తోంది. ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదు. మతతత్వ పార్టీలతో అంటకాగుతూ ముస్లింలను అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారు. హామీలపై ప్రశ్నించిన ముస్లిం యువకులపై దేశద్రోహం కేసు పెట్టడమే ఇందుకు నిదర్శనం.    
– షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్, రిటైర్డ్‌ ఐజీ, వైఎస్సార్‌సీపీ నేత 

ముస్లింలను అణగదొక్కేందుకు బాబు కుట్రలు ..
ముస్లింలను అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. ముస్లింల కోసం వందల హామీలిచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. నాలుగున్నరేళ్లయినా తన కేబినెట్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడమే చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం.     
– మహ్మద్‌ ముస్తఫా,ఎమ్మెల్యే, గుంటూరు తూర్పు 

జగన్‌ సీఎం అయితేనే ముస్లింలకు మంచి రోజులు 
తన సొంత మేనమామ కడప నుంచి పోటీ చేసేందుకు ముందుకొచ్చినా కూడా నాకు టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ది. చంద్రబాబేమో అబ్దుల్‌ ఖాదిర్‌ను పక్కన పెట్టి హిందూపురం టికెట్‌ను తన వియ్యంకుడు బాలకృష్ణకు కట్టబెట్టాడు. ముస్లింలకు మళ్లీ మంచి రోజులు రావాలంటే జగన్‌ను సీఎం చేసుకోవాలి.     
– అంజద్‌ బాషా, ఎమ్మెల్యే, కడప  

ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆ మహానేతదే.. 
అన్నా మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేట. స్వాతంత్రం రాక ముందు ముస్లింల పరిస్థితి ఎలా ఉందో.. ఈ టీడీపీ పాలనలో అదేవిధంగా ఉందన్నా. నాలుగున్నరేళ్లుగా దయనీయ పరిస్థితిలో ఉన్నాము. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మహానేత వై.ఎస్‌ రాజశేఖరరెడ్డిదే. ఆయన దయవల్ల మా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను, నలభై ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీని మట్టి కరిపించిన ఏకైక ప్రజా నాయుకుడువి నీవే అన్నా. రాజకీయంగా మా ముస్లింలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు పెంచాలన్నా. మహిళలకు కూడా అవకాశం కల్పించాలన్నా. రాజన్న పాలన రావాలంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడమే మార్గం. మా ముస్లింలందరూ మీ వెంటే ఉన్నామన్నా. అన్నా.. ఇటీవల చంద్రబాబు మైనారిటీల పేరుతో సభలు పెట్టి ‘నారా హమారా – టీడీపీ హమారా’ అంటున్నారు కానీ అది సరికాదన్నా. కార్పొరేట్‌ వర్గాలకు సహారా – బీజేపీ కా బహారా. మా నినాదం ‘వైఎస్సార్‌ హమారా – జగనన్న సహారా హమారా’.   
 – జరీనా సుల్తాన్, చిలకలూరిపేట 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్లే మా అక్క చదువుకుందన్నా.. 
అన్నా.. నేను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ బైపీసీ చదువుతున్నాను. మహానేత వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతోనే మా అక్క చదువుకుంది. ఇప్పడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. మా అక్కలాగ నేను బాగా చదువుకుంటాను. అన్నా నాది ఒక ప్రశ్న. టీడీపీ ప్రభుత్వం టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటోంది కానీ చేయడం లేదు. టెట్‌ 1, టెట్‌ 2 అంటూ కాలయాపన చేస్తోంది. ఇప్పుడు మళ్లీ టెట్‌ 3 అంటోందే తప్ప డీఎస్సీ ప్రకటన వెలువరించలేదన్నా.. ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలే రావు. మా విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే మళ్లీ రాజన్న పాలన రావాలి.     
– నఫీసా, కంచరపాలెం (విశాఖ) 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top