‘కేసీఆర్‌ హత్యా రాజకీయాలు చేస్తున్నారు’ | Sakshi
Sakshi News home page

ప్రేమ్‌ కుమార్‌ను టీఆర్‌ఎస్‌ నాయకులే చంపారు : బండి సంజయ్‌

Published Wed, Jun 5 2019 6:12 PM

KCR Played Murder Politics Bandi Sanjay Says - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్నామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంతో..భయబ్రాంతులకు గురైన కేసీఆర్‌ హత్యా రాజకీయాలను ప్రొత్సహిస్తున్నారని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో బీజేపీ కార్యకర్త ముష్టి ప్రేమ్ కుమార్ హత్యలో టీఆర్ఎస్ అగ్రనాయకుల ప్రమేయముందని ఆరోపించారు. ప్రేమ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు కలిపి సామూహికంగా హత్య చేసేందుకు టిఆర్ఎస్ నాయకత్వం కుట్రపన్నిందని తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌ల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం హత్యా రాజకీయాలకు తెరలేపిందని బండి సంజయ్ వివరించారు. రానున్న రోజుల్లో దాడులు హత్యా రాజకీయాలు మితి మీరు పోయే ప్రమాదం ఉందని వాటిని ధీటుగా ఎదుర్కునేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రేమ్ కుమార్ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడులు, హత్య రాజకీయాలకు పాల్పడితే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కు పట్టిన గతే కెసిఆర్ అనుభవిస్తారని బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు నాయకులు మనోధైర్యంతో ప్రజా క్షేత్రంలో ముందుకు సాగి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement