మట్టినీ మింగేస్తున్నారు | Sakshi
Sakshi News home page

మట్టినీ మింగేస్తున్నారు

Published Thu, May 24 2018 3:55 AM

Gadikota Srikanth Reddy Fires on TDP Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అడ్డూ అదుపు లేకుండా దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ నేతలు చివరకు మట్టి, ఇసుకను కూడా వదలడంలేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాయల్టీ కూడా చెల్లించకుండా మట్టిని తవ్వుకోవచ్చంటూ జీవోలు విడుదల చేయడం టీడీపీ సర్కారు బరితెగింపునకు నిదర్శనమన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ చిన్న నీటి వనరులైన చెరువుల్లో మట్టి, ఇసుక తొలగించటంపై గతంలో ఆంక్షలుండేవి. జీవో 23 ప్రకారం వాణిజ్య అవసరాలకు మాత్రమే మట్టి, ఇసుక వాడుకునే అవకాశం ఉండేది.

చంద్రబాబు సర్కారు రెండు రోజుల క్రితం జీవో నంబర్‌ 40 పేరుతో బరి తెగింపు ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వుకోవచ్చు. మట్టి, ఇసుక అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి రాయల్టీ కూడా చెల్లించాల్సిన అవసరంలేదు. ఒకవైపు చెరువులు తవ్వినందుకు బిల్లులు తీసుకుంటూ మరోవైపు మట్టి అమ్ముకుంటూ టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఫిర్యాదు కూడా చేశారు’ అని  శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

నీరు–చెట్టుకు ఉపాధి నిధుల మళ్లింపు
‘నీరు – చెట్టు పథకం పేరుతో ఉపాధి నిధులను మళ్లించి టీడీపీ నేతలకు కోట్లు దోచి పెడుతున్నారని గడికోట ఆరోపించారు. మహిళలు, బాలికలకు రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపి దోచుకున్నదంతా కక్కిస్తామని స్పష్టం చేశారు.   

Advertisement
Advertisement