కారులో ఐదు కట్టల 2వేల నోట్లు! | Sakshi
Sakshi News home page

కారులో ఐదు కట్టల 2వేల నోట్లు!

Published Wed, Nov 23 2016 2:43 PM

కారులో ఐదు కట్టల 2వేల నోట్లు! - Sakshi

బ్యాంకులలో విపరీతమైన రద్దీ, ఎంత ప్రయత్నించినా వారానికి 24 వేల రూపాయలు దొరకడం కూడా కష్టమే. అంత తీసుకునే అవకాశం ఉన్నా.. బ్యాంకులో అంత క్యాష్ లేదంటూ ఐదారు వేలు ఇచ్చి పంపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పది లక్షల రూపాయల కొత్త నోట్లు దొరకడం ఎవరికైనా సాధ్యమేనా? అది కూడా కొత్తగా తళతళలాడిపోయే రెండు వేల రూపాయల కట్టల రూపంలో దొరుకుతాయా? మామూలు ప్రజలకైతే సాధ్యం కాకపోవచ్చేమో గానీ.. అహ్మదాబాద్‌లో ఓ కుటుంబానికి మాత్రం ఎంచక్కా దొరుకుతున్నాయి. మారుతి స్విఫ్ట్ కారులో వెళ్తున్న ముగ్గురు సభ్యుల కుటుంబాన్ని పోలీసులు మామూలుగా ఆపి తనిఖీ చేశారు. ఆ కారులో ఏకంగా రూ. 12.4 లక్షల రూపాయల కరెన్సీ వాళ్ల దగ్గర పట్టుబడింది. అందులో చాలావరకు 2వేల రూపాయల కొత్త నోట్లే ఉన్నాయి. 
 
ఐదు కట్టలతో పాటు విడిగా మరికొన్ని నోట్లు కూడా వాళ్ల దగ్గర ఉన్నాయి. పెళ్లి ఖర్చుల కోసం చెల్లించేందుకు వేర్వేరు బ్యాంకుల నుంచి తాము ఈ మొత్తాన్ని డ్రా చేసుకున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ, కనీసం వాళ్ల దగ్గర వెడ్డింగ్ కార్డు కూడా లేదు. దాంతో మొత్తం 500 కొత్త 2వేల రూపాయల నోట్లను ఆదాయపన్ను శాఖ అధికారులకు పోలీసులు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత పెళ్లిళ్ల కోసం రూ. 2.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అది కూడా పెళ్లి కూతురు వైపు వాళ్లు గానీ, పెళ్లి కొడుకు వైపు వాళ్లు గానీ ఎవరో ఒకరే ఈ మొత్తాన్ని తీసుకోవాలి. తర్వాత కూడా నగదు రూపంలో చెల్లించిన వాటన్నింటికీ రసీదులు కూడా తీసుకుని, సమర్పించాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement