ఒక బ్రేకప్‌ ప్రేమకథ!

Justin Bieber and Selena Gomez's relationship guidance - Sakshi

ప్రేమంటేనే కలవడం, విడిపోవడం; కలవడం విడిపోవడం. కొన్నిసార్లు ప్రేమలో ఉన్నప్పుడే కలిసి విడిపోతుంటారు. కొన్నిసార్లు ఇంకఈ ప్రేమలేం వద్దంటూ విడిపోయి, మళ్లీ కలుస్తుంటారు. వీళ్లూ వాళ్లుఅనేం లేదు అందరూ ఇలాంటి ప్రేమల్లో చిక్కుకున్నవారే! తమ పాటలతో ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని అభిమానులను సంపాదించుకున్న స్టార్‌ సింగర్స్‌ జస్టిన్‌ బీబర్, సెలీనా గోమెజ్‌ కూడా ఓ మంచి ప్రేమకథ నడిపించారు. నడిపించారు అనేకంటే నడిపిస్తూనే ఉన్నారు అనాలి. కాకపోతే అది వింత ప్రేమకథ! ఒక బ్రేకప్‌ ప్రేమకథ!!

2010 డిసెంబర్‌..
అçప్పటికే తమ తమ కెరీర్లలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారిద్దరూ. ఏదో మ్యాజిక్‌ పనిచేసింది ఇద్దరి మధ్య. ఇక అంతే.. ప్రేమలో పడిపోయారు. అప్పటికి జస్టీన్‌ బీబర్‌ వయసు 16 ఏళ్లు. సెలీనా గోమెజ్‌కు 18 ఏళ్లు. లేలేత ప్రాయం. టీనేజ్‌ ప్రేమల్లో ఉండే ఉత్సాహం అంతా వాళ్లలో కనిపించేది. ఇక్కడా, అక్కడా అని లేదు.. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపించేది. ఫంక్షన్లు, అవార్డ్‌ వేడుకలు, పార్టీలు, హాలీడేలు.. జస్టిన్, గోమెజ్‌ కలిసి ఉన్నారంటే ఫోటోలు దిగాల్సిందే, ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పడాల్సిందే! ఇక ఫ్యాన్స్‌ హంగామా ఎలాగూ ఉండేదే! రెండేళ్లు ఇలా సూపర్‌ కూల్‌ అన్నట్టు సాగిపోయింది జస్టిన్, గోమెజ్‌ల ప్రేమ జీవితం. ఫ్యాన్స్‌ వీరిద్దరి ప్రేమకు ‘జలీనా’ అన్న పేరు కూడా పెట్టుకున్నారు.

రెండేళ్లు గడిచాయి. 2012 వచ్చింది..
ఇద్దరికీ గొడవలు. ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితులు కూడా వచ్చాయి. ‘జస్టిన్‌ను నమ్మలేం!’ అంది సెలీనా. ‘సెలీనాతో ఉండలేం!’ అన్నాడు జస్టిన్‌. ఇద్దరూ విడిపోయారు. ‘జలీనా’ ఫ్యాన్స్‌ తెగ బాధపడ్డారు. ఇద్దరూ ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. కోపమొస్తే ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్స్‌ డిలీట్‌ చేసేసుకుంటారు. ఇదో రెగ్యులర్‌ గేమ్‌లా సాగిపోతూనే వచ్చింది.

ఎన్ని మలుపులో!
2013, 2014, 2015.. ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయి. జస్టిన్‌ జీవితంలోకి కొత్త గర్ల్‌ఫ్రెండ్స్‌ వస్తున్నారు, వెళుతున్నారు. సెలీనా జీవితంలోకీ కొత్త బాయ్‌ఫ్రెండ్స్‌ వస్తున్నారు, వెళుతున్నారు. మధ్యలో ఎప్పుడో ఒకసారి, ఏ ఆరు నెలలకో మాత్రం కలిసి కనిపిస్తారిద్దరూ. ‘వీళ్లు మళ్లీ కలిశారు’ అని అభిమానులు సంబరపడిపోయేంతలో, ‘అబ్బే అలాంటిదేం లేదే!’ అన్నట్టు విడిపోతారు. ఎప్పుడు కలుస్తారో, ఎందుకు విడిపోతారో ఎవ్వరికీ అర్థం కాదు. సెలీనాకు తగిలేలా తన పాటల్లో లిరిక్స్‌ ఉండేలా చూసుకుంటాడు జస్టిన్‌. దానికి మళ్లీ పాటతోనే సమాధానమిస్తుంది సెలీనా. ఈ బ్రేకప్‌ ప్రేమకథ అలాంటి ట్విస్టులతోనే 2017వరకూ నడిచి, 2017లో క్లైమాక్స్‌కు దగ్గరైనట్టు కనిపిస్తోంది.

లవర్స్‌కి గుడ్‌బై చెప్పిన జస్టిన్, సెలీనా
2017లో ఈ ఇద్దరి లవ్‌స్టోరీలో ఎన్నో మలుపులు. డ్రగ్‌ అడిక్ట్‌ అని, పిచ్చోడిలా మారిపోయాడని జస్టిన్‌ బీబర్‌ను అభిమానులే విమర్శించడం మొదలై అప్పటికే రెండేళ్లు. జస్టిన్‌ అందులోనుంచి బయటకు రావాలనుకొని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సూపర్‌హిట్‌ పాటలను అందించాడు. ఆ పాటల్లో సెలీనా రిఫరెన్స్‌ కనిపించింది. అభిమానులు మళ్లీ వీళ్ల మధ్య ఏదో జరుగుతుందనుకున్నారు. కాకపోతే సెలీనా.. సింగర్‌ ది వీకెండ్‌తో కొత్తగా ప్రేమలో పడిపోయింది. దానిపై జస్టిన్‌ కొన్ని సెటైర్లు కూడా వేశాడు. సడెన్‌గా ఈ కథకు ఇంకో మలుపు, సెలీనా కిడ్నీ పాడవ్వడం. ఫ్రాన్సియా రైజా సెలీనాకు తన కిడ్నీ దానం చేసింది. వాళ్లిద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. సెలీనాకు ఇలా ఆపరేషన్‌ జరిగిందన్న విషయం జస్టిన్‌కు తెలియలేదంటారు. సెప్టెంబర్‌లో ఇది జరిగితే, అక్టోబర్‌ నెలాఖరుకు బాయ్‌ఫ్రెండ్‌ వీకెండ్‌కు బ్రేకప్‌ చెప్పేసింది సెలీనా. కారణాలు ఎవ్వరికీ తెలీదు. అలాగే జస్టిన్‌ కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌కు బ్రేకప్‌ చెప్పేశాడు.  ఆ తర్వాత ఇద్దరూ సింగిల్‌.

మళ్లీ ప్రేమలో..
2017 నవంబర్‌ వచ్చింది. జస్టిన్‌ బీబర్, సెలీనా గోమెజ్‌ మళ్లీ దగ్గరయ్యారు. ఇది సెలీనా తల్లి మ్యాండీ టిఫీకి ఏమాత్రం నచ్చలేదు. జస్టిన్‌కు దూరంగా ఉండమని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. కానీ సెలీనా, జస్టిన్‌కు దూరం కావాలనుకోలేదు. తల్లితో గొడవ పెట్టుకొని మరీ జస్టిన్‌తో మళ్లీ ప్రేమలో పడిపోయింది. ఏడేళ్ల ప్రేమకథలో ఎన్నిసార్లు విడిపోయారో అన్నిసార్లూ కలిసిపోయారు వీళ్లిద్దరూ. ఈసారి ఇంక విడిపోయేదే లేదు అంటున్నారు. ఇద్దరూ కలిసి సిడ్నీలోని హిల్‌సంగ్‌ చర్చిలో కపుల్‌ థెరపీకి కూడా హాజరయ్యారు. ఇప్పుడింక ఇద్దరి మధ్య అన్నీ సర్దుకున్నాయి అంటున్నారు. మరి ఇది క్లైమాక్సే అనుకోవచ్చా? ఏమో!!

స్టార్‌వార్స్‌ జస్ట్‌ ఓకే
హాలీవుడ్‌లో ‘స్టార్‌వార్స్‌’కు ఉన్న క్రేజ్‌ మరే ఇతర సిరీస్‌కు లేదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. మెయిన్‌ స్ట్రీమ్‌ కమర్షియల్‌ మూవీస్‌లో బాక్సాఫీస్‌ వద్ద ‘స్టార్‌ వార్స్‌’ సినిమాలు కొన్నేళ్లుగా సృష్టిస్తూ వచ్చిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ ఏడాది ‘స్టార్‌ వార్స్‌’ సీక్వెల్‌ ట్రయాలజీలో రెండో సినిమా అయిన ‘స్టార్‌ వార్స్‌ : ది లాస్ట్‌ జేడి’ వచ్చింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 15న విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా బాక్సాఫీస్‌ వద్ద నిలబడడం లేదు. నిజానికి ఈ ఏడాది బిగ్గెస్ట్‌ గ్రాసర్స్‌లో టాప్‌లో ఈ సినిమా నిలుస్తుందనుకున్నా అంత సీన్‌ అయితే కనపడడంలేదు. ఇక క్రిస్మస్‌ వారానికి కూడా లెక్కలేనన్ని సినిమాలు వచ్చేయడంతో ‘స్టార్‌వార్స్‌’ కథ ఈసారికి ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ సినిమా 650 మిలియన్‌ డాలర్లు (4,161 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇది హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి నంబరే కానీ, ‘స్టార్‌వార్స్‌’ రేంజ్‌ కాదన్నది ట్రేడ్‌ వర్గాల అభిప్రాయం. ఈ ఏడాది చివర్లో వచ్చినా టాప్‌లో నిలబడుతుందనుకున్న సినిమా మొత్తానికి అంతంత మాత్రమే అనిపించుకుంది.

                                                                   సెలీనా గోమెజ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top