ఇమ్రాన్‌కు షాక్‌.. బ్లాక్‌లిస్ట్‌లోకి పాక్‌ | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌కు షాక్‌.. బ్లాక్‌లిస్ట్‌లోకి పాక్‌

Published Fri, Aug 23 2019 12:39 PM

Pakistan Placed In Blacklist By FATF - Sakshi

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తోన్న తీవ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను నివారించడంలో విఫలమైనందుకు ఫినాన్షియల్‌ యాక‌్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) పాక్‌కు భారీ షాకిచ్చింది. ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నందున పాకిస్తాన్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతున్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్‌ శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలపై చర్యలకు 11 అంశాలను పాక్‌కు వివరించామని, వాటిలో ఏ ఒక్కటీ ఇమ్రాన్‌ ప్రభుత్వం పాటించలేదని సంస్థ పేర్కొంది. 26/11 ముంబై పేలుళ్ల నిందితుడు హఫీజ్ సయీద్ సహా పలు పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు పాకిస్తాన్ కొమ్ముకాస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

గతంలో గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్‌ తాజాగా బ్లాక్‌లిస్ట్‌లోకి చేరడంతో అంతర్జాతీయ పరంగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనుంది. కాగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయడానికి ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధులు సమకూర్చుకునేందుకు అనేక దారులను అన్వేషిస్తున్న ఇమ్రాన్‌.. గత్యంతరం లేక ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మకానికి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో జులాయిగా తిరుగుతున్న గాడిదలన్నింటినీ కంటైనర్లలో నింపి చైనాకు విక్రయించిన విషయం తెలిసిందే.

ఇమ్రాన్‌ఖాన్‌ ఆ దేశ పగ్గాలను ఏ ముహూర్తంలో అందుకున్నారో గానీ.. అప్పటి నుంచీ  ఆర్థిక వనరుల కోసం అల్లాడుతోంది. చివరికి విలాసవంతమైన కార్లను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి వచ్చే నిధులతోనే కాలం గడుపుతోంది. ఎప్పటికప్పుడు ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీలను తీసుకుంటోంది. ఈ చర్యలన్నీ ఆ దేశానికి తాత్కాలిక ఊరటను ఇచ్చేవి మాత్రమే.

చదవండి: ఏంటయ్యా ఇమ్రాన్‌ నీ సమస్య..?

Advertisement
Advertisement