‘భారతీయులు ద్వేషించేది అదే’ | Sakshi
Sakshi News home page

‘భారతీయులు ద్వేషించేది అదే’

Published Mon, Jun 26 2017 6:11 PM

‘భారతీయులు ద్వేషించేది అదే’ - Sakshi

వాషింగ్టన్‌: గత మూడేళ్లలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరక కూడా పడలేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని రిట్జ్‌ కార్లటన్‌లో టైసన్స్‌ స్క్వేర్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతిని భారతీయులు ద్వేషిస్తారని వ్యాఖ్యానించారు. తమ పాలనలో భారతదేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళతామని ఎన్నారైలకు ఆయన హామీయిచ్చారు.

టెక్నాలజీ సాయంతో వివిధ రంగాల్లో గొప్ప విజయాలు సాధించామన్నారు. అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సాంకేతిక సూచిక పాలన, అభివృద్ధి దృష్టి సారించినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా అత్యున్నత స్థాయిలో పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎన్నారైల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

ఇండియాకు రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వస్తున్నాయని, పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మనదేశం మారిందని వెల్లడించారు. అమెరికా అభివృద్ధికి ఎన్నారైలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రవాసులు కలగంటున్నట్టుగా ఇండియాను అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ హామీయిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement