అబ్బా... ఇవేం ఎండలు

అబ్బా... ఇవేం ఎండలు - Sakshi


 సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలోనూ రాష్ట్ర రాజధాని ఉడికిపోతోంది. రికార్డు స్థాయిలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జల్లుల కాలంలోనూ సీజన్ మార్పులు సిటీజనులను ఇబ్బందులు పెడుతున్నాయి. మరోవైపు కరెంట్ కోతలు... నీటి వెతలు  అవస్థలకు గురిచేస్తున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులూ విజృంభిస్తున్నాయి. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరగని రీతిలో పెరుగుతుండడంతో గ్రేటర్ పరిధిలో పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కల శరీర ధర్మాల్లో మార్పులొస్తున్నాయి. దీంతో ఇటీవలికాలంలో కుక్కకాటు కేసులు బాగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

 

 ఐదేళ్ల తరవాత రికార్డు ఉష్ణోగ్రత నమోదు..

 

 గ్రేటర్ పరిధిలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఐదేళ్ల తరువాత సోమవారం గరిష్టంగా 34.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2009లో ఆగస్టు 8న 36.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తరవాత ఇదే అత్యధికం. ఈసారి వర్షపాతం గణనీయంగా తగ్గడం, తరచూ ఆకాశం మేఘావృతమై ఉండడం, గాలిలో తేమ అధికం కావడం, రుతుపవనాలు సకాలంలో ముఖం చాటేయడం వంటి కారణాలతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త సీతారాం ‘సాక్షి’కి తెలిపారు. ఈ వర్షాకాలం సీజన్‌లో ఇక అరకొర జల్లులు మినహా భారీ వర్షాలు కురిసే అవకాశాలు మృగ్యమేనని స్పష్టంచేశారు. గ్రేటర్ పరిధిలో ఈ సీజన్‌లో వర్షపాతంలో 63 శాతం తగ్గుదల నమోదైందన్నారు. తెలంగాణా ప్రాంతంలో వర్షపాతంలో తగ్గుదల 53 శాతంగా ఉందని పేర్కొన్నారు.

 

 నీటి వెతలు..

 

 తీవ్ర వర్షాబావ పరిస్థితుల కారణంగా గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీరా, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో జలమండలి పొదుపు మంత్రం పాటిస్తోంది. ఇప్పటికే ఆయా జలాశయాల నుంచి నిత్యం పేరుకు 300 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నామని ప్రకటిస్తున్నా.. సరఫరా నష్టాలు 40 శాతం పోను వాస్తవ   సరఫరా 180 మిలియన్ గ్యాలన్లు మించడం లేదు. ఈ నీటినే సుమారు 8.25 లక్షల కుళాయిలకు అరకొరగా సరఫరా చేస్తున్నారు. కాప్రా, ఎల్బీనగర్, అల్వాల్, మల్కాజ్‌గిరీ, కూకట్‌పల్లి, హౌజింగ్‌బోర్డు, గడ్డిఅన్నారం, రాజేంద్రనగర్, కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వందలాది కాలనీలు, బస్తీలు నిత్యం పానీపరేషాన్‌తో సతమతమౌతున్నాయి. వేసవి అవసరాల దృష్ట్యా జలాశయాల్లోని నీటిని పొదుపుగా వాడుకోక తప్పడం లేదని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం గ్రేటర్‌లో విలీనమైన 11 మున్సిపల్ సర్కిళ్లకుగాను ఒక్కో సర్కిల్‌కు నిత్యం సుమారు ఐదు నుంచి 10 మిలియన్ గ్యాలన్ల నీటికి అనధికారికంగా కోతలు విధిస్తుండడంతోనే పానీపరేషాన్ తీవ్రమౌతోందని స్పష్టమౌతోంది.

 

 కరెంట్ కోత.. ఉక్కపోత

 

 గ్రేటర్‌లో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు ఒకవైపు.. ఉక్కపోత.. విద్యుత్ కోతలు మరోవైపు నగరజీవిని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.   గ్రేటర్ లో 38 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 32 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు, నాలుగు లక్షల వాణిజ్య కనెక్షన్లు, లక్ష వీధి దీపాలు, 40 వేలకుపైగా పరిశ్రమలు, 3200 హోర్డింగ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం నగరవాసుల అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చాలంటే రోజుకు కనీసం 46-47 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, 40-42 మిలియన్ యూనిట్లకు మించి సరఫరా కావ డం లేదు. డిమా ండ్‌కు సరఫరాకు మధ్య 500-600 మెగవాట్ల కొరత ఉండటంతో చేసేది లేక గృహాలకు ప్రతి రోజూ ఆరు గంటల పాటు అధికారిక విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు.

 

 తగ్గిన భూగర్భ జలాలు

 

  గ్రేటర్ పరిధిలో గతేడాది జూలై చివరి నాటికి సగటున 7.39 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ దొరకగా.. ఈసారి 9.59 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యమౌతున్నాయి. అంటే గతేడాది కంటే భూగర్భజల మట్టాలు సగటున 2.2 అడుగుల లోతునకు తగ్గాయి. అత్యధికంగా ఉప్పల్ మండలంలో 4.40 అడుగులు, సైదాబాద్ మండలంలో 4.15 అడుగుల మేర భూగర్భజలమట్టాలు తగ్గాయి. ఇక అమీర్‌పేట్, ఆసిఫ్‌నగర్, బండ్లగూడా,ై ఖెరతాబాద్, మారేడ్‌పల్లి, నాంపల్లి, కుత్భుల్లాపూర్, సరూర్‌నగర్, బాలానగర్, మల్కాజ్‌గిరీ, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు తగ్గముఖం పట్టినట్లు భూగర్భ జలశాఖ తాజా నివేదిక వెల్లడించింది.

 

 విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు

 

  వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల వల్ల బస్తీల్లో అనేక మంది దగ్గు, జ్వరం, డయేరియా, డిఫ్తీరియా బారిన పడుతున్నారు. నగరంలోని ఫీవర్ ఆస్పత్రికి సాధారణ రోజుల్లో ప్రతి రోజూ సగటున 500-700 మంది బాధితులు వస్తే, ఒక్క సోమవారం రోజే 1050 మంది రోగులు చేరారంటే పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వీరిలో అత్యధిక మంది వైరల్ ఫివర్‌తో బాధపడుతున్న వారే. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులే కాదు, చిన్నచిన్న క్లీనిక్‌లు సైతం రోగులతో కిక్కిరిపోతున్నాయి. పెరుగుతోన్న పగటి ఉష్ణోగ్రతలకు వీధి కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ప్రయాణికులను, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులను కాటేస్తున్నాయి. సోమవారం ఒక్క రోజే 45 కుక్కకాటు కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తోంంది.  

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top