పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు | Sakshi
Sakshi News home page

పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు

Published Thu, Apr 27 2017 2:12 AM

పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు - Sakshi

సీఎం కేసీఆర్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ ధ్వజం  
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని పోలీసుల రాజ్యంగా మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సేవ్‌ధర్నా రిలే నిరసన దీక్ష 12వ రోజుకు చేరుకుంది. బుధవారం నాటి దీక్షలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీవీకేఎస్, ఐఎస్‌టీయూలకు చెందిన అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీక్షను ప్రారంభించిన చాడ మాట్లాడుతూ కేసీఆర్‌ వచ్చిన వెంటనే పోలీస్‌ వ్యవస్థకు సకల సౌకర్యాలు కల్పించారన్నారు.

లక్షల సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా పోలీస్‌శాఖలో నూటికి నూరుశాతం ఖాళీలను భర్తీ చేశారన్నారు. ప్రభుత్వాన్ని అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తూ పోలీసుల ద్వారా అణిచిచేస్తూ పోలీస్‌ రాజ్యాంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం కాలరాస్తున్న ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు చివరికి సాయుధ పోరాటయోధులు కూడా దీక్షకు దిగుతున్నారని అన్నారు. దీన్నిబట్టి ధర్నాచౌక్‌ తెలంగాణ ప్రజలకు ఎంత అవసరమో అర్థమవుతుందన్నారు.

ఓయూకి పాలక మండలి లేకుండా శతాబ్ది ఉత్సవాలు జరపడం విడ్డూరం గా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి  వ్యాఖ్యా నించారు. పాలకమండలి ఏర్పాటు చేయాలని రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

కాగా, శతాబ్ది ఉత్సవాలు జయప్రదమై వర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు రావాలని ఆయన ఆకాంక్షించారు. బుధ వారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, టీఆర్‌ఎస్‌ బహిరంగసభకోసం రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. వరంగల్‌లో జరగనున్న సభ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు కూలిపని చేస్తే రూ. లక్షలెలా వస్తాయని ఆయన అను మానం వ్యక్తంచేశారు.  అధికారం చూసి భయపడి డబ్బులు ఇస్తున్నారని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement