ఎంతెంత దూరం.. | Sakshi
Sakshi News home page

ఎంతెంత దూరం..

Published Sun, Feb 11 2018 1:13 AM

funday new story special - Sakshi

‘‘కెనడా నుంచి ఇండియా వచ్చేస్తున్నాను. ఈ దేశంలో నాకెవరూ లేరు. ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా కనిపించడం లేదు..’’ శిరీష ఫోనులో చెప్పింది. చెబుతున్నప్పుడు ఆమె మాటల్లో ఒకలాంటి బాధ ధ్వనించింది. శిరీష మాటలు విన్నప్పట్నుంచీ ప్రసాద్‌ మనసు ఏదోలా అయిపోయింది. అదీ ఎన్నో సంవత్సరాల తర్వాత శిరీష అతనికి కాల్‌ చేయడం. ‘‘ఎందుకు?’’ తడబడుతూ అడిగాడు. ‘‘శిరీషా మాధవ్‌ ఇప్పుడు వట్టి శిరీష అయిపోయింది. మాధవ్‌ నన్ను, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నాలుగేళ్ల బాబుతో దేశంకాని దేశంలో ఉండలేను..’’ ‘‘మరి..’’‘‘మాధవ్‌కు రావాల్సిన డబ్బులు కూడా వచ్చేశాయి. ఇక్కడ ఇంకో రెండు మూడు వ్యవహారాలు సెటిల్‌ చేయాలి. అవయిపోగానే ఇండియా వచ్చేస్తాను..’’‘‘మాధవ్‌ ఎప్పుడు?.. ఎలా?’’‘‘అదో విషాదఘట్టం.. అతనే జీవితం అంటూ బతికాను..’’ శిరీష చెబుతూనే ఉంది. ప్రసాద్‌ మనసు మొద్దుబారిపోయింది. తన భార్య స్థానంలో ఉండవలసిన శిరీష.. మాధవ్‌ను పెళ్లి చేసుకోవడం, కెనడా వెళ్లిపోవడం, చాన్నాళ్లు తను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడం, అన్నీ గుర్తొచ్చాయి. ప్రసాద్‌ మనసులో ఏదో మెలితిప్పినట్లయింది. ‘‘నీ ఫోన్‌ నంబర్‌ కోసం చాలా ప్రయత్నించాను. నువ్వుంటున్న పల్లెటూరికి సిగ్నల్‌ వస్తుందో రాదో అనుకున్నాను. నీతో మాట్లాడిన తర్వాత నాకు రిలీఫ్‌గా ఉంది. ఇండియా రాగానే నిన్ను కలుస్తాను..’’ప్రసాద్‌ ఏమీ జవాబివ్వలేదు. ‘సరే’ అన్నాడు. 

‘‘మీ కవితలు చాలా బాగున్నాయి. వాటిని చదువుతూంటే అమాయకంగా కనిపించే మీలో ఇంత భావుకత్వం ఉందా అనిపిస్తుంది. మనసులో కలం ముంచి రాస్తారులా ఉంది..’’    శిరీష మాటలు ప్రసాద్‌కి గర్వంగా అనిపించాయి. నిజంగా తన కవితలు అంత బాగుంటాయా? తాను కవిత్వం రాస్తాడని చాలామందికి తెలియదు. అందంగా ఆకర్షణీయంగా ఉండే శిరీష మెచ్చుకోవడం అతనికి ఆనందంగా అనిపించింది. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ‘‘కవులు కవితలు రాయడమే కానీ మాట్లాడరా?’’ మళ్లీ ప్రశ్నించింది. ప్రసాద్‌ చూస్తుండగానే హేండ్‌ బ్యాగ్‌లోంచి అతను ప్రచురించిన ‘గుండె గొంతుకలు’ కవిత సంపుటాన్ని బైటికి తీసింది. నెలరోజుల క్రితం తన కవితలతో వచ్చిన ఆ పుస్తకంలో కవితలను చదివే కాబోలు పొగుడుతోంది అనుకున్నాడు. ఆమె పుస్తకంలో పేజీలను తిప్పుతుండగా.. ‘‘ఈ మధ్యే రిలీజ్‌ అయింది. మీరు ఎలా సంపాదించారు?’’ ప్రశ్నించాడు. ‘‘ఇష్టమైన వారికి సంబంధించిన విషయాలపై ఆసక్తి ఎందుకు ఉండదు?’’ అంది. ‘ఇష్టం’ అనే మాటను వత్తి పలికింది. ఆమె మాటలు ప్రసాద్‌లో ఒకలాంటి ఆనందాన్ని కలిగించాయి. తనతో కలిసి చదువుతున్న అందమైన అమ్మాయి తనను ఇష్టపడ్డం అతనికి కొత్తగా అనిపించింది. ‘‘ఈ కవితల పుస్తకంలో కవితలన్నీ మీ మనసుతో రాసినట్లుగా ఉన్నాయి. వీటిని చదివితే మీ మనసు లోతు తెలుస్తుంది..’’ శిరీష అంది. ‘‘అవన్నీ నా సొంత ఆలోచనలు కావు. ప్రేమికులు.. మనసులో బాధపడేవారు ఎలా ఆలోచిస్తారో ఊహించి రాశాను..’’ శిరీష పకపకా నవ్వింది. ‘‘ఏమి నవ్వుతున్నారు?’’‘‘కవిత్వం రాసేవారు ఎవరైనా ఫీల్‌ అయి రాస్తారు. మీరు ఫీల్‌ అయి రాశానని అంటున్నారంటే మనసులో మథనపడే ఉంటారు..’’ఎదురుగా కేంటీన్‌ వైపు చూస్తూ.. ‘‘టీ తాగుదామా?’’ అన్నాడు. ‘‘టీ కోసం మీ నుంచి పిలుపు రావాలని కోరుకున్నాను. వెంటనే వచ్చింది.’’శిరీష ముందుకు దారితీసింది. ప్రసాద్‌ ఆమెను అనుసరించాడు. 

స్కూటీ శబ్దం విని ప్రసాద్‌ రూంలోనుంచి బైటికి వచ్చాడు. ఎదురుగా శిరీష. ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ.. ‘‘ఏంటిలా?’’ అన్నాడు. అతడి మాటలు పూర్తికాక ముందే రూం లోపలికి వచ్చేసింది. బెడ్‌రూమ్‌. వంటగది. అన్నీ దగ్గరే ఉన్నాయి. ఎదురుగా స్టవ్‌. దానిపక్కన బుట్టలో ఉల్లిపాయలు. ప్లాస్టిక్‌ సంచిలో కూరగాయలు. చిందరవందరగా వంటసామాన్లు ఉన్నాయి. వాటిని ఆశ్చర్యంగాచూస్తూ..‘‘స్వయంపాకాలన్నమాట..’’ అంది. ‘‘అవును. హోటల్‌లో తినడం అంత ఇష్టం ఉండదు. వంట చేయడం అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అరగంట కష్టపడితే నచ్చింది చేసుకుని తినవచ్చు. అంట్ల గిన్నెలు కడగడానికి పనిపిల్ల వస్తుంది. ఎప్పుడైనా ఎగనామం పెట్టినప్పుడే కష్టం..’’ ప్రసాద్‌ చెబుతున్న విషయాలను శిరీష నవ్వుతూ విని, ‘‘మీరు రాసి, ప్రచురించని కవితలు ఉంటే తీసుకెళ్దామని వచ్చాను’’ అంది.    బీరువా తెరిచి అందులో డైరీని తీసి ఆమెకు అందిస్తూ.. ‘‘మనసు బాగోలేనప్పుడు రాసిన చాలా కవితలు ఇందులో ఉన్నాయి..’’ అన్నాడు. ‘‘మనసు బాగోలేనప్పుడే మంచి కవిత్వం వస్తుందంటారు..’’ఆడవాళ్లు కథలు, నవలలు ఎక్కువ చదువుతుంటారు. మీలా కవిత్వం చదివేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. నా కవితకు మంచి పాఠకురాలు లభించడం నా అదృష్టం’’‘‘చదివి నాలుగైదు రోజుల్లో ఇస్తాను..’’ గబగబా బైటికి వెళ్లి స్కూటీ స్టార్ట్‌ చేసింది. 

‘‘కవులకు మీలాంటి కవిత్వం తెలిసిన వారు లైఫ్‌ పార్టనర్‌గా దొరికితే వారి జీవితం ధన్యం అయిపోతుంది..’’ అన్నాడు ప్రసాద్‌. ‘‘నిజమేనేమో! నాకూ అంతగా తెలియదు. కానీ కవులెవరూ ధనవంతులు కాలేరట..’’ప్రసాద్‌ ఏమీ మాట్లాడలేకపోయాడు. తన మనసులోని మాటలను మనసులోనే ఉంచేసుకున్నాడు. శిరీషకు కవితలపై ఉన్న ఆసక్తి కవులపై లేదేమో అనుకున్నాడు. ‘‘ఈమధ్యే ఒక ఫారిన్‌ సంబంధం వచ్చింది. మా వాళ్లు అదే కన్‌ఫర్మ్‌ చేసేలా ఉన్నారు. అబ్బాయి కెనడాలో డాక్టర్‌..’’ ‘‘మీకు ఇష్టం లేదా?’’‘‘నా ఇష్టంతో సంబంధం లేదు. నేను సుఖపడాలని అమ్మా నాన్నా కోరుకుంటున్నారు. కెనడా అందంగా ఉంటుందట. పెళ్లయితే నేను అక్కడికే షిఫ్ట్‌ అయిపోతున్నాను..’’ఆరునెలల్లో శిరీష పెళ్లి అయిపోయింది. పెళ్లయిన వెంటనే భర్తతో కలిసి కెనడా వెళ్లిపోయింది. మొదట్లో ఫోన్లు చేసేది. కవితలు పంపించమనేది. తర్వాత ఇద్దరి మధ్యా అంతరం బాగా పెరిగిపోయింది. తర్వాతెప్పుడో ఫోన్‌ చేస్తే రాంగ్‌ నంబర్‌ అంటూ రిప్లై వచ్చింది. ఇద్దరి మధ్యా చాలా సంవత్సరాలు గ్యాప్‌ వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత శిరీష నుంచి మళ్లీ ఫోన్‌. ప్రసాద్‌కి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. 

ఫ్లైట్‌ దిగగానే ఢిల్లీ నుంచి ప్రసాద్‌కి ఫోన్‌ చేసింది శిరీష. ‘‘హైద్రాబాద్‌లో అన్నయ్యా వదినలు ఉన్నారు. అక్కడికి వెళ్లి బాబుని అప్పగించి నీ దగ్గరికి వస్తాను’’. ఫోన్‌లో అడ్రెస్‌ తీసుకుంది. ‘‘అంతపెద్ద కవిగారు అంత చిన్న పల్లెటూరిలో ఎలా ఉంటున్నారో?’’ గలగలా నవ్వింది. ప్రసాద్‌కి కూడా నవ్వొచ్చింది. కానీ నవ్వలేదు. ‘‘ఈ పల్లెటూరే నా కవిత్వానికి పుట్టినిల్లు..’’ అన్నాడు నెమ్మదిగా. వారంరోజుల తర్వాత.. శిరీష బేగ్‌ తగిలించుకుని విశాఖపట్నం ఫ్లైట్‌ ఎక్కింది. దిగిన వెంటనే ట్యాక్సీ మాట్లాడుకుని జాతీయ రహదారి మీదుగా ఆనందపురం జంక్షన్‌కు వచ్చింది. అక్కణ్నుంచి పది కిలోమీటర్లు ప్రయాణించి జుగురాజుపాలెం చేరింది. ఊర్లో కారు ఆగగానే చాలామంది చుట్టుముట్టారు. ట్యాక్సీని వెనక్కి పంపింది.‘‘సార్‌ కోసం వచ్చారా? ఆయనిక్కడే టీచర్‌గా పనిచేస్తున్నారు. రండి! తీసుకెళ్తాను..’’ శిరీష బేగ్‌ అందుకుంది అక్కడే ఉన్న అంగన్వాడీ ఆయా. ప్రసాద్‌ ఎలిమెంటరీ స్కూలు టీచరా? ఇంతవరకూ తనకు తెలియదే అనుకుంటుండగా స్కూలు వచ్చింది. గేటుకి తాళాలు వేసి ఉన్నాయి. ‘‘ఈరోజు సెలవు కాబోలు. రండి! ఇంటికెళ్దాం..’’ ఆయా ముందుకు దారితీసింది. పొలం గట్ల వెంబడి నడుచుకుని వెళుతుంటే దూరంగా వంటరిగా పెంకుటిల్లు కనిపించింది. ‘‘ఆ ఇంట్లోనే సార్‌ ఉంటున్నారు..’’ అంది ఆయా.  తలుపు తీసే ఉంది.     శిరీషను చూసి ప్రసాద్‌ ఆశ్చర్యపోయాడు. రెండు నిమిషాలు అతనికి నోటమాట రాలేదు. తర్వాత నెమ్మదిగా.. ‘‘రండి! రండి! పదేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు.ఇంత తొందరగా వస్తారని అనుకోలేదు..’’ చెబుతూ కుర్చీ లాగి కూర్చోమన్నాడు.  

‘‘వస్తాను సారూ..’’ అంగన్వాడీ ఆయా వెనుతిరిగింది. ‘‘ఇంకా పెళ్లి చేసుకోలేదా?’’ శిరీష ప్రసాద్‌ను అడిగింది. ఆమెకు జవాబు చెప్పకుండా గోడవైపు చూశాడు. గోడమీద ఒకావిడ ఫొటో వేలాడుతోంది. దానికి దండ వేసి ఉంది. ‘‘నా భార్య. చనిపోయి రెండేళ్లయింది.’’ శిరీషకు నోట మాట రాలేదు. కొద్దిసేపాగి –‘‘మళ్లీ పెళ్లి చేసుకోలేదా?’’ అడిగింది. ప్రసాద్‌ రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ‘‘ఆమె భౌతికంగా ఈ లోకంలో లేకపోవచ్చు. కానీ నిత్యం నా చుట్టూనే ఉంది. కవిత్వం అంటే ఆమెకు తెలీదు. కానీ నన్ను అందరూ మెచ్చుకుంటుంటే సంబరపడిపోయేది. అందుకే ఆ ఊరిలో ఉండలేకపోయాను. ఆమె జ్ఞాపకాలకు దూరంగా నేను పనిచేస్తున్న ఈ పల్లెటూరికి వచ్చేశాను..’’    ‘‘ఇక్కడ ఊసుపోతుందా?’’ ‘‘పిల్లలతో గడపడం ఎప్పుడూ ఆనందాగానే  ఉంటుంది..’’ శిరీష చాలాసేపు ఏదో అడగాలనుకొని ఆగిపోతోంది. చాలాసేపటికి అడిగేసింది – ‘‘ప్రసాద్‌! మన పరిచయంలో మీరు నాకు ప్రపోజ్‌ చేశారు కదూ?’’ అవును.. కాదు.. అన్నట్టు ప్రసాద్‌ తలాడించాడు. తర్వాత ‘‘నాలాంటి స్కూల్‌ టీచర్‌ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఈ పల్లెటూరికి అంకితం అయిపోయేది. కెనడాలో డాక్టరు గారి భార్యగా నీ హోదా ఉండేది కాదు.’’ 

‘‘నేను తప్పు చేశానేమో అనిపిస్తోంది. నాకు ఎంతో ఇష్టమైన కవిత్వాన్ని మిస్సయ్యాను. ఆయనకు కవిత్వం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడూ ఆసుపత్రి, రోగులు అంటూ కాలం గడిపేవారు. మాధవ్‌ పోయిన తర్వాత ఒకలాంటి స్వేచ్ఛ నాలో ప్రవేశించింది. నాకు డబ్బుకు లోటు లేదు. జీవితాన్ని ఇష్టం వచ్చిన మాదిరిగా ఎందుకు మార్చుకోకూడదు అనిపిస్తోంది..’’ వేడి వేడి ఉప్మాను ప్లేటుతో అందించాడు. శిరీష తీసుకోవడానికి మొహమాటపడింది. ‘‘తీసుకోండి! ఒకసారెప్పుడో మీరు నా రూమ్‌కి వంటరిగా వచ్చినప్పుడు ఆడవాళ్లకు వంట చేసి పెట్టడం ఇష్టం లేదని చెప్పాను. కానీ ఈ మారుమూల ప్రాంతానికి నన్ను వెతుక్కుని వచ్చినందుకు చేసి పెట్టాలనిపించింది. భోజనానికి ఉంటానంటే దానిని కూడా సిద్ధం చేస్తాను’’ ప్రసాద్‌ చెప్పాడు. ‘‘ఉప్మా చాలా బాగుంది. నేను పెద్ద పెద్ద హోటళ్లలో ఎన్నోసార్లు తిన్నాను. కానీ ఈ టేస్టు వేరు. ఇష్టమైన వ్యక్తి కోసం ఇష్టమైన వ్యక్తి చేసింది కాబట్టి ఈ రుచి వచ్చిందేమో’’ ఇష్టం అనే పదాన్ని వత్తి పలికింది శిరీష.

ప్రసాద్‌ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ‘‘ఈ ఊరు.. ఈ ప్రదేశం నాకెంతో నచ్చాయి. తోటల మధ్య ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు, వాతావరణం ఎంతో బాగున్నాయి. బాబుతో ఇక్కడికి వచ్చేయాలని ఉంది. మీ స్కూల్లో జీతం ఇవ్వకపోయినా పనిచేయాలని ఉంది. నాకున్న డబ్బు, హోదా, అంతస్తు ఏమీ గుర్తుకురావడం లేదు..’’ ఒక్కో మాట చెబుతున్నప్పుడు శిరీష మాట తడబడుతోంది. ‘‘హైద్రాబాద్‌ వెళ్లాలి కదా! ఈ ఊర్లోనే ట్యాక్సీ డ్రైవర్‌ ఉన్నాడు. డ్రాప్‌ చేయడానికి పిలుస్తాను..’’శిరీష ఏమీ మాట్లాడలేదు. ప్రసాద్‌ వైపు అభావంగా చూసింది. ఇంతలో నలుగురు ఆడపిల్లలు గలగలా మాట్లాడుతూ ఆ గదిలోకి వచ్చారు. వారి చేతిలో పూలు ఉన్నాయి. ఒకమ్మాయి చేతిలో పూలదండ ఉంది. గదిలో శిరీషను చూసి బయటే ఆగిపోయారు. ‘‘ఫర్వాలేదు. రండి!’’ ప్రసాద్‌ పిలిచాడు. ‘‘గులాబీలు ఏరడం ఆలస్యమైంది సార్‌..’’ ఒక అమ్మాయి అంది. ‘‘ఫర్వాలేదు.’’ అంటూ ప్రసాద్‌ దండను అందుకున్నాడు. చిన్న స్టూలు వేసుకుని భార్య ఫొటోకి ఉన్న పాత దండను మార్చాడు. పిల్లలు తీసుకుని వచ్చిన కొత్త దండ వేసి పక్కనే ఉన్న ప్రమిదలో దీపపు వత్తిని పెద్దది చేశాడు. ఇదంతా శిరీష ఆశ్చర్యంగా చూస్తోంది.
 
‘‘ట్యాక్సీ రాముని పిలుచుకుని రండి. ఆంటీని డ్రాప్‌ చేయాలి..’’అందులో ముగ్గురు అమ్మాయిలు పరుగు పరుగున బైటికి వెళ్లారు. ఒకమ్మాయి మాత్రం అక్కడే ఉండిపోయింది. ప్రసాద్‌ వద్దకు వచ్చి అతడిని ఆనుకుని నిల్చొని ఎదురుగా ఉన్న శిరీష వైపు ఆసక్తిగా చూస్తోంది. శిరీష కూడా ఆ పాప వైపు చూసింది. ఇద్దరి కళ్లు కలుసుకున్నాయి. ‘‘మా ఇద్దరి ముద్దుల పాప. ఈమే నా ఏకైక సంతానం. ఈ ఊర్లోనే నేను పని చేస్తున్న స్కూల్లో చదివిస్తున్నా..’’శిరీష పాప వైపు, గోడపైన దండ వేసిన ఫోటోవైపు మార్చి మార్చి చూసింది. ‘‘సార్‌! విశాఖ వెళ్లాలా?’’ ట్యాక్సీ డ్రైవరు వరండాలోకి వచ్చాడు. శిరీష బ్యాగ్‌ పట్టుకొని నిల్చుంది.‘‘శిరీషా! ఆంటీగారికి నమస్కారం చెయ్యమ్మా’’ అన్నాడు ప్రసాద్‌. శిరీష విస్మయంగా చూస్తుండగా, పాప చేతులు జోడించి ఆమెకు నమస్కారం పెట్టింది. ‘‘పాపకు నీ పేరే పెట్టుకున్నాను..’’ అన్నాడు ప్రసాద్‌.  
 - పొత్తూరు రాజేంద్రప్రసాద్‌వర్మ 

Advertisement

తప్పక చదవండి

Advertisement