చెత్తింటివారు!

women empowerment :  Everyone is harassing the girl together - Sakshi

చెత్తను కూడా రీసైకిల్‌ చెయ్యొచ్చేమో కానీ ఇలాంటి అత్తింటివాళ్లను మాత్రం బాగు చెయ్యలేం.  ఎక్కడైనా.. అత్త వేధిస్తుంటే మామ ఆపుతాడు.  భర్త వేధిస్తుంటే అత్తమ్మ అడ్డుకుంటుంది. మామ వేధిస్తుంటే భర్త తిరగబడతాడు.  అత్తింట్లో ఉండే అమ్మాయికి కష్టాల నుంచి సేద తీర్చే మనుషులు వీళ్లంతా.  అలాంటిది అందరూ కలిసి అమ్మాయిని వేధిస్తుంటే.. వాళ్లు.. అత్తింటివాళ్లు ఎలా అవుతారు? చెత్తింటివాళ్లు కారా?

లింగ విజయ్‌కుమార్, సత్యవతిల మూడవ కుమార్తె మానవత. వారిది ఖమ్మం జిల్లా. అదే జిల్లాలోని తాళ్లగుమ్మూరు గ్రామానికి చెందిన కరి సత్యనారాయణ, రాజకుమారిల కుమారుడు ఫణీంద్రకు ఇచ్చి 2013లో వివాహం జరిపించారు. కట్న కానుకల కింద రూ.5లక్షల నగదు, రూ.5లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, ఆరొందల గజాల స్థలం ఇచ్చారు. పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించి కుమార్తెను మెట్టినింటికి పంపారు. పట్టుమని పదిరోజులు కాపురం చేయకుండానే కట్టుకున్న భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి! అయిదేళ్లుగా ఆ గృహహింసను భరిస్తూనే వచ్చింది మానవత. ఈ మధ్యే భర్త చెప్పాపెట్టకుండా అమెరికా వెళ్లిపోయాడు.  అత్త, మామలను అడిగితే ‘‘నీకు దిక్కున్న చోట చెప్పుకో’’ అంటూ దబాయించారు. జరిగిన అవమానాలను ఎదుర్కొంటూ తన భర్తని అమెరికా నుంచి ఇండియాకు తీసుకురావాలి అంటూ అత్త, మామల ఇంటి ఎదుట నేటికి (శనివారం) 134 రోజులుగా దీక్ష చేస్తోంది. ఈ స్థితిలో మానవతను కలిసింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆమె మాట్లాడింది ఆ వివరాలు.. మానవత మాటల్లో... ‘‘పెళ్లి అయిన తరువాత హనీమూన్‌ కోసం కేరళ వెళ్లాం. సరదా, సంతోషం పక్కనపెడితే అక్కడ నా  భర్త నుంచి అవమానాలే ఎదురయ్యాయి. ‘ఇక్కడ నువ్వు కాకుండా ఇంకో అమ్మాయి అయితే ఇంకా బాగా చూసుకునేవాడ్ని’ అన్నాడు. ఈ మాటను మా అమ్మకు చెప్పి బాధపడ్డాను.‘‘ పెళ్లికి ముందు బ్యాచిలర్‌గా ఉన్నాడు కదా..ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదులే అవన్నీ పట్టించుకోకు’’ అంటూ అమ్మ నన్ను ఓదార్చింది. 

వేధింపులు, అబార్షన్‌ ప్రయత్నాలు
‘‘మీ అక్కకి ఎక్కువ కట్నం ఇచ్చారంటగా.. మరి నీకెందుకే.. తక్కువ కట్నం ఇచ్చారు. మా వదిన చూడు మా ఇంటికి వస్తూ రూ.2కోట్లు కట్నం తెచ్చింది. నువ్వు ఊపుకుంటూ వచ్చేస్తే నిన్ను పోషించడం ఎలాగే..పో.. మీ అమ్మ,నాన్న దగ్గరకు వెళ్లి ఇంకా ఏమైనా తీసుకురా.’.. అంటూ పెళ్లయిన మూడో నెల నుంచే నా భర్త దెప్పడం మొదలుపెట్టాడు. నేను ప్రెగ్నెంట్‌ అయ్యాక హైదరాబాద్‌లోని మధురానగర్‌ ఉన్న ఒక హాస్పిటల్‌కి వెళ్లి ‘‘నా భార్యకు అబార్షన్‌ చేయాలి. ఇది నా భార్య ఇష్టంతోనే చేస్తున్నాను’’ అని అక్కడి అప్లికేషన్స్‌పై సంతకాలు కూడా చేశాడు. నేను హాస్పిటల్‌కు వెళ్లాక అక్కడి సిబ్బంది నాకు ఒక అప్లికేషన్‌ ఇచ్చి సంతకం పెట్టమన్నారు.  వాటిని చదివితే తెలిసింది.. అవి అబార్షన్‌ పేపర్స్‌ అని! వెంటనే నా భర్తను నిలదీశాను. హాస్పిటల్‌ వాళ్లు కూడా ఆయన్ని మందలించారు. ఇంటికి వెళ్లగానే.. ‘‘పిల్లలే కదా మళ్లీ పుడతారు. ఎంతమంది అబార్షన్‌ చేయించుకోవట్లేదు?’’ అంటూ నాపై ఎగిరిపడ్డాడు. నేను మా అమ్మ, నాన్నలకు చెప్పాను. వాళ్లు వచ్చి, ‘‘ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసేయ్‌.. అంతే కానీ నీ ఇష్టం వచ్చినట్లు మా అమ్మాయిని వేధిస్తే మాత్రం సహించం’’ అని వార్నింగ్‌ ఇచ్చారు. అక్కడే ఉన్న మా అక్క జోక్యం చేసుకుని ‘‘పుట్టబోయే బిడ్డను నేను పెంచుకుంటానులే.. అబార్షన్‌ ఏం చేయించకు’’ అని చెప్పడంతో అప్పుడు శాంతించాడు! 

రూ.2లక్షలు అడిగాడు
2014 సెప్టెంబర్‌లో పాప పుట్టింది. డెలివరీ సమయంలో నాన్న రూ.50 వేలు నా భర్త చేతికి ఇచ్చాడు. నేను బెడ్‌మీద ఉండగానే నా దగ్గరకు వచ్చి ‘నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2లక్షల ఖర్చు అయ్యింది. ఈ రెండు లక్షలను తిరిగి నాకు ఇవ్వాలి’ అంటూ వేధింపులు మొదలుపెట్టాడు. 

ఇల్లంతా బ్లీడింగ్‌!
యూఎస్‌లో ఉద్యోగం వచ్చిందంటూ నన్ను ఇక్కడే ఉంచి తను యూఎస్‌ వెళ్లాడు. రెండు నెలల్లో నన్ను కూడా తీసికెళ్తానని చెప్పి కాలయాపన చేశాడు. మా నాన్న ‘మానవతని అమెరికాకు ఎప్పుడు తీసుకెళ్తావ్‌?’ అంటూ సీరియస్‌గా అడిగితే అప్పుడు..వీసా ఏర్పాట్లు చేశాడు రమ్మని. వీసా ఏర్పాట్ల సమయంలో అత్త, నా భర్త వాళ్ల అన్నయ్యలు నా డాక్యుమెంట్స్‌ను దాచేసి చాలా ఇబ్బందులకు గురిచేశారు. పాపతో పాటు, యూఎస్‌ వెళ్లాక ‘నువ్వు రాకుండా ఉంటే డబ్బులు మిగిలేవి కదా’.. అంటూ మళ్లీ స్టార్ట్‌ చేశాడు. ‘మీ నాన్నకు గుండెనొప్పి వచ్చినప్పుడు రూ.25వేలు బిల్లు కట్టాను. అవి ఇంత వరకు ఇవ్వలేదు. నువ్వు ఇవ్వు లేదా..మీ నాన్నని ఇవ్వమను’ అంటూ సూటిపోటి మాటలతో వేధించాడు. అవి   భరించలేక మా మేనమామకు కాల్‌ చేసి డబ్బులు అడిగాను. మామయ్యను అడిగిన విషయం మా అమ్మకు చెప్తే.. అమ్మ నాన్నకు చెప్పింది. నాన్న చాలా బాధ పడి వెంటనే మా ఆయనకు ఫోన్‌ చేశాడు.

కన్నీళ్లతో నాన్న బతిమలాడారు
‘‘నీ డబ్బులు నీకు వారం రోజుల్లో అకౌంట్‌లో వేస్తా.. దయచేసి నా కూతుర్ని అక్కడ ఇబ్బందులు పెట్టొద్దు’ అంటూ ఏడ్చేశాడు మా నాన్న. ఎంత చెప్పినా వినట్లేదని నా మెడలో ఉన్న నల్లపూసల దండని తీసి ‘నేను రూ.25వేలు ఇచ్చే వరకు ఇది నీదగ్గర పెట్టుకో.. దయచేసి మా అమ్మ, నాన్నలను డబ్బుల కోసం పదే పదే వేధించకు’ అంటూ కాళ్లు పట్టుకుని ఏడ్చాను. అప్పుడు సరేనంటూ మా నాన్నకు ఫోన్‌ చేసి మీ దగ్గర ఉన్నప్పుడే డబ్బులు ఇవ్వండి అని చెప్పాడు. యూఎస్‌లో వేరే అమ్మాయితో ఎఫైర్‌ పెట్టుకున్నాడు. ఈ విషయం అడిగితే నన్ను చిత్రహింసలకు గురిచేశాడు. ఇదే సమయంలో నేను ప్రెగ్నెన్సీలో ఉంటే అబార్షన్‌ కోసం మళ్లీ ప్రయత్నాలు చేశాడు. నాకు అబార్షన్‌ ఇష్టం లేదూ అన్నాను. టార్చర్‌ మొదలు. ‘సరే అబార్షన్‌ చేయించుకుంటా’ అని చెప్పిన మరుసటి రోజే డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుని హాస్పిటల్‌కు తీసికెళ్లాడు. అక్కడ నాకు వాళ్లు కొన్ని ట్యాబ్లెట్స్‌ ఇస్తే అవి వేసుకున్నాను. ఇంటికి వచ్చాక, ‘ట్యాబ్లెట్స్‌ మింగిన వెంటనే కళ్లు మూతలు పడి కిందపడిపోయే సమయంలో ‘ఫణి..ఫణి..’ అని నా భర్తను పిలిచినా ఆయన పట్టించుకోలేదు. పడిపోతున్న సమయంలో ఇంట్లో లైట్లు అన్నీ ఆఫ్‌ చేశాడు. కొద్దిసేపయ్యాక.. నేనేం చప్పుడు చేయట్లేదని లైట్లు వేసి చూశాడు అప్పటికే ఆ రూమ్‌ అంతా బ్లీడింగ్‌తో నిండిపోయింది. పట్టించుకోలేదు.  ఆ అమ్మాయితో మేసేజ్‌లు ఏంటి అని ప్రశ్నిస్తే నన్ను విపరీతంగా కొట్టాడు. ‘నీకెందుకే..నువ్వు ఏమైనా సంపాదిస్తున్నావా..? నా ఇష్టం వచ్చినట్లు చేస్తా.. ఇంట్లో పడి ఉండూ బూతులు తిట్టాడు’. కొట్టిన దెబ్బలకు తల, ముక్కులో నుంచి రక్తం కారుతుంది. అయినా హాస్పిటల్‌కు తీసికెళ్లలేదు. నేను అంత బాధపడుతున్నా.. ఇరవై రోజుల వరకు నన్ను హాస్పిటల్‌కు తీసికెళ్లకుండా ఇంట్లోనే ఉంచాడు. 

ఇండియాకు తీసుకొచ్చాడు
‘‘నేను స్టాంపింగ్‌ కోసం ఇండియా వెళ్లాలి.. కలిసి వెళ్దాం రా’’  అన్నాడు ఓ రోజు. ‘‘నేను రాను నువ్వు వెళ్లి రా.. ’’ అంటే వినలేదు. బలవంతంగా నన్ను ఇండియా తీసుకొచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌ వద్ద నాకేమో..క్యాబ్‌ మాట్లాడాడు. తను తన మామయ్య, బాబాయ్‌లతో కలసి సొంత కారులో వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి పంజాగుట్టలో ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌కు నన్ను బలవంతంగా తీసుకొచ్చి అక్కడ చిత్రహింసలు పెట్టాడు. నన్ను గెస్ట్‌హౌస్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. ఉదయం వచ్చిన దాన్ని సాయంత్రం మా అమ్మ, నాన్నలు వచ్చేవరకు బిక్కుబిక్కుమంటూ పాపతో ఉన్నాను. ఆ తరువాత మేము ఖమ్మం వెళ్లి నా భర్త గురించి అడిగాం. ఎవర్ని అడిగినా మాకు తెలీదు, మాకు తెలీదు అన్నారు. ఇదే విషయంపై ఖమ్మం ఉమెన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాము. పోలీసులు 498/ఏ, 506డివీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేశారు. నేను అత్తగారింట్లోనే ఉండాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను డీజీపీకి చూపించాం. డీజీపీ కూడా జిల్లా ఎస్పీకు ఆదేశాలు ఇచ్చారు. స్థానిక పోలీసులు మాత్రం సరైన రీతిలో స్పందించట్లేదు. నా భర్త అమెరికా నుంచి ఇండియాకు రావాలి అని, మా అత్తమామల్ని, వాళ్ల బంధువులను కఠినంగా శిక్షించాలని నేను  నా నాలుగేళ్ల కుమార్తెతో కలసి మా అత్త,మామల ఇంటి ఎదుట దీక్ష చేస్తున్నా’’ అని ఎంతో ఆవేదనగా చెప్పారు మానవత.

ఎక్కువ మాట్లాడితే  ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయిస్తాం
కోర్టు ఆదేశాల మేకు శుక్రవారం ‘ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌’ అధికారులు మానవత దగ్గరికి వచ్చారు. ‘‘నీకు న్యాయం చేస్తాం. ఇంతకాలంగా నువ్వు చేస్తున్న దీక్ష ఆదర్శనీయం’’ అన్నారు. అయితే లోపలికి వెళ్లి అత్తమామలతో మాట్లాడి వచ్చాక మాత్రం మాట మార్చారు! ‘‘వాస్తు ప్రకారం నువ్వు వాళ్లింట్లో ఉండటం కుదరదు’’ అన్నారు. అదేంటని అడిగితే, ‘‘ఎక్కువ మాట్లాడితే రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ని క్యాన్సిల్‌ చెయ్యమని కోర్టుకు పంపుతాం’’ అని బెదిరించారని మానవత చెప్పారు. 

‘‘ఆ తర్వాతి రోజు అదే దారిలో ఇంటికెళ్తూంటే లావణ్యకు వీధి మలుపు దగ్గర ఒక చిన్నమ్మాయి కనిపించింది. పదేళ్లుంటాయేమో ఆ అమ్మాయికి. మాసిపోయిన బట్టలతో, నల్లగా, బక్కచిక్కి ఉంది. నిజానికి లావణ్య అంతకుముందు రోజే ఆ అమ్మాయిని చూసింది. ఒకసారి రోడ్డుపైన, ఇంకోసారి కాలేజీ పక్కన, మరోసారి వారుండే వీధిలో అక్కడక్కడే తచ్చాడుతూంటే లావణ్య ఆ అమ్మాయిని చూసింది. బిత్తరచూపులు చూస్తూ, దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఇంకేదో వెతుకుతున్నట్లుగా ఉంది........’’  ఆ చిన్నమ్మాయి ఎవరి కోసం ఎదురుచూస్తోంది? ఆ అమ్మాయి వెతుకున్న దానికి, లావణ్యకు సంబంధం ఏంటి? ఆ చిన్నమ్మాయి దారి చూపులు ఎవరికోసం?   రేపటి ఫన్‌డేలో..  ‘దారి చూపులు’ అన్న కథలో..  చదవండి.. !!

ఆయనకు డెబ్భై ఏళ్లు. ఆమెకు అరవై ఏళ్లు. ఇద్దరిదీ అన్యోన్యమైన జంట. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరికి బాగోలేదంటే, ఇంకొకరు తట్టుకోలేరు. వారు సంతోషంగా ఉండటానికి వాళ్లిద్దరు బాగుంటే చాలు. అలాంటి ఇద్దరి జీవితంలో ఓ చిన్న కుదుపు. ఆ కుదుపు ఏంటి? దాంతో వాళ్లిద్దరిలో వచ్చిన మార్పేంటీ? ఆయనను ఆమె కోరిన ఒక చివరి కోరిక ఏంటి?  రేపటి ఫన్‌డేలో..  ‘కడపటి కోరిక’ కథలోచదవండి..!  
– చైతన్య వంపుగాని,  సాక్షి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top