ఆమెలా మారి అతడిలా మారిన వ్యక్తిని పెళ్లాడింది | Sakshi
Sakshi News home page

ఆమెలా మారి అతడిలా మారిన వ్యక్తిని పెళ్లాడింది

Published Wed, Aug 7 2019 8:39 AM

Transgender Thistha Das Marriage Special Story - Sakshi

ఆగస్టు 5 అంటే సోమవారం రోజు కోల్‌కతాలో జరిగిన ఈ పెళ్లి భిన్నమైనది. కుతూహలం రేపగలిగినది. అందుకే వార్తలకు కూడా ఎక్కింది. ఎందుకంటే ఇందులో వధువు గతంలో పురుషుడు. వరుడు గతంలో స్త్రీ.

ఉత్తర కోలకతా శివార్లలో ఉండే మహజాతి నగర్‌లో ‘తిస్తా దాస్‌’ ఇంటి అడ్రస్‌ ఎవరికైనా కొట్టినపిండి. ఆ ప్రాంతంలో ఉండేవాళ్లందరికీ తిస్తా దాస్‌ మంచికో చెడుకో తెలుసు. సగటు మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన తిస్తా గతంలో ‘సుశాంతో’గా ఆ చుట్టుపక్కలవారికి తెలుసు. తల్లిదండ్రులు కూడా సుశాంతో అబ్బాయి అనే అనుకున్నారు. కాని సుశాంతో మానసిక ప్రపంచం తానొక అమ్మాయినని చెప్తూ ఉండేది. అమ్మాయిలతో తిరగమని, అమ్మాయిలా వ్యవహరించమని చెప్తూ ఉండేది. హైస్కూల్‌ వయసులో ఆ మార్పును వ్యక్తపరచడం మొదలుపెడితే తోటి విద్యార్థుల నుంచి గేలి పొందాడు సుశాంతో. కాని కాలేజీ వయసు వచ్చేసరికి ఆడపిల్లలాగా బట్టలు కట్టుకోవడం ప్రారంభించాడు. దాంతో కాలేజీ సీనియర్లు, లోకల్‌ గూండాలు అతణ్ణి ఏడిపించడం మొదలెట్టారు. లైంగిక వేధింపులు మొదలయ్యాయి. ఇంట్లో ఇదంతా అశాంతి రేపింది. తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక సుశాంతో ఇంటినుంచి బయటికొచ్చేసి తోటి ట్రాన్స్‌జండర్‌ల సహాయంతో సొంత కాళ్లపై బతకడం నేర్చుకున్నాడు.

అయితే ఇదంతా పత్రికలలో రావడం వల్ల సుశాంతో అందరికీ తెలిశాడు. బెంగాల్‌లో మొదటి ట్రాన్స్‌జెండర్‌ ప్రిన్సిపాల్‌ అయిన డాక్టర్‌ మనాబి బంధోపాధ్యాయ్‌ ప్రోత్సాహంతో ‘సెక్స్‌ రీ అసైన్‌మెంట్‌ సర్జరీ’ (ఎస్‌.ఆర్‌.ఎస్‌) జరిపించుకుని తన పేరు తిస్తా దాస్‌గా మార్చుకున్నాడు(కుంది). తిస్తాగా మారి స్త్రీగా గుర్తింపు కోసం పోరాడుతున్న సుశాంతోను తల్లిదండ్రులు యాక్సెప్ట్‌ చేశారు. అయితే ఈ ఆపరేషన్‌ కోసం చేసిన అప్పు తీర్చలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న అపవాదు తిస్తా మీద పడింది. తిస్తా చెప్పడం అది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని.

ఏమైనా తిస్తాను కొల్‌కతా స్వీకరించింది. సినిమా పరిశ్రమలో తిస్తా ఒక నటిగా ప్రవేశం పొందింది. సినిమాలలో డాక్యుమెంటరీలలో నటించింది. ‘సెక్స్‌ రీ అసైన్‌మెంట్‌ సర్జరీ’ చేయించుకున్నాక ట్రాన్స్‌జెండర్‌ల మానసిక స్థితి ఎలా ఉంటుందనే అంశంపై బెంగాల్‌లో ఒక సినిమా తీస్తే అందులో నటించింది. ఈ సమయంలోనే అస్సాంకు చెందిన చక్రవర్తితో ఆమెకు పరిచయమైంది. అతడు కూడా ఎస్‌.ఆర్‌.ఎస్‌ తర్వాత పూర్తిగా పురుషుడిగా మారిన ‘ట్రాన్స్‌మాన్‌’. వీళ్లిద్దరూ జాతీయ ట్రాన్స్‌జెండర్‌ దినోత్సవమైన ఏప్రిల్‌ 15న తమ వివాహ నిర్ణయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడి చేశారు.

వరుడు చక్రవర్తి, వధువు తిస్తా దాస్‌
అయితే దీనిపై ఎల్‌.జి.బి.టి సమూహాల నుంచి సాధారణ సమాజం నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. ఎల్‌.జి.బి.టి సమూహంలోని కొందరు ‘ఎందుకు ట్రాన్స్‌మ్యాన్‌ని చేసుకుంటున్నావు. మామూలు మగవాణ్ణి చేసుకోవచ్చుగా’ అని ఆమెను అడిగారు. సాధారణ సమాజం ఇలాంటి పెళ్లిళ్ల సంప్రదాయంపై కొంత ఆందోళన వ్యక్తం చేసింది. అయితే తిస్తా ఇవన్నీ ఏమీ పట్టించుకోలేదు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఇష్టసఖుడిని పెళ్లాడింది.దేవతలు పూల వర్షం కురిపించకపోయినా ఆకాశం నాలుగు చినుకులనైతే చిలకరించింది.ప్రస్తుతానికి వాళ్లిద్దరికీ ఆ దీవెన చాలు.

Advertisement
Advertisement