భావనాబలమే ప్రాణశక్తి

Katta Manchi Ramalinga Reddy Kavitha Tatva Vicharam Book - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

కట్టమంచి రామలింగారెడ్డి ‘కవిత్వ తత్త్వ విచారము’ 1914లో వెలువడింది. ఆ కాలానికి అది విమర్శారంగంలో విప్లవాత్మక గ్రంథం. అప్పటికి కట్టమంచికి 34 ఏళ్లు. పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’ను ఆధారం చేసుకొని, మంచి కవిత్వమంటే ఏమిటో చర్చించడం ఈ రచన ముఖ్యోద్దేశం. కథనం, పాత్ర పోషణ, నాటకీయత, కల్పనాశక్తి, అంగాంగ సమన్వయం కుదిరిన రచనగా ఈ ప్రబంధాన్ని ఉదాహరించారు కట్టమంచి. ప్రాచీన తెలుగు కవుల్లో చాలామందికి భావనాబలం లేదనీ, ఇందుకు భారతకవులకు మాత్రం మినహాయింపునిస్తూ ఆ తర్వాత రాసిన వారిలో మితిమీరిన ఆలంకారితకు కారణం ఈ భావశూన్యతేననీ వారు విమర్శించారు. ఆలోచనలు, భావాలు, సంకల్పాలు మానవ ప్రకృతిలోని మూడు ముఖ్యాంశాలుగా చెబుతూ– ఈ భావాలు లేదా ‘మనోవికారము’లే భావనాశక్తికి మూలకారణం అన్నారు.

కామక్రోధాదులు, ప్రేమ, పశ్చాత్తాపం, దయ, దాక్షిణ్యం లాంటి చిత్తసంచారాలే ఈ వికారాలు. అయితే వీటిని వికారాలు అనడాన్ని ఆయన నిరసించారు. చిత్త చాంచల్యం లేకుండా, నిర్వికారంగా యోగుల్లా ఉండేవాళ్లు కవులు కాలేరని ఆయన ఉద్దేశం. పాండిత్యం లోంచీ, తు.చ. తప్పకుండా వ్యాకరణ నియమాలు పాటించడంలోంచీ కవిత్వం పుట్టదని చెప్పడానికి ఆయన ఒక సంఘటనను ఆ పుస్తకంలో ఉదాహరించారు. అది ఇక్కడ: వ్యాకరణము యతి ప్రాసములు అన్నియు దప్పక కుదిరినను భావనాశక్తి లేనియెడల నట్టి పాండిత్యము జీవములేని యాకారము వలె జడంబుగ గాన్పించును. 

ప్రదిమలు వ్రాయుటలో బహుసమర్థుడైన యొక శిల్పివర్యుని యెడకు, చిల్లర శిల్పి యొకడు పోయి తన లిఖించిన చిత్రపటముం జూపి, ‘‘దీనియం దేమైన దోషము లున్నవా?’’ యని ప్రార్థింపుడు నాతం డిట్లనియె ‘‘అయ్యా! గీతలు వర్ణములు మొదలగు గుణములన్నియు జక్క గుదిరి యున్నవికాని, యీ సుందర విగ్రహమునకు బ్రాణములే యున్నట్టు గానమే!’’ అది విని ‘‘ఏ రీతిని దిద్దిన దీనికి జైతన్యమబ్బును తెలుపవే మహాత్మా!’’ యని యా విద్యార్థి దీనుడయి వేడుడు, ‘‘అయ్యా! నీ చింత తీర్ప నా వలన గాదు. నీ యడిగిన వరంబు సాజమైన భావనాశక్తిచే లభ్యము. ఇట్టిట్లు చిత్రించుటచే ఘనుడవగుదువని చెప్పి చేయించుటలో ఫలము లేదు. వాని వాని మనోబలము కొలది బరిపూర్ణత్వము సిద్ధించునేకాని యలంకార శాస్త్రముల ననుసరించుట నిష్‌ప్రయోజనము!’’ అని యా కళాకోవిదుడు వాక్రుచ్చెను.

రీవిజిట్‌- బందిపోట్లు
​​​​​​​

సావిత్రి, ఈ ఒక్క కవితతోనే ‘బందిపోట్లు’ సావిత్రి అయ్యారు. ప్రచురణ: 1984. క్షయ వ్యాధితో అకాలమరణం చెందిన (1949–91) సావిత్రి రచనలతో ‘ఆమె అస్తమించలేదని’ పేరుతో అరణ్య కృష్ణ పుస్తకం తెచ్చారు. పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తాననిపంతులు గారన్నప్పుడే భయమేసిందిఆఫీసులో నా మొగుడున్నాడుఅవసరమొచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసిందివాడికేం మగ మహారాజని ఆడా మగా వాగినప్పుడే అర్థమైపోయింది పెళ్లంటే పెద్ద శిక్షని! మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని!! మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని!!!   - సావిత్రి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top