చంద్రబాబు చెప్పిన రహస్యం! | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చెప్పిన రహస్యం!

Published Sun, Apr 20 2014 3:10 PM

చంద్రబాబు చెప్పిన రహస్యం! - Sakshi

వినేవాడు విలేకరి అయితే చెప్పేవాడు చంద్రబాబు అనే నానుడి ఇటీవల కాలంలో జనాళ్ల నోళ్లలో నానుతోంది. బాబుగారి డాబు మాటలు విని దీన్ని పుట్టించినట్టున్నారు. నారా వారు నోరు విప్పితే గొప్పలకు గోడ కట్టడం ఎవరి తరం కాదు. దేశంలో హైటెక్ రంగానికి తానే ఆద్యుడనని, అందుకే తనను అందరూ హైటెక్ సీఎం అనేవారని ఆయన గప్పాలు కొడతారు. సిమ్ కార్డులు చాక్లెట్ కన్నా చవగ్గా దొరుకుతున్నాయంటే అది తన చలవేనని చెబుతారు చంద్రబాబు.

అక్కడితో ఆగకుండా హైదరాబాద్ కు బ్లిల్ గేట్స్ ను తీసుకొచ్చానని, భాగ్యనగరానికి వరల్డ్ మ్యాప్ లో గుర్తింపు తన భాగ్యమేనని కూడా అంటుంటారు. అసలు హైదరాబాద్ లో తాను హైటెక్ సిటీ కట్టకపోతే ఐటీ అభివృద్ధే లేదంటారు. హైదరాబాద్ ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతుందంటే అదంతా తన మహిమేనని చెప్పుకొస్తారు. తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడినని ఎంతో మందిని అవలీలగా ప్రధానమంత్రి కూర్చీలో పెట్టానని కూడా వల్లిస్తుంటారు. తనకు పీఎం సీటులో కూర్చునే అవకాశం వచ్చినా తెలుగు తమ్ముళ్ల కోసం త్యాగం చేశానని వాపోతారు.

తాజాగా బాబుగారు మరో రహస్యం వెల్లడించారు. గుజరాత్ అభివృద్ధి చెందడానికి ఆయనే కారణమట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రగతి పథంలో గుజరాత్ రేసు గుర్రంలా పరిగెత్తడానికి స్ఫూర్తినిచ్చింది తానేనని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేశారు చంద్రబాబు. ఈ విషయం తెలియక జాతిజనులు నరేంద్ర మోడీని పొడగ్తలతొ మోసేస్తున్నారు.  గుజరాత్ అభివృద్ధితో పాపులారిటీ పెరగడంతో కమలనాథులు కరువృద్దులను కాదని మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 

అయితే తమ స్ఫూర్తిప్రదాత రుణాన్ని కాషాయ పార్టీ మర్చిపోలేదు. స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నా వినకుండా పచ్చ పార్టీతో బలవంతపు పొత్తు పెట్టుకుని రుణం తీర్చుకుంది.  ఇక బీజేపీ కేటాయించిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చి తనకలవాటైన వెన్నుపోటు విద్య ప్రదర్శించారు సైకిల్ పార్టీ అధినేత. స్ఫూర్తిప్రదాత విశ్వాసఘాతుక చర్యపై కమలనాథులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆదిలోనే అభాసుపాలైన కాషాయ-పచ్చ పార్టీల భాగస్వామానికి ప్రజల మన్నన దక్కుతుందో, లేదో చూడాలి.

Advertisement
Advertisement