జగన్ దీక్ష భగ్నం : నిరసనగా ర్యాలీలు, ధర్నాలు | Sakshi
Sakshi News home page

జగన్ దీక్ష భగ్నం : నిరసనగా ర్యాలీలు, ధర్నాలు

Published Tue, Oct 13 2015 10:05 AM

జగన్ దీక్ష భగ్నం : నిరసనగా ర్యాలీలు, ధర్నాలు - Sakshi

కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై ఆ పార్టీ శ్రేణులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డాయి. జగన్ను అరెస్ట్కు నిరసనగా ఆందోళనబాట పట్టాయి.  పులివెందుల బస్టాండ్ వద్ద మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని పోరుమామిళ్లలో ఆ పార్టీ నాయకుడు విజయప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు పాల్గొన్నారు.  

అలాగే అనంతపురం జిల్లా రాయదుర్గం ఆర్టీసీ డిపో వద్ద మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను పోలీసులు భగ్నం చేసి... స్టేషన్కి తరలించారు.  ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గత బుధవారం గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ ర్యాలీ జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మంది ప్రకాశ్ చౌక్ నుంచి ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయం వరకు వెళ్లారు. అనంతరం ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ మండల డిప్యూటీ తహశీల్దార్ సుబ్రమణ్యంకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మోసేన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా విజయనగరం జిల్లా చీపురుపల్లి బస్టాండ్ కాంప్లెక్స్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు మంగళవారం ముట్టడించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ముట్టడించారు. అలాగే పార్వతీపురం, సాలూరులో కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు రహదారి దిగ్బంధంతో పాటు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ముట్టడించారు.


ఆయన దీక్ష చేపట్టి సోమవారానికి ఆరు రోజులయింది. వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయినా దీక్ష విరమించేది లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున... పోలీసులు వైఎస్ జగన్ను బలవంతంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి...  ఆయన చేపట్టిన దీక్షను భగ్నం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement