రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

Published Sat, Sep 24 2016 11:24 PM

కుటుంబ సభ్యులతో మృతి చెందిన వెంకటరమణమూర్తి, విజయలక్ష్మి - Sakshi

రెండేళ్ల కిందట వరకు ఆయన సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి. సర్వీసు కాల పరిమితి పూర్తవడంతో స్వగ్రామానికి వచ్చేసి మడపాం టోల్‌ప్లాజాలో అసిస్టెంట్‌గా చేరాడు. పిల్లల చదువుల నిమిత్తం స్వగ్రామాన్ని వీడి నరసన్నపేటలో అద్దె  ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం తన బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆ దంపతులు బలగలో వారింటికి వెళ్లారు. కాసేపు యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. తిరిగి నరసన్నపేట వెళ్లేందుకు బయలుదేరారు. ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు వారిని వెంటాడింది. జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చి ఢీకొంది. భార్యాభర్తలిద్దరూ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. దీంతో వారింట, గ్రామంలో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళ్తే...
 
 
పాత శ్రీకాకుళం : జాతీయ రహదారిపై శివశంకర్‌ మోటార్స్‌ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. బంధువుల ఇంటికని బయలుదేరిన వారు అక్కడకు వెళ్లి కాసేపు యోగక్షేమాలు మాట్లాడిన తరువాత తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలోనే వారిని మృత్యువు వెంటాడింది. వివరాల్లోకి వెళ్తే...జలుమూరు మండలం బుడితిలక్ష్మీపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు పొన్నాన వెంకటరమణమూర్తి(43), విజయలక్ష్మి(36) నగరంలోని బలగ వద్ద ఉంటున్న తమ బంధువుల ఇంటికని శనివారం వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారి గుండా వెళ్తుండగా శివశంకర్‌ మోటార్స్‌ వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీకొంది. దీంతో వీరి తలలు ఛిద్రమయ్యాయి. లారీ వెనుక టైర్లు రెండూ వీరి తలల మీదుగా వెళ్లడంతో గుర్తుపట్టలేనంతగా చితికిపోయాయి. దీంతో సంఘటన స్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు. వీరి స్వగ్రామం బుడితిలక్ష్మీపురం కాగా పిల్లల చదువు నిమిత్తం నరసన్నపేటలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. 
 
సీఆర్‌పీఎఫ్‌ మాజీ జవాను
మృతుడు పొన్నాన వెంకటరమణ సీఆర్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తూ రెండేళ్ల కిందటే తన సర్వీసు పూర్తి కావడంతో ఇక్కడకు వచ్చేశారు. మడపాం టోల్‌ప్లాజ్‌లో అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి చదువు కోసమే స్వగ్రామాన్ని వీడి నరసన్నపేటలో కొద్ది కాలంగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.  పెద్ద కుమారుడు రాము నరసన్నపేటలో రవీంద్రభారతి స్కూల్లో పదో తరగతి చదువుతుండగా రెండో కుమారుడు ప్రసన్న ఏడో తరగతి చదువుతున్నాడు. వీరి మృతి వార్త తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు.  
 
దర్యాప్తునకు పోలీసు బృందాలు
జాతీయ రహదారిపై సంఘటన జరిగిన వెంటనే తప్పించుకున్న లారీని పట్టుకునేందుకు రూరల్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్‌ఐ మోహన్‌రావు ఆధ్వర్యంలో పోలీసు బృందాలుగా విడిపోయి మమ్మురంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రధానంగా  మడపాం నుంచి ఇచ్ఛాపురం వరకూ టోల్‌ ప్లాజా నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పోలీసులు జాతీయ రహదారి గుండా ఇచ్ఛాపురం వైపు వెళ్లారు.
 
లక్ష్మీపురంలో విషాదం
సారవకోట : శ్రీకాకుళం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతులు పొన్నాన రమణమూర్తి, విజయలక్ష్మిల స్వగ్రామమైన లక్ష్షీ్మపురంలో విషాదచాయలు అలుముకున్నాయి.  గ్రామానికి చెందిన పొన్నాన శ్రీరామూర్తి, సూరమ్మల కుమారుడైన రమణమూర్తి ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గ్రామం వచ్చేటప్పుడు అందరితో కలిసి, మెలిసి ఉండే వాడని గ్రామస్తులు తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌లో సర్వీసు పూర్తవడంతో నరసన్నపేటలో ఇద్దరు పిల్లల చదువు నిమిత్తం అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు వారు తెలిపారు. భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
 
 

Advertisement
Advertisement