బ్యాంక్‌ షేర్లు బేర్‌... | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ షేర్లు బేర్‌...

Published Thu, May 17 2018 1:12 AM

 Stock market: Sensex 150 points down, Nifty 10750 - Sakshi

కర్ణాటకలో ఫలితాల అనంతరం అనిశ్చితి చోటు చేసుకోవడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతినడం ప్రతికూల ప్రభావం చూపించింది. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మొండి బకాయిలు భారీగా పెరగడం, కొన్ని బ్యాంక్‌లపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌156 పాయింట్లు నష్టపోయి 35,387 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే ముడి చమురు ధరలు రికవరీ కావడం, డాలర్‌తో రూపాయి మారకం కోలుకొని 31 పైసలు లాభపడటంతో నష్టాలు తగ్గాయి.
 
302 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 
దక్షిణ కొరియాతో ఉన్నత స్థాయి చర్చలను ఉత్తర కొరియా అనూహ్యంగా రద్దు చేయడం, అమెరికాతో శిఖరాగ్ర సమావేశాన్ని కూడా రద్దు చేస్తామని హెచ్చరించడంతో ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌ మీద కూడా పడింది. సెన్సెక్స్‌ 35,452 పాయింట్ల వద్ద నష్టాల్లో ఆరంభమైంది.  ఒక దశలో 302 పాయింట్ల నష్టంతో 35,242 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 102 పాయింట్ల వరకూ నష్టపోయింది. 

ఏడాది కనిష్టానికి 9 బ్యాంక్‌ షేర్లు..: పభుత్వ  బ్యాంక్‌లు భారీ నష్టాలను ప్రకటించడం, తాజా రుణాలు జారీ చేయకుండా కొన్ని బ్యాంక్‌లపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో 9 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఆర్‌కామ్, రెండు అనుబంధ కంపెనీలకు వ్యతిరేకంగా  రూ. 1,150 కోట్ల బకాయిల రికవరీ కోసం ఎరిక్సన్‌  దివాళా పిటిషన్లను ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. దీనితో అనిల్‌ అంబానీ గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లు నష్టపోయాయి.  

Advertisement
Advertisement