ఉత్తరాఖండ్‌లో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్‌లు

MoneyGram and Grupo Elektra Extend Partnership in Mexico - Sakshi

అయిదేళ్లలో 500 బస్సుల సరఫరా

 రూ.700 కోట్లు 

 వెచ్చించనున్న కంపెనీ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌... ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఆ రాష్ట్రంలో 500 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను ఒలెక్ట్రా ప్రవేపెట్టనుంది. వీటికోసం కంపెనీ రూ.700 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సమక్షంలో ఉత్తరాఖండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఎండీ బ్రిజేష్‌ కుమార్‌ సంత్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఈడీ నాగ సత్యం ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. డెహ్రాడూన్‌– ముస్సోరి మధ్య నెల రోజులపాటు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు. చార్జింగ్‌కు అవసరమైన మౌలిక వసతులను డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేశారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్‌ల దిగ్గజం బీవైడీ ఆటో ఇండస్ట్రీ సహకారంతో హైదరాబాద్‌ సమీపంలోని ఒలెక్ట్రా ప్లాంటులో తయారైన 9 మీటర్ల పొడవున్న ఈ–బజ్‌ కే7, 12 మీటర్ల పొడవైన ఈ–బజ్‌ కే9 బస్‌లు ఉత్తరాఖండ్‌ రోడ్లపై పరుగులెత్తుతాయి. 

కొత్త నగరాల్లో ఒలెక్ట్రా.. 
ఢిల్లీ, పుణే, ఉత్తరప్రదేశ్, అహ్మదాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నగరాలు, రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన టెండర్లలో తాము పాల్గొంటున్నట్లు నాగ సత్యం ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇప్పటి వరకు పలు నగరాల్లో కంపెనీ రూపొందించిన 30 బస్సులు పరుగెడుతున్నాయని, మరో 160 బస్‌లకు ఆర్డర్లున్నాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘ఉత్తరాఖండ్‌కు వచ్చే అయిదేళ్లలో 500 బస్సులను సరఫరా చేస్తాం’’ అని చెప్పారాయన. కాగా, ఈ బస్సుల తాలూకు లిథియం అయాన్‌ బ్యాటరీ ఒకసారి చార్జ్‌ చేస్తే బస్సు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బస్‌లో సీసీటీవీ కెమెరా, జీపీఎస్‌ నావిగేషన్, ప్యానిక్‌ బటన్‌ తదితర ఏర్పాట్లు ఉన్నాయి. ఒలెక్ట్రాలో ప్రముఖ మౌలిక రంగ కంపెనీ ఎంఈఐఎల్‌కు మెజారిటీ వాటా ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top