టీడీపీ పాలన.. ప్రజలకు భారం | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలన.. ప్రజలకు భారం

Published Mon, Jun 4 2018 7:30 AM

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి ,పెనుగొండ: ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం విపరీతమైన భారాన్ని మోపుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వంక రవీంద్రనాథ్‌ విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నేతలు కూడా ప్రసంగించారు. వంక రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ విదేశీ పరిశ్రమలకు కల్పించే రాయితీలను రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు స్థాపించే పరిశ్రమలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. సంక్షోభంలో కూరుకుపోయిన పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం చేయూత నివ్వకపోతే పరిశ్రమలకు మనుగడ ఉండదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటి పన్నులు ఐదు రెట్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రజలను ఆదుకోవడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చక్కటి ప్రణాళికతో నవరత్నాలు ప్రకటించారన్నారు. వీటితో పేద ప్రజలు బాధలు తప్పుతాయన్నారు.

బడుగు, బలహీన వర్గాలను బాధపెడుతున్నారు : చెల్లెం
బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనంద ప్రకాశ్‌ విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైని నిత్యవసర వస్తువులన్నీ పంపిణీ చేస్తే, చంద్రబాబు అన్నింటికీ కోత విధించి కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారన్నారు.

జిల్లాకు చేసింది శూన్యం: ప్రసాదరాజు
గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు 15 నియోజకవర్గాలను టీడీపీకి అందించారని వైఎస్సార్‌ సీపీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. ఇంతా గెలిపిస్తే చంద్రబాబు జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన విమర్శించారు.

జగన్‌ అడుగుజాడల్లోనే పయనం :కవురు శ్రీనివాస్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తనకు తల్లితో సమానమని, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను నడుచుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కవురు శ్రీనివాస్‌ సభలో తెలిపారు. ఆచంట నియోజకవర్గ ప్రజలు సమన్వయకర్తగా తనకు అందించిన సహాయ, సహకారాలు మరువలేనని కృతజ్ఞతలు చెప్పారు.

ఆచంట ప్రజలు సమస్యలతో సతమతం: రంగనాథరాజు
ఆచంట నియోజకవర్గ ప్రజలు దీర్ఘకాలంగా అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారని ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి మధ్యన ఉండే అయోధ్య లంక ప్రజలు వంతెన లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదమని తెలిసినా వారికి పడవ ప్రయాణం తప్పడంలేదన్నారు. వంతెన నిర్మాణంతోనే వారి సమస్యలు తీరుతాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్టా గోదావరిపై కోడేరు గన్నవరం మధ్య వారధి నిర్మించాలని, దొంగ రావిపాలెం వద్ద బ్యాంక్‌ కెనాల్‌పై శాశ్వత ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని, నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, ఆచంట పెనుగొండ మండల కేంద్రాలలోని 30 పడకల ఆసుపత్రులలో వైద్యులను పూర్తిస్థాయిలో నియమించాలని ఆయన జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పెనుగొండలో దాతలు జవ్వాది వారి కుటుంబం నిర్మించిన బస్టాండు వారిపేరుతోనే పునఃనిర్మించాలని, ఈ ప్రాంతంలో అతిపెద్ద మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, కుంటుపడిన 108, ఆరోగ్య శ్రీ సేవలకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.

వైఎస్సార్‌ సీపీలో చేరికలు
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెనుగొండలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చిన్నంవారి పాలెంకు చెందిన చిన్నం రామిరెడ్డి, వెంకట్రాపురంలకు చెందిన పిల్లి నాగయ్యలతో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీలో చేరారు. దీంతో పార్టీలో నూతనోత్సహం వెల్లివిరిసింది. బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement