Sakshi News home page

విత్తనాల కోసం ఆందోళన

Published Sun, Sep 28 2014 3:45 AM

Concern for the seeds

ఒంగోలు టూటౌన్ : విత్తనాల కోసం రైతన్న మళ్లీ రోడ్డెక్కాడు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ఒంగోలు వచ్చి నాలుగు రోజులుగా ఏపీ సీడ్స్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా విత్తనాలు లేవంటూ సిబ్బంది చెప్పడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారుల వైఖరికి నిరసనగా శనివారం జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు.  తాము అడిగితే విత్తనాలు లేవని చెబుతున్న అధికారులు ప్రైవేటు వ్యాపారులకు రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గంటకు పైగా రైతుల ఆందోళనతో హైవేలో ఇరువైపులా కిలోమీటరుపైగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను విరమింపజేశారు.

అనంతరం అసలు గోదాములో విత్తనాలున్నాయో లేదో చూద్దామంటూ రైతులంతా మూకుమ్మడిగా గోదాముకు పరుగులు తీశారు. గోదాము తాళాలు తీయాలని ఏపీ సీడ్స్ సిబ్బందితో పట్టుబట్టారు.  తలుపులు తీసి చూడగా అందులో దాదాపు 350 బస్తాల ఎన్‌ఎల్‌ఆర్ -145 రకం, 1010 రకం వరి విత్తనాలు నిల్వలుండటంతో రైతులు విస్తుపోయారు. విత్తనాలు ఉంచుకోని కూడా లేవని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఏపీ సీడ్స్ మేనేజర్ బ్రహ్మయ్యను నిలదీశారు. అదే సమయంలో ఒక ప్రైవేటు ట్రక్కులో గోదాము నుంచి తరలిస్తున్న విత్తనాలను రైతులు పట్టుకున్నారు.

వాహనాన్ని ఆపి ఇదేంపని అంటూ అధికారులను నిలదీశారు. అవి ఏపీసీడ్స్ విత్తనాలు కావని చెప్పినా రైతులు నమ్మని పరిస్థితి నెలకొంది. ఇక అధికారులకు గత్యంతరం లేక..విత్తన సరఫరాకు రశీదులు ఇస్తామనడంతో రైతులు శాంతించారు. గోదాముల వద్ద నుంచి ఏపీ సీడ్స్ కార్యాలయానికి పరుగులు తీశారు. విత్తన సరఫరాలో అధికారుల నిర్లక్ష్యంపై  ఏపీ రైతు సంఘం నాయకులు దుగ్గినేని గోపినాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  పదిరోజులుగా అందుబాటులో లేని ఏపీసీడ్స్ మేనేజర్ శనివారం కార్యాలయంలో దర్శనమివ్వడం చర్చనీయాంశ మైంది. మేనేజర్‌పై శుక్రవారమే ఒంగోలు ఎమ్మెల్యేకి రైతులు ఫిర్యాదు చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement