పాదయాత్రపై పోలీసుల జులుం | Sakshi
Sakshi News home page

పాదయాత్రపై పోలీసుల జులుం

Published Tue, Nov 21 2017 5:36 AM

Case Filed Against YS Jagan over Keeping Mahila Sabha

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రపై ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రారంభించింది. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని హుసేనాపురం సమీపంలో సోమవారం చేపట్టిన మహిళా సదస్సును వద్దన్నా నిర్వహించారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని అభియోగం మోపుతూ బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాటసాని రామిరెడ్డిపై పోలీసులు ఐపీసీ 188, పోలీసు యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. 

అయితే.. పాదయాత్రపై పోలీసులకు ముందే సమాచారం ఇవ్వడంతోపాటు సభలు, సమావేశాలు నిర్వహిస్తామని కూడా ఆ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తదనంతర చర్యల కోసం పోలీసులు న్యాయ శాఖ అభిప్రాయం కోరినట్లు తెలిసింది. వాస్తవానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడతానని ప్రకటించినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నేరుగా సీఎం స్థాయిలో చంద్రబాబు కూడా మంత్రివర్గ సమావేశంలో.. వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై విమర్శలు గుప్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసు నమోదు కావడంపై ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
 

Advertisement
Advertisement