ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరగాలంటే మళ్లీ జగనే రావాలి | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరగాలంటే మళ్లీ జగనే రావాలి

Published Tue, Nov 21 2023 12:16 AM

- - Sakshi

కడప కార్పొరేషన్‌ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌ బాబు, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎవరూ, ఎక్కడా చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాల్లో వారిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలకు పనిముట్లు ఇచ్చి వారిని కులవత్తులకే పరిమితం చేయాలని చూస్తే, దివంగత వైఎస్సార్‌ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టి ఆయా వర్గాలకు ఉన్నత చదువులు చదివించారన్నారు. సామాజిక సాధికార బస్సుయాత్రలకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని, కడపలో కూడా ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్‌ కె. సురేష్‌ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కీలక పదవులు కట్టబెట్టి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారన్నారు. పార్టీకి 8 రాజ్యసభ పదవులు వస్తే అందులో నాలుగింటిని బీసీలకే ఇచ్చారని గుర్తు చేశారు. మొదటిసారి యాదవులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాన్నారు. అన్ని సామాజిక వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏ విధంగా మేలు చేసిందో తెలియజేయడానికే బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.

సామాజిక సాధికారత మా ప్రభుత్వ విధానం

– డిప్యూటీ సీఎం

గతంలో సామాజిక సాధికారత ఒక నినాదంగా మాత్రమే ఉండేదని, ప్రస్తుత మా ప్రభుత్వం దానిన విధానంగా మార్చేసిందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా అన్నారు. రాష్ట్ర జనాభాలో 70 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 25 మంది మంత్రులుండగా 75 శాతం అనగా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులే ఉన్నారన్నారు. వారిలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. అన్ని పదవుల్లో పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చారని అందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారన్నారు.లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలను టీబీటీ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు అందించామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వకుండా పాలన చేశారని చెప్పారు. కడపలో 23వ తేది సాయంత్రం 3.30 గంటలకు ఏడు రోడ్ల కూడలి వద్ద సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభ జరుగనుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయ్రపదం చేయాలని పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు

మధ్య యుద్ధం – ఎమ్మెల్సీ

రాబోయే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగబోతోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. పేదలకు ప్రతినిధిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉంటే పెత్తందారులకు ప్రతినిఽధిగా చంద్రబాబు ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 59వేల మందికి పదోన్నతులు ఇచ్చి, సామరస్యంగా బదిలీలు చేశారన్నారు. 3200 ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయబోతున్నారని, 8200 పోస్టులకు డీఎస్సీ నిర్వహించనున్నారని తెలిపారు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదల కానుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఛైర్మెన్‌ పులి సునీల్‌ కుమార్‌, వేర్‌ హౌస్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ కరిముల్లా, టీటీడీ బోర్డు సభ్యులు ఎస్‌. యానాదయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు చొప్పా యల్లారెడ్డి, జయచంద్రారెడ్డి, సీహెచ్‌ వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌

ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి

23న కడపలో సామాజిక సాధికార

బస్సుయాత్రను విజయవంతం చేయాలని పిలుపు

Advertisement

తప్పక చదవండి

Advertisement