విత్తనాలకు కృత్రిమ కొరత | Sakshi
Sakshi News home page

విత్తనాలకు కృత్రిమ కొరత

Published Sun, May 26 2024 4:15 AM

విత్తనాలకు కృత్రిమ కొరత

సాక్షి, యాదాద్రి: రైతులు కోరుతున్న పత్తి విత్తనాలను బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు బ్లాక్‌ చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు నాటు కోవాలని ఆశతో ఉన్న రైతులకు బ్లాక్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారు. ధరలపై ప్రశ్నించిన వారిని పత్తి విత్తనాలు లేవని తిప్పి పంపిస్తున్నారు. గ్రామాల్లో అరువుపై పత్తి విత్తనాలు తీసుకునే రైతులకు మూడు ప్యాకెట్‌లు అడిగితే ఒక ప్యాకెట్‌ కంపెనీది, మిగతా రెండు ప్యాకెట్లు సాధారణ రకానికి చెందినవి అంటగడుతున్నారు.

రోహిణి కార్తె ప్రవేశంతో..

వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో చాలా వరకు బోర్లు వట్టిపోయాయి. వానాకాలంలో రైతులు వరికి బదులుగా పత్తి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇందుకుగాను భూమిని చదును చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,35,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా 2,70,000 పత్తి విత్తనాలు ప్యాకెట్లు అవసరం ఉంటాయి. ఇప్పటికే రోహిణి కార్తె ప్రవేశించింది. ఈ కార్తెను రైతులు బలమైన కార్తెగా భావించి, ఈ సమయంలో విత్తనాలు విత్తితే మొక్క బలంగా పెరగడంతో పాటు దిగుబడులు అధికంగా ఉంటాయని నమ్ముతారు. దీంతో పత్తి విత్తనాల కోసం వ్యాపారుల వద్దకు బారులు తీరుతున్నారు.

బ్లాక్‌ చేసి అధిక ధరలకు..

సంకేత్‌నాత్‌, యూఎస్‌–7067, ఆధ్యా, ఆశ, కబడ్డీ, అఖండ, రాశి–659, సదానంద్‌ ఇలా కొన్ని ప్యాకెట్లపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. పత్తి విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీ డీలర్లు సిండికేట్‌గా మారి కొన్ని కంపెనీల విత్తనాలకు తీవ్రమైన కొరత చూపిస్తూ వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన బీటీ– 2 రకం విత్తనాల ప్యాకెట్‌ రూ.864కు అమ్మాలి. కానీ రూ.900 నుంచి రూ. 1400 వరకు విక్రయిస్తున్నారు. ఓ కంపెనీ ప్యాకెట్‌ ధర అయితే ఏకంగా రూ.2వేలకు పైగా విక్రయిస్తున్నారు. అధిక ధరలపై ఎవరైనా ప్రశ్నిస్తే మామూలు కంపెనీల విత్తన ప్యాకెట్లు లింక్‌ పెడుతున్నారు. అయితే కొందరు రైతులు తమకు కావాల్సిన విత్తనాలు కోసం ఏపీలోని గుంటూరు, మాచర్ల, మహారాష్ట్రలోని నాందేడ్‌, ఔరంగాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు.

అధిక ధరలకు విక్రయించొద్దు

పత్తి విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవు. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. గత వానాకాలంలో( 2023)లో 1,02,407 ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈ సారి 1,35,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా వేశాం. ఇందుకోసం 2,70,000 ప్యాకెట్లు అవసరమవుతాయి. అధిక ధరలకు విక్రయించే వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

– అనురాధ, జిల్లా వ్యవసాయాఽధికారి

ఫ సిండికేట్‌ అయిన విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు

ఫ కొన్ని కంపెనీల విత్తనాల కొరత చూపించి అధిక ధరలకు విక్రయం

ఫ ప్రశ్నించిన రైతులకు స్టాక్‌ లేదని చెబుతున్న వ్యాపారులు

ఫ అరువు రైతులకు

సాధారణ కంపెనీ విత్తనాల అమ్మకం

Advertisement
 
Advertisement
 
Advertisement