అధిక వడ్డీ ఆశచూపి మోసం | - | Sakshi
Sakshi News home page

అధిక వడ్డీ ఆశచూపి మోసం

Published Thu, May 16 2024 11:10 AM | Last Updated on Thu, May 16 2024 11:10 AM

అధిక

అధిక వడ్డీ ఆశచూపి మోసం

మునుగోడు: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపి అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసింది ఓ కంపెనీ. ప్రతినెలా అధిక వడ్డీతో పాటు ప్లాట్లు ఇస్తామని చెప్పడంతో మొదట ఒక్కొక్కరు రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. వారికి కొన్నినెలల పాటు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత కంపెనీ బోర్డు ఎత్తేశారు. వివరాలు.. మెదక్‌ జిల్లాకు చెందిన ఇద్దరితో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన మరొక వ్యక్తి కలసి హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో డివైన్‌ డెవలపర్స్‌ పేరుతో 2021లో కార్యాలయం ప్రారంభించారు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి వాటిని అమ్మగా వచ్చిన లాభంతో పెట్టుబడి పెట్టిన వారికి రూ.లక్షకు ప్రతినెలా వడ్డీ రూ.10వేల చొప్పున, రూ.10లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి 20నెలల పాటు ప్రతినెలా రూ.లక్ష వడ్డీతో పాటు ఒక ప్లాటు రిజిస్ట్రేషన్‌ చేస్తామని నమ్మించారు. ఇరవై నెలలు ముగిశాక రిజిస్ట్రేషన్‌ చేసిన ప్లాటు అమ్మి ఆ వచ్చిన నగదు కూడా చెల్లిస్తామని నమ్మించారు. ఇది నమ్మిన కొంతమంది పెట్టుబడి పెట్టడంతో ఆ డబ్బులతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి ఓ రెండేళ్ల పాటు పెట్టుబడి పెట్టిన వారికి చెప్పిన ప్రకారం ప్రతినెలా వడ్డీతో పాటు ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో ఈ వ్యాపారం బాగుందని మరికొంత మంది పెట్టుబడి పెట్టేందుకు ముందకురావడంతో 2023లో డివైన్‌ డెవలపర్స్‌ బోర్డు మార్చి హైదరాబాద్‌లోని మేడిపల్లిలో పుడమి ప్రాజెక్ట్స్‌ పేరుతో నూతన కార్యాలయం ప్రారంభించారు.

ఏజెంట్లకు కమీషన్‌ ఇస్తామని ఆశ చూపి..

పుడమిగా ప్రాజెక్ట్స్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టించిన ఏజెంట్లకు రూ.10 లక్షలకు నెలకు రూ.40వేల చొప్పున కమీషన్‌ ఇస్తామని, పెట్టుబడిదారుడికి రూ.10 లక్షలకు ప్రతినెలా రూ.65వేల వడ్డీ చెల్లిస్తామని ఆశ చూపారు. దీంతో గతంలో డివైన్‌ డెవలపర్స్‌లో పెట్టుబడి పెట్టిన వారు తమ వద్ద ఉన్న నగదుతో పాటు తమ స్నేహితులు, బంధువులతో దాదాపు రూ.10లక్షల నుంచి రూ.2కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. అలా రెండు, మూడు వందల మంది నుంచి సుమారు రూ.200 కోట్లకు పైగా వసూలు చేశారు. అందులో మునుగోడు మండలానికి చుట్టుపక్కల గల చండూరు, గట్టుప్పల్‌, దేవరకొండ, నల్లగొండ తదితర ప్రాంతాలకు చెందిన 200కు పైగా బాధితులు రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడి పెట్టిన వారికి కేవలం రెండు నెలలు మాత్రమే వడ్డీలు చెల్లించారు. ఆ తర్వాత కంపెనీ బోర్డు ఎత్తేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడిపొయిందని, లాభాలు రావడం లేదని, భూములు అమ్మి పెట్టుబడి పెట్టిన అందరికీ తిరిగి నగదు ఇస్తామని 10నెలల పాటు నమ్మించారు. అందుకు జామీనుగా చెక్కులు కూడా ఇచ్చారు.

ఈడీ నోటీసులు వచ్చాయని అజ్జాతంలోకి..

పలువురు బాధితులు తమ డబ్బుల కోసం గత రెండు నెలలుగా నిర్వాహకుల ఇళ్ల చుట్టూ తిరిగినా లాభం లేక పోలీసులని ఆశ్రయిస్తామని చెప్పడంతో.. మరో రెండు, మూడు నెలలు తమకు సమయం ఇవ్వాలని, కొనుగోలు చేసిన భూములు మార్కెట్‌లో పెడితే అనుకున్న ధర రావడం లేదని నిర్వాహకులు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ కొందరు తాము మోసపోయామని తెలుసుకొని నల్లగొండ, హైదరబాద్‌ తదితర ప్రాంతాల్లో పోలీసులను ఆశ్రయించారు. ఇది తెలుసుకున్న నిర్వాహకులు పోలీసులు పిలిచిన సమయంలో తమకు ఈడీ నోటీసులు ఇచ్చిందని, ఈడీ కేసు పూర్తికాగానే అందరి డబ్బులు తిరిగి ఇస్తామని బాధితులకు ఒప్పంద పత్రాలు రాసిచ్చి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లారు.

రూ.18లక్షలు మోసపోయాను

పలివెలకు చెందిన ఓ వ్యక్తి పుడమిలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీతో పాటు ప్లాటు వస్తుందని చెబితే గతేడాది మే నెలలో రూ.18లక్షలు ఇచ్చాను. నేను ఇచ్చిన డబ్బులకు నాకు ఒక నెల వడ్డీ డబ్బులు రూ.1.80 లక్షలు ఇచ్చారు. మరుసటి నెల నుంచి వడ్డీ ఇవ్వలేదు. ఇదేమిటని నిర్వాహకుల వద్దకు వెళ్తే మూడు నెలల్లో నీ డబ్బులు నీకు ఇస్తామని కంపెనీ పేరుతో చెక్కు రాసి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నాకు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. నాతో పెట్టుబడి పెట్టించిన వ్యక్తి గత నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. నా డబ్బులు ఎవరిని అడగాలో అర్ధం కావడం లేదు.

– పోలగోని సైదులు,

చీకటిమామిడి, మునుగోడు

ఆస్తులమ్మి పెట్టుబడి పెట్టాను

పుడమిలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీతో పాటు ప్లాటు ఇస్తున్నారని నాకున్న ఆస్తులన్ని అమ్మి రూ.20 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినా. రెండు, మూడు నెలల పాటు వడ్డీ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిగా మానేశారు. ఇదేమి అంటే త్వరలో ఆస్తులు అమ్మి నా డబ్బులు నాకు తిరిగి ఇస్తామని నమ్మించారు. కానీ నేటికి ఇవ్వడం లేదు. నేను మోసపోయానని తెలిసి పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశా. కానీ నాకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు.

– రేవెల్లి మల్లేష్‌, మునుగోడు

ఫ పుడమి పేరుతో అమాయకుల

నుంచి కోట్ల రూపాయలు

కొల్లగొట్టిన కేటుగాళ్లు

ఫ కమీషన్‌ ఇస్తామని చెప్పి ఏజెంట్ల నియామకం

ఫ మునుగోడు నియోజకవర్గంలోనే 300మందికి పైగా బాధితులు

ఫ ఈడీ నోటీసుల పేరుతో అజ్ఞాతంలోకి వెళ్లిన మోసగాళ్లు

ఫ న్యాయం చేయాలని పోలీసులను

ఆశ్రయించిన పలువురు బాధితులు

బినామీల పేర్లతో ఆస్తుల కొనుగోళ్లు..

పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన నగదుతో నిర్వాహకులు వ్యాపారం చేయకుండా నల్లగొండ, హైదరాబాద్‌, మునుగోడు తదితర ప్రాంతాలల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసి తమ బంధువులు, కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ విషయం తెలియడంతో తమని కావాలనే మోసం చేశారని, తాము చట్టపరంగా వెళ్తేనే న్యాయం జరుగుతుందని పలువురు బాధితులు వాపోతున్నారు. పెట్టుబడి పెట్టిన వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద పెద్ద వ్యాపారులు ఉండటంతో తాము బయటకు వస్తే ఎక్కడ పరువుపోతుందోనని మదనపడుతున్నారు. తమ ఆస్తులు, బంగారు ఆభరణాలు అమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయిన తమకు పోలీసులు తగిన న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అధిక వడ్డీ ఆశచూపి మోసం1
1/2

అధిక వడ్డీ ఆశచూపి మోసం

అధిక వడ్డీ ఆశచూపి మోసం2
2/2

అధిక వడ్డీ ఆశచూపి మోసం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement