రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం
మిర్యాలగూడ టౌన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం వద్ద జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ కె. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని వాసవీనగర్కు చెందిన గౌరు మట్టయ్య(69) మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో గల దయానంద్ వృద్ధాశ్రమంలో గత 10 నెలలుగా ఉంటున్నాడు. వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు బుధవారం ఆయన ఆశ్రమం నుంచి నడుచుకుంటూ వెళ్తూ అద్దంకి–నార్కట్పల్లి ప్రధాన రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో మట్టయ్య ఎగిరి కిందపడిపోవడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు గౌరు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment