ఫ మరొకరికి గాయాలు ఫ మృతుడు ఆంధ్రప్రదేశ్ వాసి
చౌటుప్పల్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఇద్దరు స్నేహితులు సొంతూర్లకు వెళ్లారు. ఓటు వేసి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. అనంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఒకరు దుర్మరణం చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెం స్టేజీ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కొనికళ్ల దీపక్‌రాజ్(29), విశాఖపట్టణానికి చెందిన అనిరుధ్ స్నేహితులు. వీరిద్దరు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అద్దె ఇంట్లో ఉంటూ అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ నెల 13న ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను బస్సులో స్వగ్రామాలకు వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. కానీ టికెట్లు లభించకపోవడంతో బైక్‌పై వెళ్లారు. ఓటేసి బుధవారం తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం స్టేజీ వద్ద రోడ్డుపై ఆగిన కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దీపక్‌రాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. అనిరుధ్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదవరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment