Sakshi News home page

ఇంకుడు గుంతలు మరిచారు!

Published Mon, Apr 15 2024 1:35 AM

ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించిన ఇంకుడుగుంతలో పేరుకుపోయిన చెత్తాచెదారం - Sakshi

చెన్నారావుపేట : చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలాలను పెంచేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గతంలో ఇంకుడు గుంతలు నిర్మించారు. కానీ, చాలా ఇళ్లలో వాటిని నిర్లక్ష్యంగా వదిలేశారు. అధికారులు తమవంతు ప్రయత్నంగా ప్రజలకు అవగాహన కల్పించి వాటిని వినియోగంలోకి తేవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడు సంవత్సరాలుగా ఇంకుడు గుంతలను మరిచిపోయారు. వేసవికాలం రాకముందు ఎక్కడెక్కడ ఇంకుడు గుంతలు తవ్వాలో గుర్తించి స్థలాలను ఖరారు చేసేవారు. ఎండాకాలం ప్రారంభం కాగానే ఆయా స్థలాల్లో వాటిని నిర్మించారు. వర్షాకాలం నాటికి సిద్ధంగా ఉంచడంతో వర్షపు నీరు ఇంకుడు గుంతల్లోకి వెళ్లి భూగర్భ జలాలు పెరిగేవి.

కొన్ని ప్రాంతాల్లో ధ్వంసం..

ఇంకుడు గుంతల నిర్మాణంలో గతంలో మండల అధికారులు ప్రజలను భాగస్వాములను చేశారు. భూగర్భ జలాల సంరక్షణకు కాలనీవాసులు, వార్డు ప్రజలు ముందుకొస్తే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసేవారు. ఇళ్ల వద్ద యజమానులు, చేతి పంపులు, మంచినీటి ట్యాంకుల వద్ద కాలనీ సంఘాలు, ప్రతినిధులు నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు నేరుగా ఆయా శాఖలకు దరఖాస్తు చేసుకుంటే ఇంకుడు గుంతలు నిర్మిస్తామని హామీ ఇచ్చేవారు. గతంలో చేతిపంపులు, బోర్లు, ట్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల వద్ద ఇంకుగు గుంతలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయడంతో చాలా వరకు కనుమరుగు కావడంతోపాటు నిరుపయోగంగా మారాయి.

మంజూరైనవి 80,441.. నిర్మించినవి 41,342

జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో గ్రామాల వారీగా మంజూరు ఇచ్చి ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేపట్టారు. అధి కారుల ఆదేశానుసారం ఇంకుడు గుంతలు తవ్వా రు. అవి తూతూ మంత్రంగా తయారయ్యాయి. ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అధికారులు చెబుతున్నారు.ఇంటి నిర్మాణం చేపడుతున్నారంటే ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో 80,441 ఇంకుడు గుంతలు మంజూరు కాగా అందులో 41,342 నిర్మించారు. 1,007 అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇంకుడు గుంతల నిర్మాణాలను ప్రోత్సహించి, భూగర్భ జలాలను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో

భూగర్భ జలాల వివరాలు మీటర్లలో..

మండలం జనవరి ఫిబ్రవరి మార్చి

చెన్నారావుపేట 1.09 1.28 1.65

దుగ్గొండి 3.11 3.42 3.99

గీసుకొండ 3.09 3.58 4.38

ఖానాపురం 3.39 3.67 3.81

నల్లబెల్లి 5.68 6.48 7.07

నర్సంపేట 3.62 3.92 4.44

నెక్కొండ 2.33 2.52 2.80

పర్వతగిరి 9.23 10.47 13.36

రాయపర్తి 5.38 6.92 8.05

సంగెం 3.49 3.65 3.64

వర్ధన్నపేట 6.63 7.19 7.75

వరంగల్‌ 2.57 2.27 2.61

ఖిలా వరంగల్‌ 3.13 4.38 5.28

జిల్లాలో మంజూరు, నిర్మించిన

ఇంకుడు గుంతల వివరాలు..

మండలం మంజూరైనవి నిర్మించినవి

చెన్నారావుపేట 6,985 3,520

దుగ్గొండి 8,346 6,698

గీసుకొండ 5,302 2,413

ఖానాపురం 4,639 2,310

నల్లబెల్లి 7,543 3,088

నర్సంపేట 7,131 3,705

నెక్కొండ 7,505 4,618

పర్వతగిరి 10,012 4,688

రాయపర్తి 9,469 2,541

సంగెం 8,320 4,340

వర్ధన్నపేట 5,189 3,421

మొత్తం 80,441 41,342

ప్రజలకు అవగాహన కల్పించని అధికారులు

నిరుపయోగంగా ఏడేళ్ల నాటి నిర్మాణాలు

జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎండుతున్న చెరువులు, కుంటలు

ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి..

భూగర్భ జలాలను సంరక్షించుకోవడానికి ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత నిర్మించుకోవాలి. నిర్మించుకున్న వారు ఉపయోగించుకోవాలి. ఇంకుడు గుంతలపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. భూగర్భ జలాలను పెంపొందించడానికి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి.

– చింతకింది శివకృష్ణ, మాజీ సైనికుడు, ఉప్పరపల్లి

నీటిని వృథాగా పోనివ్వొద్దు..

వర్షపు నీరు, బోరునీరు, బావినీరు, ఇంటి పరిసరాల్లో వృథాగా పోయే నీటిని భూమిలోకి ఇంకేవిధంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. ఇంకుడు గుంతలు నిర్మించుకున్న వారు వాటిని ఉపయోగంలోకి తెచ్చుకోవాలి. నీరు వృథాగా పోనివ్వకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలి.

– కౌసల్య, డీఆర్‌డీఓ

Advertisement
Advertisement