‘వర్షా’తిరేకం! | Sakshi
Sakshi News home page

‘వర్షా’తిరేకం!

Published Wed, May 8 2024 5:15 AM

‘వర్ష

సాక్షి, విశాఖపట్నం : దాదాపు నెలన్నర రోజుల నుంచి విశాఖ వాసులు భానుడి ధాటికి వేగిపోతున్నారు. వడగాడ్పుల తీవ్రతతో సతమతమవుతున్నారు. సాధారణంకంటే 3–6 డిగ్రీల అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మేఘాలు, వర్షాల జాడ లేకపోవడంతో ఉష్ణతాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో మంగళవారం ఉదయాన్నే నగరంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. కాసేపటికే వరుణుడు రంగప్రవేశం చేశాడు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న పన్నీటి జల్లులను కురిపించి అందరిలోనూ ఆనందాన్ని నింపాడు. ఇలా మధ్యాహ్నం వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాన్ని కురిపించి చల్లదనాన్ని పరిచాడు. ఆ తర్వాత రోజంతా మబ్బులు ఆవరించి ఉండడంతో భానుడి జాడే కనిపించకుండా పోయింది. ఇన్నాళ్లూ తెల్లారి లేచేసరికే సెగలు కక్కే వాతావరణాన్నే చవిచూస్తున్న వైజాగ్‌ వాసులు మంగళవారం అందుకు భిన్నంగా ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. రోజంతా చల్లదనం పరచుకోవడంతో ఇన్నాళ్లూ రేయింబవళ్లు ఫ్యాన్లు, ఏసీలు విరామం లేకుండా వేసుకున్న వారు వాటితో పనిలేకుండా ఊరట చెందారు. నెల రోజుల నుంచి విశాఖ, పరిసరాల్లో 36 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాంటిది మంగళవారం 30.2 డిగ్రీలకు పడిపోయింది. ఇది సాధారణం కంటే 4.3 డిగ్రీలు తక్కువ కావడం విశేషం! కాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖలో రెండు సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సీతమ్మధారలో 2.8 సెం.మీలు, విశాఖ రూరల్‌ 1.7, పెందుర్తి 1.6, ఆనందపురం 1.3, సింహాచలం 1.2, పరదేశిపాలెం 1.2, గాజువాక 1.0, అగనంపూడి 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లోనూ విశాఖ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వడగాడ్పుల వేళ పన్నీటి జల్లులు

భానుడి వేడిని చల్లార్చిన వరుణుడు

నేడు, రేపూ తేలికపాటి వర్షాలు

నగరంలో వర్షం

కేఆర్‌ఎం కాలనీలో నేలకొరిగిన చెట్టు

‘వర్షా’తిరేకం!
1/2

‘వర్షా’తిరేకం!

‘వర్షా’తిరేకం!
2/2

‘వర్షా’తిరేకం!

Advertisement
Advertisement