అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత

Published Thu, Apr 18 2024 9:30 AM

అదానీ గంగవరం పోర్టు గేటు మోహరించిన పోలీసులు - Sakshi

భారీగా మోహరించిన పోలీసులు

పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టు వద్ద బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారంతా ఎదురు తిరిగారు. గంగవరం పోర్టులో పని చేస్తున్న నిర్వాసిత కార్మికులు 8 రోజులుగా పోర్టు గేటు వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కార్మికుల డిమాండ్లకు యాజమాన్యం ససేమిరా అనడంతోకార్మికులు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం పోలీసులను మోహరించారు. ఆందోళనకు దిగిన కార్మికులను చెదర గొట్టేందుకు ప్రయత్నించగా, వారు తిప్పికొట్టారు. ఈ సందర్భంగా నిర్వాసిత కార్మికుల కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పోర్టులో పని చేస్తున్న 4వేల మంది కార్మికులు ఆందోళన చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్మికులపై పోలీసులను ఉసిగొల్పడం సరికాదన్నారు.

అర్ధరాత్రి హైడ్రామా: గంగవరం పోర్టు వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఓ పక్క కార్మికులు తమ కుటుంబాలతో నిరసన తెలుపుతుంటే మరోపక్క యాజమాన్యం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కొంతమందిని తీసుకువచ్చి పోర్టులో పనులు చేయాలని ప్రయత్నించారు. దీంతో కార్మికులంతా ఒక్కసారిగా వారిని అడ్డుకున్నారు. యాజమాన్య ప్రతినిధులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రైవేటు కార్మికులను లోపలికి పంపిస్తే పెట్రో ల్‌ పోసుకుని నిప్పంటించుకుంటామని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సీసాలతో తీసుకువచ్చిన పెట్రోల్‌ చూపించి హెచ్చరించారు. దీంతో చేసేది లేక ప్రైవేటు కార్మికులను అక్కడి నుంచి పంపించేశారు.

యాజమాన్యంతో సీపీ చర్చలు

సీపీ రవిశంకర్‌ బుధవారం సాయంత్రం పోర్టు యాజమాన్య ప్రతినిధులతో చర్చించారు. ముందుగా కార్మికులతో మాట్లాడిన ఆయన, అనంతరం యాజమాన్యంతో చర్చలు జరిపారు.

Advertisement
Advertisement