Sakshi News home page

రోడ్ల బాగు ఊసేదీ?

Published Fri, Mar 29 2024 8:20 AM

వికారాబాద్‌ నుంచి దామగుండం మీదుగా పూడూరు వెళ్లే బీటీ రోడ్డు దుస్థితి  - Sakshi

వికారాబాద్‌ : జిల్లాలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అధ్వానంగా మారి వాహనదారులకు నరకం చూయిస్తున్నాయి. ప్రతిపాదనలు పంపామని చెబుతున్న అధికారులు కనీసం వాటికి మరమ్మతులు కూడా చేయటం లేదు. దీంతో ఏళ్ల తరబడి వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఆర్‌అండ్‌బీ అధికారులు, పంచాయతీరాజ్‌ అధికారులు స్పందించడం లేదు. ఎన్నికల సమయంలో తప్ప ప్రజాప్రతినిధులకు ఈ రోడ్ల దుస్థితి పట్టడం లేదు. వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి ప్రతిసారి వివరాలు సేకరిస్తున్నాం.. ప్రతిపాదనలు పంపుతున్నామంటున్నారే తప్ప తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్లకు సంబంధించి మూడు నుంచి ఐదుసార్లు టెండర్లు పిలవగా ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు.

గతేడాది నుంచి మరమ్మతులకు దిక్కులేదు..

జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలకు పాడైన ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంబంధించి ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 198 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు అధికారులు నిర్వహించిన సర్వేలో తేలింది. వీటిని పూర్తిస్థాయిలో పర్మినెంట్‌గా బాగు చేయటం కోసం రూ. 89 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. అవి మంజూరై వచ్చే లోపు తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు అవసరమైన రోడ్లను సైతం ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఇందుకు రూ. 8 కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కాగా ఇందులో ఆర్‌అండ్‌బీ శాఖ 98 కిలోమీర్ల మేర పాడైన రోడ్లకు రూ. 39 కోట్లు మంజూరు చేసింది. ఇక పంచాయతీ రాజ్‌ శాఖకు సంబంధించి పాడైన రోడ్లకు రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ఈ రెండు శాఖల్లోనూ ధ్వంసమైన రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు, రోడ్లు మంజూరు, టెండర్ల ప్రక్రియ దగ్గరే పరిస్థితి ఆగిపోయింది.

అధ్వానంగా మెజార్టీ రోడ్లు

జిల్లాలో ఒకటి రెండు రోడ్లు మినహా మెజార్టీ రోడ్లు పాడైయ్యాయి. పలు మార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, కొన్ని చోట్ల వారికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పలుచోట్ల పనులు చేపడుతుండటంతో అవి పూర్తయ్యే వరకు టెండర్లు వేయకూడదనే ఉద్దేశంతో ముందుకు రావడం లేదని సమాచారం.

అధ్వానంగా రహదారులు

వాహనదారులకు నరకయాతన

నిద్రావస్థలో ఆర్‌అండ్‌బీ,

పంచాయతీరాజ్‌ శాఖలు

జిల్లాలో మొత్తం ఆర్‌అండ్‌బీ రోడ్లు

953 కిలోమీటర్లు

గతేడాది పాడైన రోడ్లు 198 కిలోమీటర్లు

టెండర్లు పిలిచినా

ముందుకు రాని కాంట్రాక్టర్లు

Advertisement

What’s your opinion

Advertisement