Sakshi News home page

త్వరలోనే కుప్పానికి కృష్ణా జలాలు

Published Thu, Nov 16 2023 6:02 AM

హంద్రీ–నీవా కాలువ పనులు పరిశీలిస్తున్న 
ఎమ్మెల్సీ భరత్‌ , చిత్తూరు కలెక్టర్‌ షణ్మోహన్‌ - Sakshi

శాంతిపురం: త్వరలోనే కుప్పం ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ వెల్లడించారు. బుధవారం గుండిశెట్టిపల్లె వద్ద హంద్రీ–నీవా కుప్పం కాలువను పరిశీలించి, కాలువ కోసం భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడారు. కుప్పం కెనాల్‌లోకి నీరు వచ్చేందుకు శంకర్రాయులపేట, కృష్ణాపురం, ఆదినపల్లె వద్ద మూ డు ఎత్తిపోతల యూనిట్లు ఉన్నాయన్నారు. వీటిలో రెండు చోట్ల లిఫ్ట్‌ పనులు పూర్తి అయ్యాయని, ఆదినపల్లె వద్ద మరో వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువ కోసం భూములు కోల్పోయిన రైతులకు నెలాఖరులోపు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. రికార్డులు సక్రమంగా ఉండి, ఆయా భూముల్లో సాగులోని రైతులను ఏ కేటగిరీగా, రికార్డులు లేదా అనుభవం మాత్రమే ఉన్న వారిని బీ కేటగిరిగా, రెండవ కేటగిరీలో అర్హతలు లేనివారిని సీ కేటగిరిగా గుర్తించి పరిహారం చెల్లిస్తామని వివరించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం అందుతుందని తెలిపారు. ఆర్డీవో శ్రీనివాసులు, హంద్రీనీవా డీఈ రమేష్‌, డెప్యూటీ తహసీల్దార్‌ కౌలేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement