Sakshi News home page

శ్రీవారి పాదాల ఊరేగింపు

Published Thu, Nov 16 2023 6:02 AM

తిరుచ్చిపై శ్రీవారి పాదాలను ఊరేగింపుగా తీసుకువస్తున్న అర్చకులు, అధికారులు - Sakshi

చంద్రగిరి(తిరుచానూరు): తిరుచానూరు పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీవారి పాదాలను ఊరేగించారు. గరుడోత్సవం సందర్భంగా శ్రీవారి పాదాలను అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. అందులో భాగంగా దేవదేవుని పాదాలను పసుపు మండపానికి వేంచేపు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ బంగారు తిరుచ్చిపై శ్రీవారి పాదాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్‌, వీజీఓ బాలిరెడ్డి, ఏవీఎస్‌ఓ శైలేంద్రబాబు, అర్చకుడు బాబు స్వామి పాల్గొన్నారు.

టీటీడీ మహిళా ఉద్యోగుల సారె

కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పద్మావతీ అమ్మవారికి టీటీడీ జేఈఓ సదాభార్గవి ఆధ్వర్యంలో టీటీడీ మహిళా ఉద్యోగులు పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. జేఈవో మాట్లాడుతూ ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీ మహిళా ఉద్యోగులు సారె అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగులు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ వాణి, టీటీడీ మహిళా ఉద్యోగుల ప్రతినిధులు హేమలత, అనురాధ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement