డ్రగ్స్ విక్రయాల జాడ నుంచి బానిసల వివరాల వరకు..
ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్‌కు పెరుగుతున్న ఫిర్యాదులు
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యం.. ఆపై ప్రోత్సాహకాలు
బాధితుల్లోనూ భరోసా పెంచేలా చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతోపాటు డ్రగ్స్‌కు బానిసలైన వారికి చికిత్స, పునరావాసం అందించేందుకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ 24/7 పనిచేసేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ సత్ఫలితాలిస్తోంది. 2024 జూలైలో ప్రారంభించిన టోల్‌ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్ నంబర్ 8712671111కు ప్రజలు డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం ఇవ్వడంతోపాటు మత్తు పదార్థాలకు అలవాటుపడిన కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం కోసం హెల్ప్‌లైన్‌ను సంప్రదిస్తున్నారు. 2024 నుంచి ఈ నెల 9 వరకు 1,193 ఫిర్యాదులు తమకు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 622 ఫిర్యాదులు అందగా వాటిని విశ్లేషించి తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఫిర్యాదుల్లో 70 శాతం వాస్తవమే..: వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్‌పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఈ క్రమంలో అందుతున్న ఫిర్యాదులు, సందేశాల్లో సుమారు 70 శాతం వాస్తవమైనవిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక విచారణ, సమాచారం ధ్రువీకరణ అనంతరం అవసరమైన చోట ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. అలాగే సరైన సమాచారం అందిస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
అలాగే ఫిర్యాదుల ఆధారంగా తీసుకున్న చర్యలు, కేసుల పురోగతి గురించి వీలైనప్పుడల్లా ఫిర్యాదుదారులకు తెలియజేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ముందుకొచ్చి సమాచారం అందించేందుకు ప్రోత్సాహం లభిస్తోందని అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబ సభ్యులకు తగిన కౌన్సెలింగ్, డీ–అడిక్షన్ కేంద్రాల వివరాలు అందించడంతోపాటు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వినియోగదారులకు చికిత్స, పునరావాసం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
బాధితులకు కౌన్సెలింగ్, పునరావాసం...: డ్రగ్స్‌కు అలవాటుపడిన పిల్లలు, కుటుంబ సభ్యుల విషయంలో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, బంధువులు కూడా ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదిస్తున్నారు. బాధితులకు తగిన కౌన్సెలింగ్, డీ అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స, పునరావాసం కోసం అవసరమైన మార్గదర్శకత్వం ఈగల్ అధికారులు అందిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత కేంద్రాల్లో చేర్పించేందుకు ఈగల్ ఫోర్స్ సిబ్బంది సహకరిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వాటికి బానిసలైన వారిని చికిత్స ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావడమూ ముఖ్యమని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ–సిగరెట్ల విక్రయం గుట్టురట్టు
మైనర్లకు నిషేధిత ఈ–సిగరెట్లు విక్రయిస్తున్నారని టోల్‌ఫ్రీ నంబర్ 1908కు అందిన సమాచారంతో ఈగల్ ఫోర్స్, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ 3న మాదాపూర్‌లోని రెండు పాన్‌షాపులలో సోదాలు చేపట్టి 152 ఈ–సిగరెట్లు, 34 విదేశీ సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. 130 మంది కొనుగోలుదారులను గుర్తించారు. నిందితులు రెండేళ్లలో రూ. 2.10 కోట్లు ఆర్జించినట్లు గుర్తించారు.
మైనర్ల విషయంలో తల్లిదండ్రుల చొరవ..
ఈ నెల 8న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ తల్లి ఈగల్ టోల్‌ఫ్రీకి నంబర్‌కు ఫోన్ చేసి తన కుమారుడు, అతడి స్నేహితులు డ్రగ్స్‌కు బానిసలయ్యారని.. వారిని పునరావాస కేంద్రంలో చేర్పించి చికిత్స అందించాలని కోరింది. స్పందించిన ఈగల్ ఫోర్స్ 8 మంది వినియోగదారులు, ఒక పెడ్లర్‌ను అదుపులోకి తీసుకుంది. వారిలో ఆరుగురు మైనర్లు, ఇద్దరు పెద్దలున్నారు. పరీక్షల్లో వారందరికీ డ్రగ్ పాజిటివ్‌గా తేలడంతో డీఅడిక్ష¯న్ కేంద్రానికి తరలించారు.


