breaking news
Intoxicating substances
-
గుట్టుగా ఉంచుతారు.. లోగుట్టు పట్టేస్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతోపాటు డ్రగ్స్‌కు బానిసలైన వారికి చికిత్స, పునరావాసం అందించేందుకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ 24/7 పనిచేసేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ సత్ఫలితాలిస్తోంది. 2024 జూలైలో ప్రారంభించిన టోల్‌ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్ నంబర్ 8712671111కు ప్రజలు డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం ఇవ్వడంతోపాటు మత్తు పదార్థాలకు అలవాటుపడిన కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం కోసం హెల్ప్‌లైన్‌ను సంప్రదిస్తున్నారు. 2024 నుంచి ఈ నెల 9 వరకు 1,193 ఫిర్యాదులు తమకు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 622 ఫిర్యాదులు అందగా వాటిని విశ్లేషించి తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.ఫిర్యాదుల్లో 70 శాతం వాస్తవమే..: వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్‌పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఈ క్రమంలో అందుతున్న ఫిర్యాదులు, సందేశాల్లో సుమారు 70 శాతం వాస్తవమైనవిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక విచారణ, సమాచారం ధ్రువీకరణ అనంతరం అవసరమైన చోట ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. అలాగే సరైన సమాచారం అందిస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. అలాగే ఫిర్యాదుల ఆధారంగా తీసుకున్న చర్యలు, కేసుల పురోగతి గురించి వీలైనప్పుడల్లా ఫిర్యాదుదారులకు తెలియజేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ముందుకొచ్చి సమాచారం అందించేందుకు ప్రోత్సాహం లభిస్తోందని అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబ సభ్యులకు తగిన కౌన్సెలింగ్, డీ–అడిక్షన్ కేంద్రాల వివరాలు అందించడంతోపాటు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వినియోగదారులకు చికిత్స, పునరావాసం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. బాధితులకు కౌన్సెలింగ్, పునరావాసం...: డ్రగ్స్‌కు అలవాటుపడిన పిల్లలు, కుటుంబ సభ్యుల విషయంలో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, బంధువులు కూడా ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదిస్తున్నారు. బాధితులకు తగిన కౌన్సెలింగ్, డీ అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స, పునరావాసం కోసం అవసరమైన మార్గదర్శకత్వం ఈగల్ అధికారులు అందిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత కేంద్రాల్లో చేర్పించేందుకు ఈగల్ ఫోర్స్ సిబ్బంది సహకరిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వాటికి బానిసలైన వారిని చికిత్స ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావడమూ ముఖ్యమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ–సిగరెట్ల విక్రయం గుట్టురట్టు మైనర్లకు నిషేధిత ఈ–సిగరెట్లు విక్రయిస్తున్నారని టోల్‌ఫ్రీ నంబర్ 1908కు అందిన సమాచారంతో ఈగల్ ఫోర్స్, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ 3న మాదాపూర్‌లోని రెండు పాన్‌షాపులలో సోదాలు చేపట్టి 152 ఈ–సిగరెట్లు, 34 విదేశీ సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. 130 మంది కొనుగోలుదారులను గుర్తించారు. నిందితులు రెండేళ్లలో రూ. 2.10 కోట్లు ఆర్జించినట్లు గుర్తించారు. మైనర్ల విషయంలో తల్లిదండ్రుల చొరవ.. ఈ నెల 8న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ తల్లి ఈగల్ టోల్‌ఫ్రీకి నంబర్‌కు ఫోన్ చేసి తన కుమారుడు, అతడి స్నేహితులు డ్రగ్స్‌కు బానిసలయ్యారని.. వారిని పునరావాస కేంద్రంలో చేర్పించి చికిత్స అందించాలని కోరింది. స్పందించిన ఈగల్ ఫోర్స్ 8 మంది వినియోగదారులు, ఒక పెడ్లర్‌ను అదుపులోకి తీసుకుంది. వారిలో ఆరుగురు మైనర్లు, ఇద్దరు పెద్దలున్నారు. పరీక్షల్లో వారందరికీ డ్రగ్ పాజిటివ్‌గా తేలడంతో డీఅడిక్ష¯న్ కేంద్రానికి తరలించారు. -
గ‘మ్మత్తు’గా చిత్తు..!
మొదటిసారి మత్తుపదార్థాన్ని తీసుకున్నప్పుడు గ‘మ్మత్తు’గా అనిపిస్తుంది. ఆనందలోకాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇంకోసారీ అంతులేని ఆనందాన్ని పొందాలన్న భావనను రేకెత్తిస్తుంది. లొంగిపోయారో.. ఇక అంతే సంగతులు’’ అంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు షౌకీన్. ఒక్కసారి మత్తు పదార్థాన్ని తీసుకుంటే ఏమీ కాదని చాలా మంది భావిస్తారని, అయితే అది తనకు బానిసను చేసుకుంటుందని, జీవితాన్ని చిత్తు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. ముంబై: సాధారణంగా సరదాలు, జల్సాలు, స్నేహాల వల్ల తాగుడు, మత్తు పదార్థాలు అలవాటు అవుతాయి. కొందరికి వంశపారంపర్యంగానూ వ్యసనాలు అబ్బుతుంటాయి. మత్తుపదార్థాలు తమను ఏం చేయవన్న భ్రమలో వారుంటారు. గుట్కా, గుల్ఫారం వంటివాటితో నష్టమేమిటని ప్రశ్నిస్తారు. అవి ప్రాణాంతకాలని చెప్పినా నమ్మరు. తీసుకున్న మత్తు పదార్థం ఏదైనా సరే.. అది ఒంట్లోని సత్తువను తగ్గిస్తుందన్న సత్యాన్ని గమనించరు. ప్రజలు పొరపాటునో.. గ్రహపాటునో అనేక రకాల మత్తుపదార్థాలకు అలవాటుపడుతున్నారు. వాటికి బానిసలవుతున్నారు. ఈ అలవాట్లు ఆరోగ్యాన్ని క్షీణింపజేయడమే కాకుండా వ్యక్తిగత, కుటుంబ ప్రతిష్టనూ మసకబారుస్తాయి. ఆర్థిక స్థితిగతులపైనా ప్రభావం చూపుతాయి. ఆటుపోట్లకు కుంగి.. ప్రపంచీకరణతో మానవ జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. నిత్యజీవితంలో వేగం పెరిగింది. ఫలితంగా మానవ సమాజం విపరీతమైన ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. కొందరు మానసిక ఒత్తిళ్లు, భయం, ఆందోళనలకు గురవుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నవారిలో అధిక శాతం ఏదో ఒక వ్యసనానికి బానిస అవుతున్నారు. ‘‘వ్యక్తులకు సమస్యలు తలెత్తినపుడు వ్యాకులత ప్రారంభమౌతుంది. దీని వల్ల నిరుత్సాహం, నిద్రలేమి వెంటాడుతాయి. ఆ దశలో మానసిక ప్రశాంతత కోసం మత్తు పదార్థాలు, ఉత్ప్రేరకాలపై ఆధారపడంఅలవాటు చేసుకుంటారు’’ అని డాక్టర్ కేశవులు పేర్కొంటున్నారు. సమస్య దూరమవుతుందని భ్రమపడి.. తొలిసారిగా మత్తుపదార్థాలను తీసుకున్నపుడు ఏదో తెలియని అనుభూతి ఆవహిస్తుంది. ఉత్సాహం ఉరకలెత్తుతుంది. మత్తు వల్ల ఒత్తిళ్లు, బాధలు, సమస్యలు దూరమైన భావన కలుగుతుంది. అయితే ఆ మత్తు దిగిపోయాక మళ్లీ అవే సమస్యలు బాధపెడుతుంటాయి. వాటిని మరచిపోవడానికి నిన్నటి అనుభూతిని కోరుకుంటుంది మనసు. ఇలా క్రమంగా మత్తుపదార్థాలకు అలవాటుపడతారు. కుటుంబ సభ్యులు, హితులు వద్దని వారించినా వినిపించుకోరు. ఆ వ్యసనం లేనిదే బతకలేమన్న దుస్థితికి దిగజారిపోతారు. ఆ మత్తు అందకపోతే శరీరం, నాడీ వ్యవస్థ అదుపుతప్పుతుంది. వ్యసనా న్ని వీడేందుకు ప్రయత్నించినా విఫలమవుతారు. బలహీనతలే మూలకారణం తమలో లేని శక్తిని మత్తుపదార్థాల ద్వారా పొందాలనుకునే బలహీనులే ఎక్కువగా వ్యసనాలకు బలవుతున్నారు. అయితే చాలా మంది చెడు స్నేహాల వల్ల వ్యసనాల పాలవుతున్నారు. కారణమేదైనా యవ్వనంలోనే ఎక్కువమంది దారి తప్పుతున్నారు. మత్తుపదార్థాలకు అలవాటుపడుతున్నారు. చాలా సందర్భాల్లో పిల్లలు దారి తప్పుతున్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేరు. ఒకవేళ ఎవరైనా గుర్తించి, వారి దృష్టికి తీసుకెళ్లినా.. ఏదో తెలియనితనం అంటూ నిర్లక్ష్యం చేస్తారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలను మందలించడానికి కూడా వెనకాడుతారు. సమస్యలు ఇవి.. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల బానిసల్లో నాడీ రుగ్మతలు తలెత్తుతాయి. కొందరు భ్రమలు, భ్రాంతులకు గురవుతారు. వ్యసనం, డిప్రెషన్ తీవ్రత పెరిగిన వారిలో ఆత్మహత్య చేసుకోవాలన్న కోరికలూ చెలరేగుతాయి. కేన్సర్ వంటి వ్యాధులూ వస్తాయి. మత్తుపదార్థాలు స్వీకరించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మాన్పించే మార్గాలు వ్యసనపరులను మామూలు స్థితికి తీసుకురావొచ్చు. మామూలు స్థాయి వ్యసనపరులకు మాటలతో కౌన్సెలింగ్ సరిపోతుంది. కానీ తీవ్ర వ్యసనపరులకు కౌన్సెలింగ్ రుచించదు. వారిని మామూలు స్థితికి తీసుకురావటానికి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. హఠాత్తుగా వ్యసనాలను విడిచిపెట్టినా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మత్తుకు అలవాటు పడిన శరీరం, నాడీ వ్యవస్థ అదిలేనిదే తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. అందుకే వైద్యుల సూచనలు పాటిస్తూ క్రమంగా వ్యసనానికి దూరం కావాలి. మనోశక్తిని పెంపొందించడానికి యోగ, వ్యాయామాలు, ధ్యానం, సత్సాంగత్యం వంటివి దోహదపడతాయి.


