సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి. చిత్రంలో భిక్షంగౌడ్ (వృత్తంలో)
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ధ్వజం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్ పేరు ప్రకటన
నల్లగొండలో పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇంకా తాత్సారం చేస్తే మరో ఉద్యమం చేపట్టక తప్పదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ విధానం రద్దు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో లోపాల సవరణ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పీఆర్టీయూ 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
శాసనమండలిలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై ఎన్నోసార్లు తన గొంతు వినిపించానని, పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం లేద న్నారు. పుల్గం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో 72 వేల మంది సభ్యత్వం కలిగిన ఏకైక ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ అని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా భిక్షంగౌడ్
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరఫున సుంకరి భిక్షంగౌడ్‌ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడిగా 15 ఏళ్లపాటు పనిచేసిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, నిరుద్యోగుల సమస్యల సాధన కోసం శాసనమండలిలో తనతోపాటు మరో ఉద్యమ గొంతుక ఉండాలనే ఉద్దేశంతో భిక్షంగౌడ్‌ను అభ్యర్థిగా ప్రకటించినట్లు శ్రీపాల్‌రెడ్డి చెప్పారు. కౌన్సిల్ సమావేశానికి సుమారు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
పట్టణమంతా పీఆర్టీయూ జెండాలతో రెపరెపలాడింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్తా పాల్గొన్నారు.


