ఆ పట్టణాల్లో ఎన్నికలెప్పుడో? | Mandamarri and Manuguru Possessing municipal status yet without elections for years | Sakshi
Sakshi News home page

ఆ పట్టణాల్లో ఎన్నికలెప్పుడో?

Oct 15 2026 1:18 AM | Updated on Oct 15 2026 1:18 AM

Mandamarri and Manuguru Possessing municipal status yet without elections for years

పాలకమండళ్ల పదవీకాలం ముగిసినా ప్రత్యేక అధికారుల పాలనలోనే

గ్రేటర్‌ పరిధిలోని మూడు కొత్త కార్పొరేషన్లలో ఎదురుచూపుల పర్వం

8 నెలలుగా స్పెషల్‌ ఆఫీసర్ల పాలనలోనే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు

మున్సిపల్‌ హోదా ఉన్నా ఏళ్లుగా ఎన్నికలు లేని మందమర్రి, మణుగూరు

పురపోరుకు ఎదురుచూస్తున్న సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌

వార్డుల పునర్విభజన, ఓటరు జాబితాపై స్పష్టత వస్తేనే నోటిఫికేషన్‌ 

డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముందని ప్రభుత్వం సంకేతాలు?

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది ఆరంభంలో రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినా, ఐదు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారు­ల పాలన కొనసాగుతోంది. అయితే విధానపరమైన నిర్ణ­యాలు తీసుకునే అవకాశం లేక ఇక్కడ అభివృద్ధి కుంటుప­డు­తోందనే విమర్శలు ఉన్నాయి.

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ నవంబర్‌ 9న కొలిక్కి రానుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్త­యిన తర్వాతే వార్డుల విభజన, పోలింగ్‌స్టేషన్ల గుర్తింపు వంటి అంశాలు కొలిక్కి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పెండింగులో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు జరిగే అవకాశ­ముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

‘గ్రేటర్‌’పరిధిలో మూడు కార్పొరేషన్లు
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 150 డివిజన్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 10న పాలక మండలి పదవీ కాలం ముగిసింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరిస్తూ మరుసటి రోజు ఫిబ్రవరి 11న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 55ను జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లు, మల్కాజిగిరి కార్పొరేషన్‌ (ఎంఎంసీ)ని 74 డివిజన్లు, సైబరాబాద్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)ని 76 డివిజన్లుగా విభజించారు. 

అయితే కొత్త కార్పొరేషన్లు ఏర్పాటై ఎనిమిది నెలలు కావొస్తున్నా కొత్త కార్పొరేషన్ల పరిధి, డివిజన్ల సరిహద్దు, ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు వంటి అంశాలపై స్పష్టత లేదు. మరోవైపు ఈ పునర్వ్యస్థీకరణ సవాలు చేస్తూ హైకోర్టులో న్యాయవివాదం కొనసాగుతోంది. పాలన, న్యాయపరమైన అంశాలపై స్పష్టత వస్తేనే గ్రేటర్‌ కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశముంది. 

» ఈ ఏడాది మే 6న వరంగల్, మే 7న ఖమ్మం కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీకాలం కూడా ముగిసింది. ఈ ఏడా­ది ఫిబ్రవరిలో ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎ­న్ని­కలు జరిగిన సమయంలోనే వరంగల్, ఖమ్మం మే­యర్‌ పదవుల రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. గ్రేటర్‌ పరిధిలోని కొత్త కార్పొరేషన్లతోపాటే వీటికి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. 

»  అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సి­పాలిటీల్లోనూ ఈ ఏడాది మేలో పాలక మండళ్ల పదవీ కాలం ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీటి రిజర్వేషన్లు కూడా ఖరారు చేసినా ఎన్నికల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

దశాబ్దాలుగా ఎన్నికలకు దూరం
»  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు 2005లో మున్సిపాలిటీగా అవతరించింది. గిరిజన ప్రాంత చట్ట పరిధిలో ఉండటంతో ఎన్నికలు నిర్వహణపై న్యాయ వివాదం కొనసాగుతోంది. మణుగూరుకు గ్రామ పంచాయతీ హోదాలో చివరిసారిగా 2001లో ఎన్నికలు జరిగాయి. రెండు దశాబ్దాలుగా ఎన్నికల జరగకపోవడంతో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్చి ఎన్నికలు నిర్వహించాలనే వినతులు ప్రభుత్వానికి అందాయి.

»  మంచిర్యాల జిల్లా మందమర్రిని గ్రేడ్‌ 3 మున్సిపాలిటీగా మారుస్తూ 1995 మేలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1998లో పట్టణాన్ని 24 వార్డులుగా విభజించి ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చినా 1/70 చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని ఎస్టీలకు రిజర్వు చేయాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement