- జేఎల్ఎఫ్ రూపకర్త సంజయ్ కె. రాయ్‌తో రేఖ లహోటి ముఖాముఖి
- తన తొలి పుస్తకం ఆవిష్కరణ నేపథ్యంలో ఆసక్తికర సంభాషణ
- సృజనాత్మకత, కృత్రిమ మేధ, బాలల సంక్షేమంపై మాట్లాడిన రాయ్
సాక్షి, హైదరాబాద్: కళలు, సంస్కృతి, సాహిత్యం, మానవీయ విలువల మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ రూపకర్త, టీమ్‌వర్క్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు సంజయ్ కె. రాయ్ ఆసక్తికరమైన సంభాషణ సాగించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించిన ‘జేఎల్‌ఎఫ్ ఫస్ట్ ఎడిషన్ బుక్ లాంచెస్ అండ్ కన్వర్జేషన్స్’ కార్యక్రమంలో భాగంగా కళాకృతి ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు రేఖ లహోటితో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు.
తన తొలి పుస్తకం ‘దేర్ ఈజ్ ఎ ఘోస్ట్ ఇన్ మై రూమ్: లివింగ్ విత్ ది సూపర్ న్యాచురల్’ నేపథ్యంలో వ్యక్తిగత అనుభవాలు, కళల ప్రాధాన్యం, సామాజిక బాధ్యతలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ కె. రాయ్ ఆలలోచనలు ఆయన మాటల్లోనే..!!
నాగరికతలు అంతరించినా.. కళాత్మక ప్రయాణం ఆగదు..!!
నేను ఉద్దేశపూర్వకంగా రచయితగా మారలేదు.. కోవిడ్ సమయంలో ప్రచురణకర్తల సూచనతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. చిన్నతనంలో కోల్‌కతాలోని పూర్వీకుల ఇంట్లో ఎదురైన అనుభవం నుంచి ఢిల్లీ, ఖజురహో, రిషికేశ్, జెరూసలేం, ఎడిన్‌బరో వంటి ప్రాంతాల్లో ఎదురైన వింత అనుభవాలను ఇందులో ప్రస్తావించారు. వ్యక్తిగతంగా హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తినే.. కానీ భారతీయ జానపద సంప్రదాయాల్లో అతీంద్రియ కథలు, పాశ్చాత్య దేశాల కథనాల మధ్య వ్యత్యాసాలు.. దెయ్యాల కథల నుంచి మానవీయ విలువల వరకు నాపై చాలా ప్రభావం చూపించాయి.
‘‘కళ, కళాత్మకతకు సంబంధించి రేఖ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ’’.., కళాకృతులు ఒక సమాజపు చరిత్ర, జీవనశైలి, ఆలోచనా విధానాలకు నిదర్శనాలు. నాగరికతలు అంతరించినా మొహెంజోదారో నృత్యకారిణి కాంస్య విగ్రహం, భీంబేట్కా గుహా చిత్రాలు వంటి అద్భుతాలు.. వాటి జ్ఞాపకాలను తరతరాలకు అందిస్తాయి. కళలకు ప్రభుత్వాలు, సమాజం తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రకృతి, వస్తువులు, మనుషుల అనుభవాలన్నింటిలోనూ జ్ఞాపకాల ప్రాధాన్యం ఉంటుంది. కళారంగంపై కృత్రిమ మేధ ప్రభావం ఉంది. ఏఐ సృష్టించే కళలో పరిపూర్ణత కనిపించినా, మానవ సృజనలోని సహజత్వం, అనుభూతుల లోతు, సున్నితత్వం పూరించలేదు.
వీధి బాలల జీవితాల్లో కళల వెలుగులు..
‘‘సామాజిక సేవలో భాగంగా ప్రారంభమైన ‘సలామ్ బాలక్ ట్రస్ట్’ ప్రయాణాన్ని వివరిస్తూ’’.., వీధి బాలలకు ఆహారం, విద్య అందించాలనే ప్రయత్నంతో మొదలైన కార్యక్రమం.. నేడు ఏటా సుమారు 13 వేల మంది పిల్లలకు సేవలందించే స్థాయికి చేరింది. ఢిల్లీ పరిసరాల్లోని ఆశ్రయ కేంద్రాల ద్వారా పిల్లలకు విద్యతోపాటు కళల్లో శిక్షణనిస్తూ, వారి ప్రతిభను గుర్తించి జీవితంలో ముందుకు సాగేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. సరైన అవకాశాలు కల్పిస్తే వీధి బాలలు సైతం ఫొటోగ్రాఫర్లు, కళాకారులు, ఇంజినీర్లు, విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగగలరు. టీమ్‌వర్క్ ఆర్ట్స్ గురించి చెప్పాలంటే.. 17 దేశాల్లోని సుమారు 40 నగరాల్లో 33కు పైగా ఉత్సవాలను నిర్వహిస్తూ కళలకు అంతర్జాతీయ వేదిక కల్పిస్తున్నాం.


