పాలమూరుకే నీళ్లా.. నల్లగొండకు వద్దా? అధికారులపై గుత్తా ఫైర్‌ | Gutha Sukender Reddy Serious Comments On Water Issue | Sakshi
Sakshi News home page

పాలమూరుకే నీళ్లా.. నల్లగొండకు వద్దా? అధికారులపై గుత్తా ఫైర్‌

Oct 14 2026 12:42 PM | Updated on Oct 14 2026 12:42 PM

Gutha Sukender Reddy Serious Comments On Water Issue

సాక్షి, నల్లగొండ: పాలమూరు-నల్లగొండ జిల్లాల సాగునీటి అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. నీటి కేటాయింపుల విషయంలో కొందరు అధికారులు పాలకులపై ఒత్తిడి తెస్తున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరుకే నీళ్లన్నీ కావాలని, నల్లగొండకు నీళ్లు ఇవ్వకూడదని భావించడం సరికాదని స్పష్టం చేశారు.

నల్లగొండలో మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. డిండి ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించొద్దని అనడం ఏమిటని ప్రశ్నించారు. ఏదుల వద్ద తొమ్మిది మోటార్లను ప్రారంభించాలని సూచించారు. నల్లగొండకు నీళ్లు ఎలా ఇస్తారని ముఖ్యమంత్రిపై అధికారులు ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. అధికారులు చెప్పిన మాటలు విని ముఖ్యమంత్రి లేదా ఇతర పాలకులు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. పాలకులు, అధికారులు పాలమూరుకే నీళ్లు రావాలని, నల్లగొండకు రావొద్దని భావించే సంకుచిత మనస్తత్వాన్ని వీడాలని హితవు పలికారు.

నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ కారణంగా కాళ్లు, చేతులు పనిచేయని పరిస్థితికి చేరుకున్న బాధితులు ఉన్నారని గుత్తా గుర్తుచేశారు. వలస కూలీల గురించి మాట్లాడుతున్నవారు.. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరోసిస్‌ సమస్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని తెలిపారు. పాలమూరులో 25 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ప్రారంభమైనప్పటికీ.. వాటికి నీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారనే దానిపై స్పష్టమైన ప్రణాళిక లేదని గుత్తా వ్యాఖ్యానించారు. ఏఎంఆర్పీ ద్వారా హైదరాబాద్‌లోని కోటి మందికి తాగునీరు అందించడం లేదా? అని ప్రశ్నించారు.

మరోవైపు, విద్యుత్‌ కొనుగోలు చేయాలన్నా ప్రస్తుతం ఎక్కడా దొరికే పరిస్థితి లేదని గుత్తా అన్నారు. రబీ సీజన్‌లో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని సూచించారు. నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను గుర్తుచేసుకోవాలని పేర్కొంటూ, కోదండరామ్‌ ఈ అంశంపై సమగ్ర దృష్టితో మాట్లాడాలని అన్నారు. నీటి పంపిణీ విషయంలో అన్ని ప్రాంతాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: నిరసనల పేరిట అరాచకానికి యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement