హైదరాబాద్: రష్యా సైన్యంలో ఏజెంట్స్ మోసపూరిత మాటలతో చేరిన నలుగురు తెలంగాణ వాసులు సురక్షితమేనా..?, పూర్తి వివరాలు తెలుపాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు సీఎం ప్రజావాణి రాష్ట్ర ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో జరిగిన 262వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో రష్యా సైన్యంలో చిక్కుకున్న నలుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులు మరోసారి వచ్చి గద్వాల్ విజయలక్ష్మిని కలిసి తమ వారి ఆచూకీ కనుగొనాలని కోరారు.
నిజాంబాద్ జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కు చెందిన భూక్య రవీందర్ సిద్దుల అశోక్ ప్రకాష్ మహమ్మద్ అబ్జర్ ఖాన్ లను రష్యాలో ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి తీసుకెళ్లి మాయమాటలు చెప్పి రష్యా సైన్యంలో చేర్పించడంతో ఆ నలుగురు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు సీఎం ప్రజావాణిని ఆశ్రయించారు.
ఈ నలుగురిని మోసపూరితంగా రష్యాకు తరలించిన ఏజెంట్ ఉత్తరప్రదేశ్కు చెందిన గౌరవ్ ను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరచగా.. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని స్థానిక ఖిల్లా జైలుకు తరలించిన విషయం సీఎం ప్రజావాణి ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి వచ్చింది. వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో ఫోన్లో మాట్లాడిన గద్వాల్ విజయలక్ష్మి.. రష్యా సైన్యంలో ఆ నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారా లేదా అన్న విషయం ఆరా తీసి తమకు సమాచారం ఇవ్వాలని, దాన్ని బట్టి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలుపుతామని నిజామాబాద్ సిపి సమాధానం ఇచ్చారు.
కాగా హైదరాబాద్ నగరం ఉప్పల్ కు చెందిన జయంత్ అనే విద్యార్థి కూడా రష్యాకు చదువుకోవడానికి వెళ్లి పౌరసత్వం ఆశతో రష్యా పోలీస్ విభాగంలో చేరిన విషయం కూడా సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు అందింది.
సీఎం ప్రజావాణిలో 105 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన 262వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 105 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ శాఖకు 25, హోం శాఖకు 14, బీసీ శాఖకు 15, ఇతర శాఖలకు 51 దరఖాస్తులు అందాయి. ఈ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో స్టేట్ ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి, నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏ.సీ.పీ. ఉమేందర్, ఎన్. ఆర్. ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో ‘ఆపరేషన్ కవచ్’.. భారీగా వాహనాలు స్వాధీనం


