రథోత్సవం | Sakshi
Sakshi News home page

రథోత్సవం

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

వైభవంగా

సాక్షి, చైన్నె: మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారి వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరగ్గా, సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా వేకువ జామున ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అభిషేకాది పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను వేర్వేరుగా అలంకరించారు. సర్వాలంకారంతో ఉన్న స్వామి అమ్మవార్లు రథంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అతిపెద్ద రథంలో సుందరేశ్వర స్వామి, మరో రథంలో మీనాక్షి అమ్మవారి ఆశీనులయ్యారు. ఆలయం ఆవరణ నుంచి ఉదయం 7 గంటలకు రథాలు ఒకదాని తర్వాత మరొకటి భక్త జనుల శివనామస్మరణ మధ్య ముందుకు కదిలాయి. మీనాక్షి అమ్మవారి ఆలయ తక్కర్‌ రుక్మిణి పళణి వేల్‌, దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ చెల్లదురై, ఆలయ జాయింట్‌ కమిషనరన్‌ కృష్ణన్‌ రథాలకు జెండా ఊపారు. కీల్‌ మాసివీధి, తెర్కు మాసి వీధి, మేల్‌ మాసి వీధి, వడక్కుమాసి వీధులలో 5 కి.మీ దూరం రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ రథాలకు ముందుగా గజరాజులు, ఎద్దులు కదిలాయి. శివాచార్యులు, శివ శక్తులు శంఖం పూరిస్తూ, డమరకం వాయిస్తూ శంభో శంకరా, నమశ్శివాయ నామస్మరణ మారుమోగింది. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, గజేంద్రుడు తదితర దేవుళ్ల ఉత్సవ విగ్రహాలను సప్పరాలలో ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అడుగడుగునా భక్తజనులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్త కోటి శివనామ స్మరణ నడుమ స్వామివారి రథం ముందుకు సాగగా, వెనుక అమ్మవారి రథం అనుకరించింది. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి రథోత్సవం పూర్తయ్యింది 12.10 గంటలకు అమ్మవారి రథం ఆలయం వద్దకు చేరుకున్నాయి. వేలాదిగా భక్త జనం తరలి రావడంతో మదురై జన సంద్రంలో మునిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగం చేసింది. అలాగే భక్తుల సేవలో పలు సంఘాలు తరలించాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గించే విధంగా శీతల పానీయాల్ని అందజేశాయి.

నేడు వైగై నదీ ప్రవేశం

ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం మంగళవారం వైగై నదీ తీరంలో జరగనుంది. మదురైలో శైవం, వైష్ణవం సంబంధిత రెండు ఉత్సవాలు చిత్తిరై మాసంలో జరిపే విధంగా 400 ఏళ్ల క్రితం ఈ గడ్డను పాలించిన తిరుమలై నాయకర్‌ చర్యలు తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అంతకుమునుపు వేర్వేరుగా ఈ ఉత్సవాలు జరిగినా, తిరుమలై నాయర్‌ ఆదేశాలకు అనుగుణంగా శైవ,వైష్ణవ ఉత్సవాల మేళవింపుగా చిత్తిరై మాసంలో కనుల పండువగా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రెండు ఉత్సవాల మేళవింపుగా మీనాక్షి అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు తేనూరు నుంచి కళ్లలగర్‌ స్వామివారు (విష్ణుమూర్తి) బయలుదేరి రావడం, వైగై నదీ ప్రవేశ ఘట్టం జరగడం ఈ ఉత్సవాలలో ప్రత్యేకత. ఈ వేడుకల నిమిత్తం తేనూర్‌ నుంచి ఆదివారం రాత్రంతా బంగారు పల్లకిలో ప్రయాణించిన కళ్లలగర్‌ సోమవారం సాయంత్రానికి మదురైకు చేరుకున్నారు. రాత్రంతా దారి పొడవున భక్త జనులు కర్పూర హారతులు పట్టారు. అలాగే ఆ మార్గంలోని పలు ఆలయాల వద్ద స్వామివారిని ఆహ్వానిస్తూ పూజాది కార్యక్రమాలు జరిగాయి. మూండ్రు మావడి వద్ద స్వామి వారికి ఎదుర్‌ సేవ అత్యంత వేడుకగా జరిగాయి. తల్లాకులం ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న అళగర్‌ స్వామికి ప్రత్యేక తిరుమంజనం జరిగింది. ఇక్కడి నుంచి మంగళవారం ఉదయం జరిగే విశిష్ట పూజల అనంతరం శ్రీవిల్లి పుత్తూరు ఆండాల్‌ ఆలయం నుంచి వచ్చిన పూల మాలను ధరించి, బంగారు అశ్వరథంపై స్వామివారు వైగై నదీ ప్రవేశానికి వెళ్లనున్నారు. ఇందుకోసం ఆళ్వార్‌ పురం వైగై నదీ తీరంలో సర్వం సిద్ధం చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తారు దీంతో గట్టి భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఆధ్యాత్మిక నగరాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా మదురై ఉత్సవాల వ్యవహారం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. కళ్లలగర్‌ వైగై నదీ ప్రవేశం అనంతరం జరిగే ఎదుర్‌ సేవ సందర్భంలో వాహనంపై ఎలాంటి నీరూ చల్లకూడదనే ఆంక్షలను కోర్టు ఇప్పటికే విధించింది. దీనిని అమలు చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే వైగై నది ప్రవేశ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారు. ఈ పనులను పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం సంతృప్తిని వ్యక్తం చేసింది.

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

మదురై వీధులు భక్త జన సంద్రమయ్యాయి. సోమవారం అంగరంగ వైభవంగా మీనాక్షి సుందరేశ్వర స్వామి రథోత్సవం సాగింది. ఇక చిత్తిరై ఉత్సవాల్లో మరో ప్రధాన ఘట్టమైన కళ్లలగర్‌ వైగై నదీ ప్రవేశం మంగళవారం ఆళ్వార్‌ పురంలో జరగనుంది. ఇందుకోసం తేనూరు నుంచి కళ్లలగర్‌ స్వామి(విష్ణుమూర్తి) మదురైకు చేరుకున్నారు.

భక్తులను అనుగ్రహించిన

మీనాక్షీ సుందరేశ్వర స్వామి

జన సంద్రమైన ఆధ్యాత్మిక నగరం

నేడు కళ్లలగర్‌ వైగై నదీ ప్రవేశం

ఏర్పాట్లు పూర్తి

మదురైకు చేరుకున్న స్వామి వారు

Advertisement

తప్పక చదవండి

Advertisement