● బీచ్‌లలో ఎల్‌ఈడీ స్క్రీన్లపై ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షణ ● టీవీలకు అతుక్కు పోయిన జనం ●ర్యాలీలు, ఆలయాల్లో పూజలు ● భారత్‌ జట్టు ఓటమితో నిరాశ | - | Sakshi
Sakshi News home page

● బీచ్‌లలో ఎల్‌ఈడీ స్క్రీన్లపై ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షణ ● టీవీలకు అతుక్కు పోయిన జనం ●ర్యాలీలు, ఆలయాల్లో పూజలు ● భారత్‌ జట్టు ఓటమితో నిరాశ

Published Mon, Nov 20 2023 12:40 AM | Last Updated on Mon, Nov 20 2023 12:40 AM

- - Sakshi

ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫీవర్‌ తమిళనాట అభిమానులను ఉర్రూతలూగించింది. ఎక్కడ చూసినా భారత జట్టుకు మద్దతుగా అభిమానోత్సాహం మిన్నంటింది. బీచ్‌లు, పార్కులు, మైదానాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి జనం మ్యాచ్‌లను వీక్షించారు. ముందుగా ఆలయాల్లో గెలుపు కోసం పూజలు చేశారు. జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు చేశారు. కానీ రాత్రి ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

సాక్షి, చైన్నె: తమిళనాట క్రికెట్‌ అభిమానులకు కొదవ లేదు. మ్యాచ్‌ ఎలాంటిదైనా ఇక్కడ ప్రజలు అధిక ప్రాధాన్యమివ్వడం పరిపాటి. అలాంటిది ప్రపంచ కప్‌ ఫైనల్‌ కావడంతో ఆదివారం రోజంతా క్రికెట్‌ ఫీవర్‌ జనాన్ని ఊపేసింది. ఇన్నాళ్లూ ఇక్కడి చిదంబరం స్టేడియంలో ఐపీఎల్‌, సీసీఎల్‌ పోటీలను వీక్షించిన అభిమానులు, గత నెల రోజులుగా జరిగిన ప్రపంచ కప్‌ పోటీలలో భాగంగా వివిధ జట్లు మ్యాచ్‌లను స్టేడియంలో తిలకించారు. ఈ పరిస్థితుల్లో భారత జట్టు ప్రపంచ కప్‌ ఫైనల్‌లోకి చేరడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో ఆస్ట్రేలియాతో ఆదివారం మ్యాచ్‌ను తిలకించేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు.

ఎటు చూసినా..

చైన్నె, కోయంబత్తూరు, సేలం,మదురై, తిరునల్వేలి, తిరుచ్చి వంటి నగరాలలో పార్కులు, మైదానాలు అంటూ ఎటు చూసినా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి మ్యాచ్‌ను చూశారు. చైన్నెలోని మెరీనా తీరంలో, బెసెంట్‌ నగర్‌ బీచ్‌లలో తమిళనాడు క్రీడాశాఖ నేతృత్వంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అభిమానులు, జనం కూర్చుని మ్యాచ్‌లను వీక్షించారు. ఇక ఉదయం నుంచే పలు ఆలయాల్లో అభిమానులు భారత జట్టు గెలుపు కోసం పూజలు చేశారు. జాతీయ పతాకాన్ని చేత బట్టి ర్యాలీలు నిర్వహించారు. మధ్యాహ్నం తర్వాత జనం టీవీలకే ఇళ్లలో అతుక్కుపోయారు. దీంతో నగరాలలోని అనేక మార్గాలు నిర్మానుష్యంగా మారాయి. వినోద కేంద్రాలు వెలవెల బోయాయి. భారత జట్టు బ్యాటింగ్‌ ప్రారంభంకాగానే తాము స్టేడియంలోనే ఉన్నంతగా భావించిన అభిమానులు ఎల్‌ఈడీ స్క్రీన్ల ముందు నృత్యం చేస్తూ సందడి చేశారు. కానీ తర్వాత భారత్‌ జట్టు తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ కావడంతో పాటు ఆస్టేలియా బ్యాటర్లు విజృంభించడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మెరీనా బీచ్‌లో అభిమానుల సందడి
1/1

మెరీనా బీచ్‌లో అభిమానుల సందడి

Advertisement
 
Advertisement
 
Advertisement