దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు | Sakshi
Sakshi News home page

దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు

Published Sun, May 26 2024 5:00 AM

దోపిడీ కేసులో ఆరుగురు అరెస్టు

నరసన్నపేట: సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో ఇటీవల జరిగిన రూ.10 లక్షల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఆరుగురిని అరెస్టు చేసి రూ.4.80 లక్షలు రికవరీ చేశారు. ఈ నెల 18న ఈ ఘటన జరగ్గా, అదే రోజు సాయంత్రం బాధితుడు సారవకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు వివరాలు సేకరించిన ఎస్‌ఐ అప్పారావు సిబ్బందిని వెంటనే అలెర్ట్‌ చేశారు. నరసన్నపేట సీఐ బూర ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి వారం రోజుల్లోనే కేసు కొలిక్కి తీసుకువచ్చారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ బాలచంద్రరెడ్డి శనివారం నరసన్నపేట సీఐ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.

పక్కా పథకం ప్రకారం..

అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన కాంట్రాక్టర్‌ నక్కల్ల మణికంఠ శ్రీ కన్‌స్ట్రక్షన్‌లో ఓ బిల్డర్‌. ఈయన వద్ద యువరాజు అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. గత పరిచయం మేరకు ధర్మలక్ష్మీపురం వద్ద ఒక స్థలం అమ్మకానికి ఉందని, స్థలం చూసే ముందు కొంత మొత్తం టోకెన్‌ అడ్వాన్స్‌గా ఇవ్వాలని యువరాజు మణికంఠకు చెప్పాడు. దీంతో మణికంఠ రూ.10 లక్షలు పట్టుకొని ఈ నెల 18న ఆ స్థలం వద్దకు కారులో వచ్చాడు. అదే సమయంలో షడన్‌గా మరో కారులో నలుగురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని చెప్పి ఆ డబ్బును దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయారు. వెంటనే మణికంట ఆ కారును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 12 మంది భాగస్వామ్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలగా వీరిలో ఆరుగురు (నిమ్మల మనోజ్‌కుమార్‌, బిడ్డక యువరాజు, సోలిమాన్‌ కరోడా, పసుపు రెడ్డి తవుడు, అగ్గల రాజేష్‌, జీబంట లీమా)ను భామిని మండలంలోనూ, పర్లాకిమిడి వద్ద అరెస్టు చేశారు. వీరి వద్ద రూ.4.80 లక్షలు రికవరీ చేశారు. కారు, ద్విచక్ర వాహనం సీజ్‌ చేశారు. మిగిలిన ఆరుగురు కోసం గాలిస్తున్నామని, మరో రూ.5.20 లక్షలను రికవరీ చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. ఎస్‌ఐ అప్పారావు, కానిస్టేబుల్స్‌ దాలినాయుడు, జోగారావు, గోపాలరావు, జి.సత్యనారాయణలు చురుగ్గా స్పందించి కేసును ఛేదించినందుకు రివార్డు కోసం ఎస్పీ రాధిక ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు.

రూ.4.80 లక్షలు రికవరీ

ధర్మలక్ష్మీపురం కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ

Advertisement
 
Advertisement
 
Advertisement