మహిళా చెస్‌ చాంపియన్‌షిప్‌ ఎంపిక పోటీలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

మహిళా చెస్‌ చాంపియన్‌షిప్‌ ఎంపిక పోటీలు ప్రారంభం

Published Sun, May 26 2024 7:40 AM

మహిళా చెస్‌ చాంపియన్‌షిప్‌ ఎంపిక పోటీలు ప్రారంభం

హిందూపురం: స్పార్టాన్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా చెస్‌ అసోసియేషన్‌, ఆంధ్రా చెస్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో పట్టణంలో రాష్ట్ర మహిళా చెస్‌ చాంపియన్‌షిప్‌–2024 ఎంపిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 45 మంది క్రీడాకారిణులు పోటీల్లో పాల్గొన్నట్లు ఇంటర్నేషనల్‌ ఆర్బిటర్‌, టోర్నమెంట్‌ చీఫ్‌ ఆర్బిటర్‌ అమ్మినేని ఉదయ్‌కుమార్‌నాయుడు తెలిపారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ విద్యాసాగర్‌ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురంలో మొదటిసారిగా మహిళా చాపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. టోర్నీ డైరెక్టర్‌ ఆరిఫుల్లాఖాన్‌ను అభినందించారు. పోటీల్లో ప్రతిభచూపిన టాప్‌–4 క్రీడాకారిణులను జాతీయ మహిళా చెస్‌ చాంపియన్‌షిప్‌–2024కు ఎంపిక చేస్తామని, వారు రాష్ట్రపోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

దొంగ అరెస్టు

గుంతకల్లుటౌన్‌: పట్టణంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న స్థానిక ఉమామహేశ్వర్‌నగర్‌కు చెందిన నల్లబోతుల వాసు అనే దొంగను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వన్‌టౌన్‌ సీఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాలు.. గతనెల 19న ప్రశాంతినగర్‌లోని రైల్వే క్వార్టర్స్‌లో చోరీ జరిగింది. నల్లబోతుల వాసు ఈ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించుకుని అతడిపై నిఘా పెట్టారు. పక్కా సమాచారం మేరకు శనివారం ఉదయం హజరత్‌ మస్తానయ్య దర్గా వద్ద దొంగలించబడిన ఓ హోండా యాక్టివాపై వెళ్తున్న వాసును సీఐ, సిబ్బంది పట్టుకుని విచారించారు. రైల్వే క్వార్టర్స్‌తో పాటు అనంతపురం త్రీటౌన్‌ పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు అతడు అంగీకరించాడు. చోరీ చేసిన 1.91 గ్రాముల బంగారు నగలు, 28.55 గ్రాముల వెండి, హోండా యాక్టివా వాహనం, సామ్‌సంగ్‌ ఎల్‌ఈడీ టీవీ, సామ్‌సంగ్‌ ట్యాబ్‌, మిక్సీ, కొత్తదుస్తులను స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement