జిల్లాలో 144 సెక్షన్
● నేటి నుంచి జూన్ 4 వరకూ అమలు
● ఎస్పీ మాధవరెడ్డి వెల్లడి
పుట్టపర్తి టౌన్: జిల్లాలో బుధవారం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకూ అంటే జూన్ 4వ తేదీ వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. హింసాత్మక ఘటనలకు, రెచ్చగొట్టేలా ఏ ఒక్కరూ వ్యవహరించకూడదన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా యంత్రాంగం సమష్టి కృషి, రాజకీయ పార్టీ నేతల సహకారం, ప్రజల స్వచ్ఛంద మద్దతుతో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. పోలింగ్ ముగిసినందున అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలని, హింసాత్మక సంఘటనలకు దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో సైతం రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఎక్కడా గుంపులు, గుంపులుగా ఉండకూడదని, అల్లర్లు, ఘర్షణ జోలికి వెళ్లకూడదన్నారు. అనుమతులు లేకుండా ఎక్కడా సభలు, ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. అయితే పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు మినహాయింపు ఉంటుందన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహరించాలని కోరారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment