కిట్టయ్య మనసు బంగారం
పెద్దపప్పూరు: పుట్టింది నిరుపేద కుటుంబంలోనే అయినా తనకున్నంతలో మూగజీవాల ఆకలి దప్పికలు తీరుస్తున్నాడు కిట్టయ్య. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ సేవ కొనసాగిస్తూ వస్తున్నాడు.
కిట్టయ్య రాక కోసం ఎదురుచూపు..
నార్పల మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన కిట్టయ్య రాక కోసం ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని మూగజీవాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అరటి చెట్లకు సపోర్టుగా పెట్టే కట్టెల విక్రయంతో జీవనం సాగిస్తున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజూ 8 కిలోల బెల్లం అన్నం, వ్యాపారుల నుంచి సేకరించిన వివిధ రకాల పండ్లు, బ్రెడ్డును తన సొంత ఆటోలో వేసుకుని కుమారులు సాయికుమార్, గిరీష్ కుమార్‌తో కలసి ముచ్చుకోట అటవీ ప్రాంతానికి వెళుతుంటారు. ఇలా రోజూ రెండు పూటలా క్రమం తప్పకుండా అటవీ ప్రాంతానికి చేరుకుని ఆటో హారన్ కొట్టగానే ఎక్కడున్న కోతులు ఒక్కసారిగా అక్కడకు చేరుకుంటాయి. కిట్టయ్య అందించే ఆహారాన్ని కడుపార తిన్న తర్వాత నీటి తొట్లలో ఉన్న నీరు తాగి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుంటాయి. నీటి తొట్లను సైతం దాతల సహకారంతో కిట్టయ్యనే ఏర్పాటు చేశాడు. రెండు పూటలా ఓ డ్రమ్ము నీటిని తీసుకెల్లి తొట్లను నింపుతుంటాడు. అటుగా వెళుతున్న వారు కిట్టయ్య సేవ చూసి అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment