‘వేసవి’ దొంగలతో జాగ్రత్త
బత్తలపల్లి: వేసవి అంటే కేవలం ఉక్కపోత, వడదెబ్బే కాదు... దొంగతనాలు కూడా ఉంటాయి. జనం హాయిగా ఆరు బయటనో, మిద్దైపెనో నిద్రపోతుంటే దొంగలు ఎంచక్కా బీరువాలు తెరిచి సొత్తుతో ఉడాయిస్తుంటారు. వేసవిలో విహారయాత్రలు, తీర్థ యాత్రలకు, ఊళ్లకు వెళ్లే కుటుంబాలే లక్ష్యంగా దొంగలు చెలరేగుతారు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉంటే చోరీలకు అడ్డుకట్ట వేయవచ్చునని పోలీసులు అంటున్నారు. ఈ అంశంపై ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ఇంతకు పోలీసులు చెబుతున్నదేమిటో పరిశీలిద్దామా....
● ఇంటి కిటికీలు మూసివేయాలి. వాటికి ఉన్న బోల్టులు సక్రమంగా ఉన్నాయో, లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
● దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదు.
● ఆరు బయట, మిద్దెలపై నిద్రించే వారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి ఒకటికి రెండు తాళాలు వేసుకోవాలి.
● బంగారు ఆభరణాలు ధరించి ఆరుబయట నిద్రించకూడదు. ఇంట్లో పడుకున్నా కిటికీలు తెరిచి ఉండే వైపు పడుకోరాదు.
● వీలైతే ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కలను కట్టేయాలి. ఇంట్లో ఎలాంటి అలికిడి వినిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. అలసత్వం ప్రదర్శించరాదు.
● అపరిచిత వ్యక్తుల వాహనాల్లో ప్రయాణించరాదు.
● దూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలపాలి.
● రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వస్తే వారి వివరాలు తెలుసుకుని నమోదు చేసుకోవడం మంచిది.
● అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలి.
● ఇంట్లోని బంగారు నగలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమం.
చోరీల నియంత్రణకు చర్యలు
వేసవిలో చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాటు చేశాం. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నాం. ఈ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
– పి.శ్రీనివాసులు, ఎస్‌ఐ, బత్తలపల్లి
అప్రమత్తతతో చోరీలకు
అడ్డుకట్ట
ప్రజలకు పోలీసుల సూచనలు
Comments
Please login to add a commentAdd a comment